ప్రతీ ఉద్యోగి, ప్రజాప్రతినిధి సీపీఆర్‌పై శిక్షణ పొందాలి
ABN , First Publish Date - 2023-03-28T00:14:27+05:30 IST
ప్రతీ ఉద్యోగి, ప్రజాప్రతినిధి సీపీఆర్‌పై శిక్షణ, అవగాహన కలిగి ఉండేలా శిక్షణ ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
ఏఈడీ మిషన్ ఉంటేనే పరిశ్రమలు, అపార్ట్‌మెంట్లకు అనుమతి
ఆరోగ్య ఉపకేంద్రాలకు రూ.15 కోట్లతో 1,200 ఏఈడీలు
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి అర్బన్, మార్చి 27 : ప్రతీ ఉద్యోగి, ప్రజాప్రతినిధి సీపీఆర్‌పై శిక్షణ, అవగాహన కలిగి ఉండేలా శిక్షణ ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై జిల్లాస్థాయి శిక్షణ, అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమయం ఏదైనా.. ఏ వయస్సు వారికైనా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతీరోజు సుమారు 4 వేల మంది, ఏడాదికి 15 లక్షల మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని వివరించారు. సీపీఆర్‌తో ప్రతీ పది మంది బాధితుల్లో ఐదుగురి ప్రాణాలను కాపాడవచ్చని స్పష్టం చేశారు. దేశంలో కేవలం 2 శాతం మందికే సీపీఆర్‌పై అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రాణనష్టాన్ని తగ్గించేందుకే సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. కార్డియాక్ అరె్‌స్టకు గురైతే బాధితుడి గుండె కొట్టుకునేలా ఛాతిపై ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమశ్వాస అందించడం ద్వారా గుండె, ఊపిరితిత్తులు తిరిగి పనిచేసేలా చేయవచ్చని వివరించారు. సీపీఆర్ ద్వారా గుండె స్పందించకపోతే ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్స్ (ఏఈడీ) పరికరం ద్వారా స్వల్ప మోతాదులో ఎలక్ర్టిక్‌షాక్ ఇవ్వడం ద్వారా గుండె పనిచేసేలా చేయడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సీపీఆర్ చేసేందుకు చదువు, మెడికల్ పరిజ్ఞానం, వయస్సుతో సంబంధం లేదని, సమయస్ఫూర్తి ఉంటే ఎవరైనా ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. జిల్లాలో శిక్షణ పొందిన ఏడుగురు మాస్టర్ ట్రైనర్లు విడతలవారీగా వైద్యసిబ్బంది, మున్సిపల్, పోలీసు సిబ్బంది, గేటెడ్‌కమ్యూనిటీలు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ సెక్యురిటీ, వాచ్‌మెన్‌లకు ఇలా వివిధవర్గాలకు చెందినవారికి సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలియజేశారు. ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్స్(ఏఈడీ) వైద్య పరికరం ఉంటేనే పరిశ్రమలు, అపార్ట్‌మెంట్లకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం నిబంధనలు తీసుకొస్తుందని మంత్రి తెలిపారు. రూ.15 కోట్లతో 1,200 ఏఈడీ మిషన్లు కొనుగోలుచేసి రాష్ట్రంలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలకు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి సీపీఆర్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం కొత్త బస్టాండ్‌లో శ్రీశైలం వెళ్లేందుకు కేటాయించిన నాలుగు నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ మంజూశ్రీ జైపాల్‌రెడ్డి, హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ రమణకుమార్, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్, ధర్మారెడ్డి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ గాయత్రీదేవీ, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, సిబ్బంది, ఆర్టీసీ ఆర్‌ఎం సుదర్శన్, డీఎం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.