ఓటరు నమోదు.. చేయలేం బాబోయ్!
ABN , First Publish Date - 2023-08-02T00:35:33+05:30 IST
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు అధికార యంత్రాంగం ఎన్నికలకు సంబంధించిన పనుల్లో బిజీగా మారారు రూపొందించడంలో బీఎల్వోలు నిమగ్నమయ్యారు.
బూత్ లెవల్ ఆఫీసర్లకు సంకటం
అదనపు పనిభారంతో ఆందోళన
తప్పదంటూ ఉన్నతాధికారుల ఒత్తిడి
నిర్లక్ష్యం చేసేవారికి మెమోలు జారీ
జహీరాబాద్, ఆగస్టు 1 : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు అధికార యంత్రాంగం ఎన్నికలకు సంబంధించిన పనుల్లో బిజీగా మారారు రూపొందించడంలో బీఎల్వోలు నిమగ్నమయ్యారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్నవారికే బీఎల్వోలుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. కానీ పొరపాట్లు జరిగితే మీదే బాధ్యత అని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారిచేస్తుండడంతో బీఎల్వో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు ఉత్సాహం చూపడం లేదు. ఎన్నికల కమిఇషన్ ఆదేశాలమేరకు కచ్చితంగా పనిచేయాల్సిందేనని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తుండడంతో బీఎల్వోలు ఇబ్బంది పడుతున్నారు.
నియోజకవర్గంలో 313 మంది
జహీరాబాద్ నియోజకవర్గంలో 313 మంది బీఎల్వోలను నియమించారు. వీరిలో 233 మంది అంగన్‌వాడీ టీచర్లు కాగా వివిధశాఖల్లో పనిచేస్తున్న మరో 190 మంది సిబ్బంది ఉన్నారు. నియోజకవర్గంలో 313 పోలింగ్ బూతుల పరిధిలో 2,41 వేల ఓటర్లు ఉన్నారు. బీఎల్వోలకు గౌరవ వేతనంగా ఏడాదికి రూ.9వేలు ఇస్తామని పేర్కొంటున్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు కొద్దోగొప్పో అవగాహన ఉండడంతో అంతగా ఇబ్బందులు లేవు, కానీ అంగన్‌వాడీ టీచర్లు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఓటరు యాప్‌లో వివరాల నమోదుకు సమయం ఎక్కువగా తీసుకుంటుండడంతో అనుకున్నంత వేగంగా ప్రక్రియ ముందుకుసాగడం లేదు. అంగన్‌వాడీ టీచర్లకు ఐసీడీఎస్ శాఖాపరంగా పోషణ్‌ట్రాకర్, న్యూట్రీషన్ హెల్త్‌ట్రాకింగ్ పద్ధతుల ద్వారా ప్రతిరోజు రెండు యాప్‌ల ద్వారా అంగన్‌వాడీకి సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కేంద్రాల నిర్వహణ, పౌష్టికాహార పంపిణీ బాధ్యత ఉండడంతో సమయం సరిపోవడం లేదు. దీంతో బీల్వోలుగా విధులు నిర్వర్తించడానికి వారు ఇష్టపడడం లేదు. కానీ ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో పాటు మెమోలు ఇస్తుండడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జహీరాబాద్ నియోజకవర్గంలో ఇలా ఇప్పటి వరకు 150 మంది అంగన్‌వాడీ టీచర్లకు మెమోలు జారీ చేశారు. దీంతో బీఎల్వో విధులు వద్దంటూ జహీరాబాద్‌లో అంగన్‌వాడీ టీచర్లు ధర్నా చేశారు. మరోవైపు కొందరు అంగన్‌వాడీలకు బీఎల్వో యాప్ ద్వారా ఓటరు నమోదు చేయడం రాకపోవడంతో మీసేవా కేంద్రాలకు వెళ్లి నమోదు చేయించుకోవాలని ఓటర్లుకు చెబుతున్నారు. దీంతో కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారికి ఇబ్బంది మారింది.
అప్పగించిన బాధ్యతలను పూర్తిచేయాలి
-వెంకారెడ్డి, జహీరాబాద్, ఆర్డీవో
ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయా శాఖల అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. ఆయా విధులను అప్పగించిన బాధ్యతలను తప్పనిసరిగా పూర్తిచేయాల్సి ఉంటుంది. బీఎల్వోలు కూడా ఓటరు జాబితాకు సంబంధించిన విధులు తప్పనిసరిగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఓటరు నమోదులో ఇబ్బందులు ఏర్పడితే బీఎల్వోలు సంబంధిత మండల తహసీల్దార్, సూపర్‌వైజర్లను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. బీఎల్వోలకు అదనపు విధులు నిర్వర్తిస్తున్నందుకు గౌరవ వేతనంగా ఏడాదికి రూ.9వేలు అందజేస్తున్నారు. ఎవరైనా ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల నియామావళికింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.