నాసిరకంగా మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం

ABN , First Publish Date - 2023-03-07T23:24:41+05:30 IST

హుస్నాబాద్‌, మార్చి 7: హుస్నాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనానికి ఇసుక, కంకర, సిమెంట్‌ నాణ్యత లేనివి వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

నాసిరకంగా మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణం
నిర్మాణంలో ఉన్న మున్సిపల్‌ భవనం

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

హుస్నాబాద్‌, మార్చి 7: హుస్నాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనానికి ఇసుక, కంకర, సిమెంట్‌ నాణ్యత లేనివి వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికీ గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తు నిర్మాణం జరిగింది. రెండో అంతస్తు పనులు జరుగుతున్నాయి. అయితే సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్‌ నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. టెండర్‌ షెడ్యూల్‌లో పొందుపర్చిన కంకరను వాడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 10 ఏళ్లుగా మున్సిపల్‌ కార్యాలయ భవన నిర్మాణానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొన్ని సంవత్సరాలు నిధుల కొరత, మరికొన్ని సంవత్సరాలు స్థల సమస్యతో వాయిదా పడుతూ వచ్చింది. ఏడునెలల క్రితం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా జరుగుతున్నా నాణ్యత లేకుండా నిర్మాణం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. రూ.2 కోట్లతో పనులు జరుగుతుండటంతో ఇంజనీరింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. కానీ వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ పనులను నాణ్యతగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఈ పనుల్లో నాణ్యతలోపిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ రాజమల్లయ్య ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2023-03-07T23:24:41+05:30 IST