అభివృద్ధిలో గజ్వేల్‌కు గజమాల
ABN , First Publish Date - 2023-04-21T23:47:44+05:30 IST
గజ్వేల్ అభివృద్ధి గూర్చి ఎంత చెప్పినా తక్కువేనని, గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి గజమాల లాంటిదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
నాడు గతుకుల గజ్వేల్... నేడు బతుకుదెరువుకు నిలయం
రింగ్‌రోడ్డులో ప్రయాణిస్తుంటే అమెరికాలో ఉన్నట్లుంది
అల్లావుద్దీన్ అద్భుతదీపం అక్కర్లేదు.. మన దీపం కేసీఆర్ ఉన్నారు
త్వరలో ఉద్యోగులకు ఈహెచ్‌ఎ్‌స ద్వారా నగదురహిత వైద్యం
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్ పట్టణంలో మంత్రి సుడిగాలి పర్యటన
గజ్వేల్, ఏప్రిల్ 21: గజ్వేల్ అభివృద్ధి గూర్చి ఎంత చెప్పినా తక్కువేనని, గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధి గజమాల లాంటిదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన మండల బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన అనంతరం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో గజ్వేల్‌లో రైతు ఆత్మహత్యలు, నీటి గోసలు ఉండేవని, ఆయా రాష్ట్రాలు, విదేశాల నుంచి జర్నలిస్టులు వచ్చి ఇక్కడి రైతుల దీనగాథను కథనాల రూపంలో ప్రచురించేవారని గుర్తుచేశారు. గతంలోని గతుకుల గజ్వేల్.. ప్రస్తుతం బతుకుదెరువుకు నిలయంగా మారిందని తెలియజేశారు. కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నుంచి ప్రాతినిథ్యం వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రింగ్‌రోడ్డును చూస్తూంటే హైదరాబాద్‌లో ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. రింగ్‌రోడ్డులో ప్రయాణిస్తుంటే అమెరికాలో ఉన్నట్లుందన్నారు. తెలంగాణ రాక ముందు గజ్వేల్ మండలంలో 2,300 ఎకరాల్లో వరి సాగు ఉంటే ప్రస్తుతం 15,500 ఎకరాలకు పెరిగిందని, ఇదంతా కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. నిజాన్ని ప్రచారంలో పెడితే అబద్ధం పెరగదని అంబేడ్కర్ అన్నారని, ఆ విషయాన్ని ప్రచారంలో పెట్టాలని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సెల్ఫీస్పాట్‌గా మారిన గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం సెల్ఫీస్పాట్‌గా మారిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కోమటిబండ, మల్లన్నసాగర్, సమీకృత మార్కెట్ వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఐఏఎ్‌సలు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, మేధావులు, లాయర్లు, జర్నలిస్టులు, మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చి సెల్ఫీలు దిగుతున్నారని గుర్తుచేశారు. మహారాష్ట్ర జనం ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ పేరుతో ఇక్కడి అభివృద్ధిని చూసేందుకు తరలివస్తున్నారన్నారు.
మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీద్‌లో ముస్లింలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 200 మైనారిటీ గురుకుల విద్యాలయాలు కూడా లేవని, కానీ తెలంగాణ రాష్ట్రంలోనే 200 గురుకులాలు ఉన్నాయన్నారు. గజ్వేల్ మైనారిటీల షాపింగ్‌కాంప్లెక్స్, షాదీఖానా, ఈద్గా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అభివృద్ధి చేసుకోవడానికి అల్లావుద్దీన్ అద్భుతదీపం అక్కర్లేదని, మన దీపం కేసీఆర్ ఉన్నారని అన్నారు.
గతంలో జన్మభూమి పేరుతో ఉద్యోగులకు ఇబ్బందులు
గజ్వేల్ పట్టణంలోని ముట్రాజ్‌పల్లి రోడ్డులో టీఎన్జీవో భవనాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడుతూ ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ తమదని, సీఎం కేసీఆర్ అనేకసార్లు చెప్పారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉద్యోగుల సహకారంతోనే ప్రజలకు చేరుతున్నాయన్నారు. గతంలో జన్మభూమి పేరుతో ప్రభుత్వాలు హింసించాయని, సస్పెండ్‌లు, మెమోలు ఇస్తూ ఇబ్బందులకు గురిచేశాయని గుర్తుచేశారు. ఇప్పటికీ పక్క రాష్ట్రాల్లో సమ్మెకు వెళ్లే ఉద్యోగులపై టాడా కేసులు పెడుతున్నారని మంత్రి అన్నారు. దేశంలోనే అత్యధిక వేతనాలను అందుకుంటున్న వారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులేనని, త్వరలో ఉద్యోగులకు ఈహెచ్‌ఎ్‌స ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందించేందుకు విధివిధానాలను రూపకల్పన చేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
బస్తీ దవాఖానాతో సుస్తీకి చెక్
బస్తీ దవాఖానాతో ప్రజల సుస్తీకి చెక్ పడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని 9వ వార్డులో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డికి మంత్రి సమక్షంలో వైద్యులు బీపీని చెక్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవసరమైన వారికి పరీక్షలు ఉచితంగా చేస్తారని, బస్తీ దవాఖానాను వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని తెలిపారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం
గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో రూ.81.50 లక్షలతో నిర్మించిన భూసార పరీక్షా కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పలుమార్లు డీఏవో శివప్రసాద్‌ను ఉద్దేశించి మీ వాళ్ల పనితీరు ఇట్లుంది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పామాయిల్ సాగు పెంపుపై దృష్టి పెట్టాలని, మిథైల్ గ్యాస్ గూర్చి అవగాహన కల్పించాలన్నారు. వరి పంటమార్పిడి చేయకపోవడంతో రోగాలు పడుతున్నామని, దీంతో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన బియ్యాన్ని వండుకుని తినడంతో క్యాన్సర్ బారిన పడుతున్నామని మంత్రి తెలిపారు. పంట మార్పిడి, పచ్చిరొట్టె విత్తనాల సాగుపై అవగాహన కల్పించాలని కోరారు.
సెంట్రల్ మీడియన్ లైటింగ్, అంబేడ్కర్ ఫంక్షన్‌హాల్ ప్రారంభం
గజ్వేల్ పట్టణంలోని చేగుంట రోడ్డులో సంగుపల్లి వరకు, పిడిచెడ్ రోడ్డులో ప్రభుత్వాసుపత్రి నుంచి రైల్వే బ్రిడ్జి వరకు, సంగాపూర్ రోడ్డులో ఇందిరాపార్కు నుంచి సంగాపూర్ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ మీడియన్ లైటింగ్‌ను మంత్రి ప్రారంభించారు. అంతుకుముందు అంబేడ్కర్ ఫంక్షన్‌హాల్‌లను ప్రారంభించిన ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మడుపు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు కమిటీ రాష్ట్ర సభ్యుడు దేవీరవీందర్, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బెండే మధు, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.