జహీరాబాద్‌ ఇక.. అమృత్‌ భారత్‌ స్టేషన్‌

ABN , First Publish Date - 2023-05-20T23:48:35+05:30 IST

అమృత్‌ భారత్‌ స్టేషన్‌గా ఎంపికైన జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ దశ మారనున్నది.

జహీరాబాద్‌ ఇక.. అమృత్‌ భారత్‌ స్టేషన్‌

రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు

రైల్వేస్టేషన్‌ ఆధుణీకరణ, ప్లాట్‌ఫాంల విస్తరణ

ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన

మారనున్న స్టేషన్‌ రూపురేఖలు

జహీరాబాద్‌, మే 20 : అమృత్‌ భారత్‌ స్టేషన్‌గా ఎంపికైన జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ దశ మారనున్నది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయడం కోసం అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వెయ్యి స్టేషన్లను ఎంపికచేసి.. ఒక్కోదాన్ని రూ. 10 నుంచి రూ. 20 కోట్లు వెచ్చించి ఆదునీకరించాలని నిర్ణయించింది. రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన, ఆధునీకరణ పనులను చేపట్టి.. ఏడాదిన్నరలో పూర్తిచేయాలని నిబంధన విధించింది. ఇందులో భాగంగా తెలంగాణవ్యాప్తంగా 39 స్టేషన్లను ఈ పథకం కింద ఎంపిక చేయగా ఇందులో జహీరాబాద్‌ స్టేషన్‌కు చోటుదక్కింది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని వికారాబాద్‌-పర్లీ-వైధ్యనాథ్‌ మార్గంలో ప్రధానమైన వికారాబాద్‌, జహీరాబాద్‌ రైల్వేస్టేషన్లను అప్పట్లోనే యూపీఏ ప్రభుత్వం ఆదర్శస్టేషన్లుగా ఆధునీకరించింది. పదేళ్ల అనంతరం ప్రస్తుత సర్కారు అమృత్‌ భారత్‌ స్టేషన్‌గా ఎంపిక చేయడంతో జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌కు మహర్దశ రానుంది.

రోజూ 30 రైళ్లు.. వెయ్యి మంది ప్రయాణికులు

జహీరాబాద్‌ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ఇందుకు అనుగుణంగా రైల్వేస్టేషన్‌ కూడా మార్పునకు నోచుకున్నదిఉమ్మడి మెదక్‌ జిల్లాలో అతి పెద్దదిగా పేరున్న జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ 70 సంవత్సరాల క్రితమే జహీరాబాద్‌లో రైల్వేస్టేషన్‌ ఏర్పాటైనా గత పదేళ్లలోనే ఎక్కువగా అభివృద్ధి చెందింది. జహీరాబాద్‌ మీదుగా నిత్యం 18 ప్యాసింజర్‌, 12 గూడ్స్‌ రైళ్లు తిరుగుతుంటాయి. వెయ్యి మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అమృత్‌భారత్‌లో భాగంగా ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న స్టేషన్‌ భవనాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించనున్నారు. ప్లాట్‌ఫాంను 850 మీటర్లకు విస్తరించనున్నారు. ప్రయాణికులకు తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్‌హాల్‌, ఆధునిక టికెట్‌ కౌంటర్లు, ప్లాట్‌ఫాంల అభివృద్ధి, మోడల్‌ షాపింగ్‌మాల్స్‌, కాంప్లెక్సుల నిర్మాణం చేపట్టనున్నారు. దివ్యాంగుల కోసం చక్రాలకుర్చీలు, ప్రవేశమార్గాల్లో ర్యాంపులు, ఆధునిక లైటింగ్‌, స్టేషన్‌కు రెండువైపులా అనుసందాన రోడ్ల నిర్మాణం, వేగవంతమైన 5జీ టవర్లు, పార్కింగ్‌, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. రైల్వే అధికారులు ఇప్పటికే నిర్మాణ పనుల కోసం మట్టి నమూనాలను పరిశీలించారు.

మెరుగైన సౌకర్యాలు

-మాధవకృష్ణ, జహీరాబాద్‌ స్టేషన్‌మాస్టర్‌

అమృత్‌భారత్‌ స్టేషన్‌ పథకం కింద జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఎంపిక కావడంతో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం ఉన్న భవనాన్ని తొలగించి అన్నిహంగులతో అభివృద్ధి చేయనున్నారు. పనులను చేపట్టేందుకుగాను సంబంధిత అధికారులు స్టేషన్‌ను పరిశీలిస్తున్నారు. జహీరాబాద్‌ ప్రాంత ప్రజలు ఊహించని తరహాలో రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారనున్నాయి. గతంలో కంటే రైళ్ల సంఖ్య కూడా పెరగనున్నది.

Updated Date - 2023-05-20T23:48:35+05:30 IST