గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
ABN , First Publish Date - 2023-09-27T23:35:35+05:30 IST
పేద ప్రజల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పేర్కొన్నారు.
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ
యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు రూపొందించిన ఆన్‌లైన్ షాపింగ్ ఆవిష్కరణ
కొండాలక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దాం
జడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు
ములుగు/సిద్దిపేట టౌన్/సిద్దిపేటక్రైం, సెప్టెంబరు 27: పేద ప్రజల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పేర్కొన్నారు. ములుగులోని తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలిపెట్టాడని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఆందోళనలు మూడు దశల ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాల్గొని దేశ సేవకు అంకితమైన గొప్పవ్యక్తి అని కొనియాడారు. మంత్రి పదవిని వదిలి తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టినట్లు గుర్తు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమం సందర్భంగా 23 ఏళ్ల క్రితం జలదృశ్యంలోని తన ఇంటిని కూడా ఉద్యమకారులకు వేదికగా చేశారని చెప్పారు. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం ప్రకటించని పక్షంలో సమాంతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హెచ్చరించిన ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నట్లు సుద్దాల వివరించారు. ఇస్రో శాస్త్రవేత్త రవికుమార్, ఉపకులపతి నీరజా ప్రభాకర్ యూనివర్సిటీ ఆవరణలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పూర్వ విద్యార్థులు కానుగంటి మహేష్, బడక నరేష్, జెట్టి క్రాంతికుమార్ రూపొందించిన విలేజ్ బాస్కెట్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా స్వచ్ఛమైన, కల్తీ లేని వస్తువులను కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్, అధికారులు కిరణ్‌కుమార్, విజయ, రాజశేఖర్, నటరాజన్, నాగేశ్వర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
సిద్దిపేటలో..
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దామని సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహనికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలోనే ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదురించి తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. మలిదశ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌కు బాసటగా నిలిచి తన జలదృశ్యాన్ని బీఅర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి ఇచ్చారని గుర్తుచేశారు. నాడు వివిధ హోదాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పరితపించారని చెప్పారు. రాష్ట్రం సిద్ధించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారి జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కౌన్సిలర్లు నాయకం లక్ష్మణ్, కో అప్షన్ సభ్యుడు మేర సత్తయ్య, మాజీ కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, పద్మశాలి సమాజం సభ్యులు బూర మల్లేశం, ముదిగొండ శ్రీనివాస్, డాక్టర్ స్వామి, రమేష్, వివిధ బీసీ,కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో..
సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సీపీ శ్వేత పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాసరావు, సీసీఆర్‌బీ ఏసీపీ చంద్రశేఖర్, ఏవో యాదమ్మ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ రఘుపతిరెడ్డి, సూపరింటిండెంట్లు ఎస్.కె జమిల్ పాషా, ఫయాజుద్దీన్, అబ్దుల్‌ఆజాద్, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.