కాసులు ఇస్తేనే సై
ABN , First Publish Date - 2023-01-12T23:36:30+05:30 IST
ఓ అధికారి తీరు వల్ల కొండాపూర్ మండలంలో నామినేషన్ పనులు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతు న్నాయి.
బేరం కుదిరితేనే అగ్రిమెంట్లు చేస్తున్న అధికారి
అడిగినంత ఇవ్వలేక వెనుదిరుగుతున్న కాంట్రాక్టర్లు
రూ.7.85 కోట్ల నిధులకు గ్రహణం
24 గ్రామాల్లో వేధిస్తున్న సమస్యలు
నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు
కొండాపూర్ మండలంలో నామినేషన్ పనుల పంచాయితీ
అధికార పార్టీకి గుదిబండలా మారిన ఇంజనీరింగ్ శాఖ!
అధికారి తీరుతో ఆందోళనలో ప్రజాప్రతినిధులు
కొండాపూర్, జనవరి12: ఓ అధికారి తీరు వల్ల కొండాపూర్ మండలంలో నామినేషన్ పనులు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతు న్నాయి. ‘‘కాసులు ఇస్తేనే అగ్రిమెంట్లు’’ అని ఓ అధికారి మోకాలడ్డు పెట్టడంతో రూ.7కోట్లా85లక్షల నిధులకు గ్రహ ణం పట్టింది. తాను కోరింది ఇస్తేనే అగ్రిమెంట్లపై సంతకాలు పెడుతుండడంతో అడిగినంత ఇచ్చుకోలేని, నిజాయితీగా పనిచేసే కాంట్రాక్టర్లు వెనక్కి వెళ్తున్నారు. ఫలితంగా ఆ అధికారి తీరు వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కావడం లేదు. నిధులు మంజూరైనా, శంకుస్థాపనలు జరిగినా పనులు సైతం ప్రారంభంకాకపోవడం విచారకరం. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పనులు పూర్తయితే ప్రజలు రాబోయే ఎన్నికల్లో దీవిస్తారని ఆశలు పెట్టుకుంటే, ఇంజనీరింగ్‌శాఖ వారి ఆశలపై నీళ్లు జల్లుతున్నది. గతంలో ఎందరో అధికారులు వచ్చినా ఇంతటి అవినీతిపరమైన వ్యవస్థను ఎప్పుడూ చూడలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. సదరు అధికారి సుదీర్ఘకాలంగా (నాలుగేళ్లుగా) మండలంలో తిష్ఠ వేయడంతో ఆ అధికారికి కాంట్రాక్టర్ల వ్యవహారాలపై మంచిపట్టు లభించింది. అయితే ఆ శాఖ తీరుతో నాసిరకం పనులు అధికార పార్టీని వెక్కిరిస్తున్నాయి. ఈ శాఖ ధనదాహం ప్రవాహంలో అధికార పార్టీ కొట్టుకుపోతుందని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం అవినీతిపరులపరంకావడం కొండాపూర్ మండలంలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధికారులు ఆ అధికారిపై చర్యలు తీసుకుంటేనే తప్ప అభివృద్ధి పనులు ప్రారంభమయ్యేలా లేవు.
కొండాపూర్ మండల పరిధిలో 24 గ్రామపంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున ‘ఎస్‌దీఎఫ్’ కింద నిధులు మంజూరయ్యాయి. గతేడాది సెప్టెంబరులో టీఎ్‌సహెచ్‌డీసీ చైర్మన్ చింతాప్రభాకర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో రూ.20లక్షల చొప్పున మంజూరైన నిధులకు శంకుస్థాపన చేసి నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు పీఆర్ అధికారి నిర్లక్ష్యంతో పనులు ఎక్కడా కూడా ప్రారం భం కాలేదు. కొండాపూర్, గారకుర్తితో పాటు మరో రెండు గ్రామాల్లో పనులు పూర్తయి నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు ఆ పనులకు అగ్రిమెంట్ చేయకపోవడం అధికారి నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా మారింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొండాపూర్ మండలానికి రూ.3కోట్లా5లక్షలు మంజూరయ్యాయి. ఒక్కో గ్రామానికి రూ.5లక్షల నుంచి 15లక్షల వరకు అభివృద్ధి పనులకు నిధు లు మంజూరు చేశారు. ఈ పనులు కూడా ప్రారంభించడానికి సర్పంచులు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. సంబంధిత పీఆర్ అధికారి నిర్లక్ష్యంతో పనులు చేసినా రికార్డు చేయడంలేదంటూ వాపోయారు. ఇలాగైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ గట్టెక్కేది కష్టమేనని నాయకులు వాపోతున్నారు. ఆ అధికారిపై చర్యలు తీసుకుని, ఆ స్థానంలో మరో అధికారిని నియమించాలని కోరుతున్నారు.