బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.10కోట్లు

ABN , First Publish Date - 2023-03-10T00:39:03+05:30 IST

ఎన్నో ఏళ్లుగా మండంలోని పలు గిరిజన తండాలకు సరైన రోడ్డు మార్గం లేక పోవడంతో గిరిజనులు అనేక ఇబ్బందులకు గురయ్యారు.

బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.10కోట్లు
గంగరాంతండ రోడ్డు

త్వరలోనే టెండర్‌ ప్రక్రియ

తుర్కపల్లి, మార్చి 9: ఎన్నో ఏళ్లుగా మండంలోని పలు గిరిజన తండాలకు సరైన రోడ్డు మార్గం లేక పోవడంతో గిరిజనులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.10కోట్లను మంజూరు చేసింది. దీంతో పలు గిరిజన తండాల రోడ్లకు మహర్ధశ పట్టనున్నది. ముల్కలపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి వయా గంగరాంతండ మీదుగా దేవోజీనాయక్‌తండ వరకు నాలుగున్న కిలోమీటర్లు దూరం బీటీ రోడ్డు వేయడానికి గాను ఎస్టీ సబ్‌ప్లాన్‌ క్రింద రూ 3.6కోట్లు, వేలుపల్లి నుంచి జంగారెడ్డి కుంట వరకు 2కిమీ దూరం బీటీ రోడ్డు నిర్మాణానికి రూ 1.5కోట్లు, మల్కాపూర్‌ నుంచి వయా చిన్నలక్ష్మాపూర్‌ మీదుగా పొట్టిమర్రితండా వరకు మూడున్నర కిలోమీటర్లకు రూ.2.80కోట్లు, కోనాపూర్‌ నుంచి డీబీతండ వరకు రూ 2.50కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు ఈ నెలలో టెండర్‌ ప్రక్రియను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్లకు నిధులు మంజూరు కావడంతో ఆయా గ్రామాల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే పనులు ప్రారంభం

గిరిజన తండాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగానే ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద సుమారు రూ.10కోట్లను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించాను. ఈ నిధులతో మట్టి రోడ్లు బీటీ రోడ్లుగా మారనున్నాయి. ఈ నెలలో టెండర్‌ ప్రక్రియ కూడ పూర్తవుతుంది. ఆ వెంటనే రోడ్డు పనులు ప్రారంభిస్తారు.

-గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌

Updated Date - 2023-03-10T00:39:03+05:30 IST