విద్య, వైద్యంతోనే బంగారు తెలంగాణ

ABN , First Publish Date - 2023-06-14T23:23:37+05:30 IST

బంగారు తెలంగాణ సాధనకు మూలం ఆరోగ్య తెలంగాణ అని.. విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడితేనే అది సాధ్యమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలో బుధవారం నిర్వహించిన వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని ఆయన ప్రారంభించారు.

విద్య, వైద్యంతోనే బంగారు తెలంగాణ

మంత్రి హరీశ్‌ నాయకత్వంలో వైద్య రంగంలో మార్పులు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌, హెచ్‌డీసీ చైర్మన్‌ ప్రభాకర్‌

సంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 14 : బంగారు తెలంగాణ సాధనకు మూలం ఆరోగ్య తెలంగాణ అని.. విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడితేనే అది సాధ్యమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలో బుధవారం నిర్వహించిన వైద్య, ఆరోగ్య దినోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో ఆస్పత్రుల్లో వసతులు, సౌకర్యాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. జిల్లాలో 11 ఆరోగ్య కేంద్రాలకు జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు దక్కిందన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 87 శాతానికి పెరగడం గర్వకారణమన్నారు. హెచ్‌డీసీ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్స్‌ పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఏఎన్‌ఎంలు, ఆశాలకు చీరలు, బీపీ మిషన్లు, వైద్య సిబ్బందికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, మున్సిపల్‌ చైర్మన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ లత, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ జి.అనీల్‌కుమార్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ వీరాంజనేయులు, మెడికల్‌ కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ప్రభుధీర్‌, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రభుగౌడ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీరాంసుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైద్య రంగంలో గణనీయమైన అభివృద్ధి

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 14: ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో వైద్య రంగం గణనీయమైన అభివృద్ధి సాధించిందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మారెడ్డి పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మెదక్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులతో కలిసి ఆమె ప్రారంభించారు. గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ, రక్తపోటు సమస్య ఉన్నవారికి ఇంటి వద్దనే బీపీ పరీక్షించేందుకు బీపీ మిషన్లను ఏఎన్‌ఎంలకు అందజేశారు. అంతకుముందు మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చర్యల ఫలితంగా నీతి ఆయోగ్‌ విడుదల చేసిన హెల్త్‌ ఇండెక్స్‌లో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచిందని చెప్పారు. వ్యాక్సినేషన్‌, ప్రసవాల పురోగతిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 81 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు తదితరులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చందునాయక్‌, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, వైద్యులు శివదయాల్‌, చంద్రశేఖర్‌, నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-14T23:23:37+05:30 IST