చేపల ఘుమఘుమలు

ABN , First Publish Date - 2023-06-01T00:58:59+05:30 IST

పల్లెలతోపాటు పట్టణాల్లో మటన్‌, చికెన్‌ దుకాణాలే అధికంగా కన్పిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చేపల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు చేపలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ, రుచికరమైన వంటకాలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది.

చేపల ఘుమఘుమలు

మృగశిరకార్తెను పురష్కరించుకుని ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌

రుచికర వంటలపై 30 మందికి శిక్షణ

యాదాద్రి, మే31 (ఆంధ్రజ్యోతి): పల్లెలతోపాటు పట్టణాల్లో మటన్‌, చికెన్‌ దుకాణాలే అధికంగా కన్పిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చేపల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు చేపలతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ, రుచికరమైన వంటకాలతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. చేపలతో బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. మటన్‌, చికెన్‌తో పోలిస్తే చేపల్లో కొవ్వు శాతం తక్కువ. శరీరం బలంగా ఉండేందుకు సరిపడా ప్రొటీన్లు చేపల్లో పుష్కలంగా ఉంటాయి. ప్రజలకు చేపలతో చేకూరే ప్రయోజనాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జూన్‌ 8న మృగశిర కార్తె, రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మత్స్యశాఖ జిల్లాలో జూన్‌ 8, 9, 10 తేదీల్లో చేపల ఆహార దినోత్సవం(ఫిష్‌ ఫుడ్‌ పెస్టివల్‌) నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన స్టాళ్లను జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేయాలని ఉన్నతాధికారులు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీచేశారు. భువనగిరిలోని జూనియర్‌ కళాశాల మైదానంలో ఫుడ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు మైదానాన్ని పరిశీలించి, ఎక్కడెక్కడ ఏ ఏ వంటకాలు చేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. చేపలు, రొయ్యలతో నోరూరించే వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు.

30మంది మహిళా సంఘం సభ్యులకు శిక్షణ

చేపల వంటకాలపై మహిళా మత్స్యశాఖ సహకార సంఘాలకు చెందిన 30మందికి హైదరాబాద్‌లోని మత్స్యశాఖ కమిషనరేట్‌లో శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 162 మత్స్య సహకార సంఘాలు ఉండగా, వాటిలో 12 మహిళా మత్స్యసహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 9వేల మంది సభ్యులకు 1,000 మంది మహిళలు ఉన్నారు. వారిలో 30మందికి చేపలు, రొయ్యల వంటకాలపై శిక్షణ ఇచ్చారు. వీరంతా మూడురోజుల పాటు ఫిష్‌ ఫెస్టివల్‌లో రకరకాల వంటకాలు చేయనున్నారు. జిల్లాలో 654పైగా చెరువుల్లో చేపలు, రొయ్యలు పెంచుతున్నారు. ఏడాదికి సుమారు 5వేల టన్నులకు పైగానే చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యసహకార సంఘాల సభ్యులు మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది.

నోరూరించే వంటకాలు ఇవే

చేపల వంటకాలపై శిక్షణ పొందిన మహిళా సభ్యులు నోరూరించే వంటలు చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు చేపల రుచులను పరిచయం చేయడం ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రధాన ఉద్దేశ్యం. ఫుడ్‌ ఫెస్టివల్‌లో ప్రధానంగా చేపల పచ్చళ్లు, కొర్రమీను పచ్చడి, ఫిష్‌ సమోసా, ఫిష్‌ సూప్స్‌, ప్రాన్స్‌ బిర్యానీ, ప్రాన్స్‌ పకోడి, ఫిష్‌ బర్గర్స్‌, ఫిష్‌ పకోడి, ఫిష్‌ కట్‌లెట్‌, ప్రైడ్‌ ప్రాన్స్‌, ప్రాన్‌ పచ్చళ్లు, అపోలో ఫిష్‌, ఫిష్‌ ఫింగర్‌, ప్రాన్‌ బట్టర్‌ప్లై, ఫిష్‌ మంచూరియా, స్మోక్‌ ఫిష్‌, తదితర వంటకాలు మూడు రోజులు పాటు వినియోగదారులకు తక్కువ ధరలో అందుబాటులో ఉంచనున్నారు.

చేపల వినియోగాన్ని పెంచడమే లక్ష్యం : రాజారాం, జిల్లా మత్స్యశాఖ అధికారి

ప్రజల్లో చేపల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా మత్స్యశాఖ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంది. చేపలు మంచి పోషకాహారం. చాలా మందికి చేపలపై అవగాహన లేదు. వీటిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. మృగశిర కార్తెను పురస్కరించుకుని భువనగిరిలోని జూనియర్‌ కళాశాల మైదానంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఫిష్‌ ఫుడ్‌ పెస్టివల్‌ నిర్వహిస్తున్నాం. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం 30మంది మత్స్యసహకార సంఘం సభ్యులకు వంటకాలపై శిక్షణ ఇచ్చాం. వీరు మూడు రోజుల పాటు రుచికర వంటకాలు తయారు చేస్తారు. ఫుడ్‌ ఫెస్టివల్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. 10కి పైగా స్టాళ్లను ఏర్పాటుచేయనున్నాం.

Updated Date - 2023-06-01T00:58:59+05:30 IST