రూ.30కోట్ల భూమి కబ్జాకు స్కెచ్‌

ABN , First Publish Date - 2023-01-22T00:06:36+05:30 IST

కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నం చివరి నిమిషంలో బెడిసికొట్టింది. రెవెన్యూ అఽధికారులతో కలిసి అధికార పార్టీ నాయకులు వేసిన స్కెచ్‌ గ్రామస్థుల ఫిర్యాదుతో బహిర్గతమైంది.

రూ.30కోట్ల భూమి కబ్జాకు స్కెచ్‌
భూదాన్‌ స్థలం చుట్టూ రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌

భూదాన్‌ భూమిని చెరబట్టేందుకు విఫలయత్నం

నకిలీ సీసీఎల్‌ఏ భూదాన్‌ యజ్ఞ బోర్డు ప్రొసీడింగ్‌తో బురిడీ

ప్రైవేటు వ్యక్తులకు భూమి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు

ఫోర్జరీ పత్రాలను జిల్లా అధికారులు గుర్తించడంతో యూటర్న్‌

పటాన్‌చెరు, జనవరి 21: కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నం చివరి నిమిషంలో బెడిసికొట్టింది. రెవెన్యూ అఽధికారులతో కలిసి అధికార పార్టీ నాయకులు వేసిన స్కెచ్‌ గ్రామస్థుల ఫిర్యాదుతో బహిర్గతమైంది. పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామం పరిధిలోని సర్వే నంబర్‌ 521లో ఐదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో గతంలోనే రెండెకరాలు కబ్జాకు గురైంది. ఇళ్ల స్థలాలు చేసి అమ్ముకోవడంతో ప్రస్తుతం మూడెకరాలు మాత్రమే మిగిలింది. సదరు భూమిపై కన్నేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పథకం ప్రకారం పావులు కదిపారు. ఇందుకు అనుగుణంగా పయనీర్‌ ఇంజనీరింగ్‌ సిండికేట్‌ యాజమాన్యం పేరిట ఆ భూమి తమదేనని పేర్కొంటూ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. సదరు భూదాన్‌ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు నెలరోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈమేరకు పయనీర్‌ ఇంజనీరింగ్‌ సిండికేట్‌ నుంచి అగ్రిమెంట్‌ పొందినట్టు పేర్కొంటున్న కొందరు వ్యక్తులు భూమిని చట్టబద్ధంగానే పొందామని చెబుతూ ప్లాట్లుగా చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ వాదనకు మద్దతుగా జిల్లా అధికారుల ఆదేశాలతో తహసీల్దార్‌ జారీ చేసిన ప్రొసీడింగ్‌ను సైతం చూపిస్తున్నారు.

తీగ లాగితే డొంక కదిలింది

గ్రామస్థులకు అనుమానం కలిగి లోతుగా పరిశీలిస్తే ఈ మొత్తం వ్యవహారం పెద్ద మోసమని తేలింది. సీసీఎల్‌ఏ, భూదాన్‌ యజ్ఞ బోర్డు కమిషనర్‌ ద్వారా జారీ చేసినట్టు పేర్కొంటున్న ఉత్తర్వులు ఫోర్జరీ సంతకాలతో సృష్టించారని బట్టబయలైంది. జిల్లా కలెక్టరేట్‌కు సీసీఎల్‌ఏ నుంచి ఎలాంటి ఉత్తర్వు రాలేదని తేలడంతో రెవెన్యూ అఽధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. విషయం బయటకు పొక్కకముందే భూ కేటాయింపు ఆర్డర్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో తహసీల్దార్‌ ఈ నెల 14న ఉత్తర్వులను రద్దు చేశారు.

మోసం బయటపడినా రెవెన్యూ అధికారుల దబాయింపు

భూదాన్‌ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడంపై ఈ నెల 16న గ్రామస్థులు తహసీల్దార్‌ పరమేశంను నిలదీశారు. కానీ తహసీల్దార్‌ మాత్రం ఉత్తర్వులు రద్దయిన విషయం చెప్పకుండా అంతా సక్రమంగానే చేశామని గ్రామస్థులను దబాయించడం గమనార్హం. అయితే కబ్జా విషయం బయటపడగానే తమ చేతికి మట్టి అంటకుండా రెవెన్యూ సిబ్బంది పాత తేదీలతో రద్దు ఉత్తర్వులను జారీచేసి జాగ్రత్త పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులకు ముందు సహకరించిన రెవెన్యూ అధికారులు ఆ తరువాత ఆఘమేఘాల మీద వివాదాస్పద భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేసి రక్షణ కల్పించడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు.

ఆది నుంచి వివాదాస్పదమే..

ఆచార్య వినోబాబావే సర్వోదయ ఉద్యమానికి ఆకర్షితుడై గ్రామానికి చెందిన భూస్వామి శ్రీనివా్‌సరావు ఐదెకరాల భూమిని దానం చేశారు. అప్పటి నుంచి స్థలం చుట్టూ అనేక వివాదాలు అలముకున్నాయి. నాడు దానం చేసిన శ్రీనివా్‌సరావు వారసులు భూమిని అమ్మేందుకు ప్రయత్నించారు. కోర్టులో వివాదం నడిచి వారికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో స్థలం ప్రభుత్వ భూమిగా మిగిలిపోయింది. గతంలోనే ఈ భూమిలోని ఒకటిన్నర ఎకరాలను పక్కనే ఉన్న సర్వే నంబర్‌గా పేర్కొంటూ స్థలాల క్రయవిక్రయాలు జరిగి ఇళ్లు నిర్మించుకున్నారు. ఇంకొంత స్థలంలో ఇటీవల వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ గిడ్డంగులను నిర్మించింది. దీంతో మూడెకరాలు మాత్రమే మిగిలింది. ఈ భూమి కూడా అన్యాక్రాంతం కాకముందే గ్రామానికి ఉపయోగపడే విధంగా కల్యాణమండపం నిర్మించాలని గ్రామస్థులు ప్రతిపాదిస్తున్నా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. సదరు భూమి పయనీర్‌ పరిశ్రమకు చెందిందని కొత్తనాటకం తెరపైకి తెచ్చారు. గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు పరిశ్రమను ముందు పెట్టి తెర వెనక వ్యవహారం నడుపుతున్నారు. శ్రీనివా్‌సరావుకు స్థలం లేకున్నా దానం చేశారని, సదరు స్థలం తమ పరిశ్రమకు చెందిందని పేర్కొంటున్నారు.

ఫోర్జరీ పత్రాలపై కలెక్టర్‌ సీరియస్‌

భూదాన్‌ భూమిని తమకు కేటాయించాలని సీసీఎల్‌ఏ, భూదాన్‌ యజ్ఞ బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని కొందరు వ్యక్తులు నకిలీ ఉత్తర్వులు సృష్టించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నకిలీ ఉత్తర్వులు తయారుచేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమపై ఎక్కడ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారోనని ఆందోళనతో కబ్జా వ్యవహారం తెరవెనక ఉన్న నాయకులు రాజకీయ అండ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

భూదాన్‌ భూమిని పరిరక్షిస్తాం

ముత్తంగి సర్వేనెంబర్‌ 521లో మూడెకరాల భూదాన్‌ భూమిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటాం. సదరు భూమిపై తమకే హక్కులు ఉన్నాయని కొందరు దరఖాస్తు చేసుకున్నారు. వారు జతచేసిన పత్రాలు సరైనవి కావని గుర్తించి జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు భూమిని స్వాధీనం చేసుకున్నాం. స్థలంలో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.

-పరమేశం, పటాన్‌చెరు తహసీల్దార్‌

Updated Date - 2023-01-22T00:06:37+05:30 IST