చేపా.. చేపా.. ఎక్కడున్నావ్‌?

ABN , First Publish Date - 2023-05-20T00:58:45+05:30 IST

జిల్లాలో మత్స్యశాఖ రికార్డుల్లో 1,241 చెరువులు ఉన్నాయి. అయితే ఆయా చెరువుల అన్నింట్లో చేపపిల్లలను పోయడం లేదని సమాచా రం. కొన్నిచోట్ల చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు.

చేపా.. చేపా.. ఎక్కడున్నావ్‌?
మద్దిరాలలో చేపపిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన గుజ్జ దీపిక(పైల్‌)

భానుపురి, మే 19 : జిల్లాలో మత్స్యశాఖ రికార్డుల్లో 1,241 చెరువులు ఉన్నాయి. అయితే ఆయా చెరువుల అన్నింట్లో చేపపిల్లలను పోయడం లేదని సమాచా రం. కొన్నిచోట్ల చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. వీటికితోడు కొన్నికుంటలు, చెరువులు ఎండిపోవడంతో చేపపిల్లలను పోయడంలేదు. జిల్లాలో 851 చెరువుల్లో మాత్రమే ఉచిత చేపపిల్లలను పోస్తున్నట్లు రికార్డు నిర్వహణలో ఉంది. 2016 నుంచి 2021-22 వరకు 851 ట్యాంకుల్లో చేపపిల్లలను పోసినట్లు రికార్డులు చూపుతున్నాయి. చేపపిల్లలను లెక్క ప్రకారం ఎక్కడా పోయలేదని,తక్కువ వదిలినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.

సంఘాలపై రాజకీయాలు

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నా, ప్రత్యేక పథకాలు తీసుకువచ్చినా రాజకీయాలతో మత్స్యకార్మికుల జీవితాలు ముందడుగు పడటం లేదు. కోట్లు కేటాయించి చేపపిల్లలను ఉచితంగా ఇచ్చినా మత్స్య సహకార సంఘాలు బలోపేతం కావడంలేదు. సంఘాలకు సమర్థులైన వ్యక్తులను ఎన్నుకోవడానికి గ్రామాల్లో రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటున్నాయి. దీనికి తోడు చెరువులపై, పథకాలపై గుత్తేదారుల పెత్తనం మరింత పెరిగింది. ఎన్ని మార్పులు తీసుకువచ్చినా మత్స్యకారులు నేరుగా చెరువుల్లో చేపలను పెంచుకునే పరిస్థితులు రావడం లేదు. చేప పిల్లల పెంపకం నుంచి మొదలు చేప ఎదిగే వరకు గుత్తేదారులదే ఇష్టారాజ్యమైంది. దీనికితోడు అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు వారికి పుష్కలంగాఉండడంతో వారిని అడ్డుకునే నాధుడు లేకుండాపోయారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు కమీషనను ముట్టజెప్పడంతో చేపల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా కొనసాగుతోంది.

చేపపిల్లల పెంపకానికి తెలుగు రాష్ర్టాల నుంచి ఆనలైన టెండర్లు వేయడానికి 2019- 20 వరకు ముందుకు వచ్చేవారు. టెండర్లలో తక్కువ కోట్‌ చేసి దక్కించుకునేవారు. ఆ తర్వాత రాజకీయ నాయకు లు చేపపిల్లల పెంపకం చేపడతామని ముందుకు వచ్చి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వా రు టెండర్లు వేయకుండా, వేసినా కూడా తమ అధికార బలంతో ఏదో ఒక కొర్రీ పెట్టి అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో తమ అంగబలంతో దౌర్జన్యం చేసిన ఘటనలూ ఉన్నాయి. 2020-21 నుంచి జిల్లాకు చెందిన ఇద్దరే టెండర్లు దక్కించుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్య త లేని చేపపిల్లలను పోశారని పలుచోట్ల మత్స్యకారుల సంఘాల నాయకులు ఆందోళనలు చేశారు. అయినప్పటికీ ఏ చర్యలూ తీసుకోవడం లేదు.

2022-23లో మూడు నియోజకవర్గాలకే:

జిల్లాలో 2022- 23లో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం మూ డు నియోజకవర్గాలకే పరిమితమైంది. మరో నియోజకవర్గంలో చేపపిల్లల పంపిణీ చేపట్టలేదని విమర్శలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులకు పర్సంటేజీపై ఒప్పందం కుదరకపోవడంతో చేపపిల్లలను పంపిణీ చేయలేదన్న ఆరోపణలున్నాయి. హూజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 87 చెరువుల్లో చేపపిల్లలను పంపిణీ చేయలేదు. కొంతమందికి సఖ్యత లేకపోవడంతో పోయలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ ఉన్న మత్స్యకారులు నష్టపోవాల్సి వచ్చింది. కాంట్రాక్టర్‌కు ప్రజాప్రతినిధులకు పర్సంటేజీ కుదరకపోవడంతో మత్స్యకారులు నష్టపోయారు.

మిగతా చోట్ల

సూర్యాపేట నియోజకవర్గంలో 131 చెరువుల్లో 57.17లక్షల చేపపిల్లలను రూ.60.34లక్షల ఖర్చుతో వదిలినట్లు రికార్డులు చెబుతున్నాయి. కోదాడ నియోజకవర్గంలో 141 చెరువుల్లో 72.13లక్షల చేపపిల్లలను రూ.76.03 లక్షల ఖర్చుతో, తుంగతుర్తి నియోజకవర్గంలో 307 చెరువుల్లో 114.41 లక్షల పిల్లలను 116.51 లక్షల ఖర్చుతో వదిలారు.

మార్పులు తీసుకువచ్చా

విధుల్లో చేరినప్పటి నుంచి చాలామార్పులు తీసుకువచ్చా. హుజూర్‌నగర్‌లో కొంత సఖ్యత లేకపోవడంతో చేపపిల్లలను పోయలేదు. చెరువులపై గుత్తేదారు ల పెత్తనం ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. మత్స్యకారులే చేపలను పెంచుకు ని పట్టుకునేలా చూస్తాం.సూర్యాపేటలో బీఆర్‌ అంబేడ్కర్‌,ఆర్‌బీఎస్‌ ఆక్వా ఫామ్స్‌లు రెండు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది 580 చెరువుల్లోనే పిల్లలను వదిలాం. ప్రతి పైసా కూడా కమిషనరేట్‌ నుంచే రిలీజ్‌ అవుతాయి.

- రూపేందర్‌సింగ్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి

Updated Date - 2023-05-20T00:58:45+05:30 IST