శిలాఫలకానికే పరిమితం
ABN , First Publish Date - 2023-04-06T00:18:29+05:30 IST
మండల కేంద్రంలో నిర్మించనున్న సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనం(ఐవోసీ) శిలాఫలకానికే పరిమితమైంది.
సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవన నిర్మాణం ఇంకెన్నాళ్లు?
ఏడాదైనా అడుగు ముందుకు కదలని పనులు
ఇంకా రైతుల ఆధీనంలోనే భూమి
వర్గల్, ఏప్రిల్ 5 : మండల కేంద్రంలో నిర్మించనున్న సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనం(ఐవోసీ) శిలాఫలకానికే పరిమితమైంది. గజ్వేల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఐవోసీల నిర్మాణానికి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దాదాపు అన్ని మండలాల్లో సమీకృత మండల కార్యాలయాల సముదాయ భవనాలు పూర్తయి ముగింపు దశకు చేరుకున్నాయి. వర్గల్ మండలంలో మాత్రం ఇంకా ప్రారంభమే కాలేదు. వర్గల్‌లోని సర్వే నంబర్ 914లో సుమారు నాలుగున్నర ఎకరాలల్లో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవనానికి గతేడాది మేలో మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు ఈ భూములు రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. రైతులు ఆ భూముల్లో పంటలను సాగు చేసుకుంటున్నారు. అసలు రైతుల వద్ద నుంచి భూసేకరణ చేయకుండానే ఐవోసీ భవనానికి శిలాఫలకం ఎందుకు ఏర్పాటు చేశారన్న సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఇప్పటికైన మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకుని సమీకృత కార్యాలయాల సముదాయ భవన నిర్మాణ పనులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు, ప్రజలు కోరుతున్నారు.