సిద్దిపేట మెడికల్‌ కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్‌

ABN , First Publish Date - 2023-04-08T00:04:43+05:30 IST

సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్‌ మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సిద్దిపేట మెడికల్‌ కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్‌
సిద్దిపేట మెడికల్‌ కళాశాల

సిద్దిపేట టౌన్‌, ఏప్రిల్‌7: పేద ప్రజలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దానిలో భాగంగానే ఆరోగ్య పరిరక్షణ, ప్రయోగాత్మక పరికరాలను అభివృద్ధి చేసుకునేందుకు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్‌ మంజూరైనట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య విద్యార్థులు పాఠాలకే పరిమితం కాకుండా, పరిశోధనలపై ఆసక్తి పెంపొందింప చేయడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే ప్రత్యేక శ్రద్ధతో మంజూరు చేయించినట్లు, ఈ మేరకు తొలి విడతగా రూ.2.5 కోట్లు కేటాయింపు చేసినట్లు, ప్రభుత్వ వైద్య కళాశాలలో పరిశోధనలకు ఊతమిచ్చేలా దోహదపడనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 35 విభాగాలు ఉంటాయని, వాటిలో ఏదైనా పరిశోధన చేయాలంటే రీసెర్చ్‌ యూనిట్‌ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీనిలో పరిశోధనలకు అవసరమైన అన్నీ రకాల ఆధునాతన యంత్ర పరికరాలు ఉంటాయని, మెడికల్‌ కళాశాలలో చేసిన పరిశోధన ఫలితాలను పబ్లికేషన్‌కు పంపుతారని, వాటిల్లో ప్రచురితమైతే అటు పరిశోధన చేసిన విద్యార్థికి, వైద్య కళాశాలకు పేరు వస్తుందని తెలిపారు. పరిశోధనలు నిర్వహించడానికి 5 సంవత్సర కాలానికి ప్రభుత్వం రూ.5 కోట్ల రూపాయలను విడుదలచేస్తున్నదని, ఈ నిధులను సివిల్‌ నిర్మాణాలు, పరికరాల కొనుగోలు, జీతాలు, శిక్షణ కార్యక్రమం నిర్వహణకు వినియోగించాలని సూచించారు. దీనిలో సివిల్‌ నిర్మాణాలకు రూ.25 లక్షలు, పరికరాల కొనుగోలు రూ.2 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందని మంత్రి వివరించారు.

వృత్తి నైపుణ్య కేంద్రం నిర్మాణానికి రూ.10 కోట్లు : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట పట్టణంలో వృత్తి నైపుణ్య కేంద్రం భవననిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉపాధి వెతుకులాటలో రెండు రకాల అనుభవాలు ఎదురవుతుంటాయని, మొదటిది అనుభవం.. నైపుణ్యమైతే, రెండవది అనుభవరాహిత్యం, నైపుణ్యతలేమి అని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో చదువు, నైపుణ్యం లేక ఇబ్బందులు పడే నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనేదే తన లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయించానని, దీంతో నిరుద్యోగులకు నాణ్యమైన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్సస్ట్రక్షన్‌ (న్యాక్‌) సెంటర్‌ నెలకొల్పామని హరీశ్‌రావు పేర్కొన్నారు. తాజాగా నిర్మాణ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఆసక్తి చూపే ఉమ్మడి మెదక్‌ జిల్లా నిరుద్యోగులకు వర్తించేలా శాశ్వత వృత్తి నైపుణ్య కేంద్ర భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నిర్మాణ రంగంలో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా, యువత శిక్షణ కోసం హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో ఉన్న న్యాక్‌ వరకూ వెళ్లకుండా సిద్దిపేటలోనే ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో న్యాక్‌ వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం భవన నిర్మాణం రూపుదిద్దుకోనున్నట్లు తెలిపారు. న్యాక్‌ సెంటరులో ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతీ ఏడాది 300 మంది నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణనిస్తున్నారని తెలిపారు.

Updated Date - 2023-04-08T00:04:43+05:30 IST