పాఠశాలల్లో నీటి నాణ్యతా పరీక్షలు
ABN , First Publish Date - 2023-01-04T00:27:09+05:30 IST
సర్కారు పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు శుద్ధజలం అందజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సంగారెడ్డి అర్బన్, జనవరి 3 : సర్కారు పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు శుద్ధజలం అందజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యాశాఖ సహకారంతో విజన్ వాటర్‌ఎయిడ్ ఎన్జీవో పాఠశాలల్లో నీటి నాణ్యతా పరీక్షలు చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం జిల్లాలో మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సంగారెడ్డి, కొండాపూర్, చౌటకూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నీటి నాణ్యతా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఆ మూడు మండలాల్లో 138 పాఠశాలల్లో నీటి నాణ్యతా పరీక్షలు చేయనున్నారు. ఈ బాధ్యతలను విద్యాశాఖ సమగ్ర శిక్ష కింద నియమితులైన క్లస్టర్ రిసోర్ట్ పర్సన్స్(సీఆర్పీ)లకు అప్పగించారు. వీరు ఆయా మండలాల్లోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి బోర్ నీటి నాణ్యతా పరీక్షలు చేపట్టనున్నారు. ఫ్లోరైడ్, టీడీఎస్, పీహెచ్ వాల్యూ, డిసాల్వుడ్ ఆక్సిజన్, రెసిడ్యుయల్ క్లోరిన్, పాస్మరస్, నైట్రెట్, ఐరన్, అమ్మోనియా.. ఇలా 15 రకాల నీటి నాణ్యత పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే మూడు మండలాలకు చెందిన 10 మంది సీఆర్పీలకు ఒక రోజు శిక్షణ ఇచ్చి ప్రాథమిక నిర్థారణ టెస్టింగ్ కిట్లను అందజేశారు. వారంతా నిత్యం పాఠశాలలకు వెళ్లి విద్యార్థులు వినియోగించే బోర్ నీటి నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో నీరు కలుషితమైనట్లు తేలితే ఆ నీటిని మరోసారి పూర్తి నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని వాటర్ టెస్టింగ్ ల్యాబ్‌కి పంపనున్నట్టు తెలిపారు. అక్కడ కూడా నీరు కలుషితమైనట్లు నిర్థారణకు వస్తే సదరు పాఠశాలలో ఆ నీటిని వాడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే 50 శాతం పాఠశాలల్లో నీటి నాణ్యతా పరీక్షలకు సీఆర్పీలు పూర్తి చేశారు. మరో పది రోజుల్లో మిగతా పాఠశాలల్లో నీటి నాణ్యతా పరీక్షలు పూర్తి చేయనున్నారు. అంతే కాకుండా పాఠశాలల్లో కలుషితమైన నీరు తాగడం వల్లే వచ్చే అనర్థాలపై సీఆర్పీలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.