మందుబాబుల సిట్టింగులకే సెగ్రిగేషన్ షెడ్లు
ABN , First Publish Date - 2023-03-09T23:35:19+05:30 IST
చెత్తను వేరు చేయడం, సేంద్రియ ఎరువు తయారు చేయడం కోసం గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు, గ్రామ పాలకుల నిర్లక్ష్యంతో తడి, పొడి చెత్తను వేరు చేయడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడమనే ప్రక్రియ అటకెక్కింది.
గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేయడం లేదు
ఆరుబయటే చెత్త కాల్చివేత
సేంద్రియ ఎరువు తయారీపై నిర్లక్ష్యం
అక్కన్నపేట మార్చి 9: చెత్తను వేరు చేయడం, సేంద్రియ ఎరువు తయారు చేయడం కోసం గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు, గ్రామ పాలకుల నిర్లక్ష్యంతో తడి, పొడి చెత్తను వేరు చేయడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడమనే ప్రక్రియ అటకెక్కింది.
లక్షలు వెచ్చించి అసాంఘిక కార్యకలాపాలకు ..
అక్కన్నపేట మండలలో 32 గ్రామ పంచాయతీలకు గాను 31 సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించారు. ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ.2.50 లక్షల చొప్పున ఖర్చు చేశారు. లక్షలు వెచ్చించి గ్రామాల్లో ప్రజాప్రయోజనాల కోసం నిర్మించిన ఈ సెగ్రిగేషన్ షెడ్లు పలు గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. షెడ్డుల్లో కొందరు ఆకతాయిలు రాత్రి సమయాల్లో మద్యం తాగడంతో పాటు తదితర వ్యవహారాలను నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని గ్రామాల్లో అయితే సెగ్రిగేషన్ షెడ్లల్లో రాత్రి వేళల్లో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం తమస్థాయిని మరిచి మద్యం మత్తులో జోగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
లోపించిన పర్యవేక్షణ
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేయాలి. ఆ ఎరువులను హరితహారం మొక్కలకు వేయడంతో పాటు రైతులకు విక్రయించి పంచాయతీలు ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. కానీ మండల అధికారులు పర్యవేక్షణ లోపంతో ఇది నీరుగారుతోంది. చెత్త సేకరణ వరకే సక్రమంగా పనులు సాగుతుండగా, దానిని వేరు చేసి వ్యర్థాలను ఎరువులు తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లి సెగ్రిగేషన్ షెడ్డు వద్ద బయట ఖాళీ ప్రదేశాల్లో డంపు చేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయకుండా పలు గ్రామ పంచాయతీల్లో కాల్చేస్తున్నారు. ఊరికి దగ్గర ఈ షెడ్డును ఏర్పాటు చేసిన చోట చెత్త కాల్చివేతతో వస్తున్న పొగతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెత్త సేకరణ, తడి, పొడి చెత్త వేరు చేయడం, సేంద్రియ ఎరువులు తయారీపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. అయితే మొదట్లో కార్యదర్శులు, సర్పంచ్‌లు కొంత హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తడి, పొడి చెత్తను వేరుచేయడంతో పాటు సేంద్రియ ఎరువులు తయారు చేసేలా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.