MLC Elections: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మిర్జా రహమాత్ బేగ్
ABN , First Publish Date - 2023-02-27T19:45:40+05:30 IST
హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మజ్లిస్ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్ (Mirza Rahmat Baig)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మజ్లిస్ అభ్యర్థిగా మీర్జా రహ్మత్ బేగ్ (Mirza Rahmat Baig)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదే స్థానానికి మహమ్మద్ రహీం ఖాన్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఈయన నామినేషన్ను పరిశీలించిన అధికారులు.. చెల్లదంటూ తిరస్కరించారు. దీంతో ఎన్నికల బరిలో ఎంఐఎం అభ్యర్థి రహ్మత్ బేగ్ మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలోనే రహ్మత్ బేగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్వో ప్రియాంక అల ప్రకటించారు. గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని మిర్జా రహమాత్ బేగ్కు ఆర్వో అందించారు.
బీఆర్ఎస్ మద్దతు
ప్రస్తుత ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1న ముగియనుంది. ఈ నేపథ్యంలో పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న మీర్జా రహ్మత్ బేగ్ను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మజ్లిస్ ప్రకటించింది. మజ్లిస్ అభ్యర్థికి బీఆర్ఎస్ (BRS) మద్దతిచ్చింది. గతంలో మాదిరిగానే ఆ సీటును తమకే కేటాయించి మద్దతు ప్రకటించాలని మిత్రపక్షమైన మజ్లిస్ చేసిన అభ్యర్థన మేరకు.. పార్టీ సీనియర్లతో చర్చించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు మద్దతు ప్రకటించిన కేసీఆర్కు ఒవైసీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల స్థానాల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండనున్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
ఇక మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం మార్చి 29న, హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేసింది. ఈనెల 16 నుంచి 23వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ, 27న ఉపసంహరణకు గడువు ఇచ్చారు. వచ్చేనెల 13న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 16న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.