డబుల్ బెడ్‌రూం ఇళ్లకు భారీగా వడపోత
ABN , First Publish Date - 2023-03-03T01:22:44+05:30 IST
డబుల్ బెడ్‌రూం అర్హుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరింది. వందల్లో ఇళ్లు ఉండగా, వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. మార్చి మొదటి వారంలోగా అర్హుల జాబితా ఖరారు చేస్తే ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం నుంచి రూ.1.70లక్షలు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యే అవకాశం ఉందిన.
28వేల దరఖాస్తుల్లో 9వేల మందే అర్హులు
నేడు నల్లగొండ, మిర్యాలగూడలో డ్రా
నల్లగొండ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): డబుల్ బెడ్‌రూం అర్హుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరింది. వందల్లో ఇళ్లు ఉండగా, వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. మార్చి మొదటి వారంలోగా అర్హుల జాబితా ఖరారు చేస్తే ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం నుంచి రూ.1.70లక్షలు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యే అవకాశం ఉందిన. దీంతో అధికారులు శరవేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేసే పనిలో పడ్డారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అర్హుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నామని ప్రకటిస్తున్నారు. ఖరీదైన బంగ్లాల్లో ఉంటున్న వారు సైతం దరఖాస్తు చేసుకోగా, రెవెన్యూ అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో దరఖాస్తులపై సర్వే పూర్తి చేశారు. నల్లగొండ, మిర్యాలగూడలో లబ్ధిదారుల ఖరారుకు శుక్రవారం డ్రా నిర్వహించనున్నారు.
28వేల దరఖాస్తులు
కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండడంతో అందుబాటులో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్లకు అర్హులను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో దేవరకొండ, నల్లగొండ, మిర్యాలగూడ మునిసిపాలిటీలకు మొత్తం 1,680 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా, వీటిలో 1,656 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పెద్ద సంఖ్యలో ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం కాగా, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలకు మించి వ్యయం అవుతుండడంతో ఈ పథకం ముందుపడలేదు. ఖాళీ స్థలం ఉన్న వారికి రూ.3లక్షలు చొప్పున ఇస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో 1,656 ఇళ్లకు 28,183 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా నల్లగొండ మునిసిపాలిటీలో 552 ఇళ్లకు 13,610, మిర్యాలగూడలో 560 ఇళ్లకు 12,600, దేవరకొండలో 544 ఇళ్లకు 1,973 దరఖాస్తులు వచ్చాయి. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పక్కాగా సర్వే నిర్వహించి అర్హులను ఖరారు చేసేందుకు పెద్ద సంఖ్యలో రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. సొంత ఇల్లు, అపార్టుమెంట్‌లో అద్దెకు ఉంటున్న వారు, గతంలో ఇందిరమ్మ ఇంటిని పొందిన వారిని గుర్తించి అనర్హులుగా తేల్చారు. పూర్తిగా రేకుల ఇంటిలో అద్దెకు ఉంటున్న వారినే అర్హుల జాబితాలో చేర్చినట్టు తెలిసింది. తెల్ల రేషన్‌కార్డు ఉండి భారీ భవంతులు ఉన్న వారు సైతం డబుల్ బెడ్‌రూం ఇంటి కోసం దరఖాస్తు చేయడం గమనార్హం. విద్యుత్ బిల్లులు, ఇతర సమాచారం ద్వారా అధికారులు అనర్హులను తేల్చారు.
సాఫ్ట్‌వేర్‌తో వడపోత
భారీగా వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ బృందాలు నిషితంగా పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేశాయి. మూడు మునిసిపాలిటీల్లో సుమారు 360 మంది రెవెన్యూ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సిద్ధమైన అర్హుల జాబితాను హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీస్ కేంద్రానికి పంపగా, ఆ జాబితాను ట్రెజరీ, రోడ్ ట్రాన్స్‌పోర్ట్, రేషన్‌కార్డుతో సాఫ్ట్‌వేర్ ద్వారా క్రాస్‌చెక్ చేశారు. జిల్లా నుంచి వెళ్లిన అర్హుల జాబితాలో సుమారు 700 మందిని సాఫ్ట్‌వేర్ ద్వారా అనర్హులుగా తేల్చినట్లు సమాచారం. ఈ జాబితా గురువారం సాయంత్రం ఆయా డివిజన్ల ఆర్డీవోలకు చేరింది. జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో 1,656 ఇళ్లకు మొత్తం 28,183 దరఖాస్తులు రాగా, 9,654 మంది మాత్రమే అర్హులుగా తేలింది.
నేడు డ్రా
మిర్యాలగూడ, నల్లగొండ మునిసిపాలిటీల్లో అర్హుల జాబితా నుంచి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు శుక్రవారం డ్రా నిర్వహించనున్నారు. అందుకు నల్లగొండలో 12 కేంద్రాలు, మిర్యాలగూడలో 12 కేంద్రాలు ఖరారు చేశారు. పారదర్శకంగా ఉండేందుకు అర్హుల జాబితాను ముందే ప్రదర్శిస్తున్నారు. డ్రా మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయనున్నారు. డ్రాను అర్హులు, మీడియా, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. గురువారం సాయంత్రం దేవరకొండ మునిసిపాలిటీలో డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఖరారు చేశారు. అయితే వాస్తవానికి గురువారమే డ్రా నిర్వహించాలని తొలుత రెవెన్యూ, మునిసిపల్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నల్లగొండ మునిసిపాలిటీలో దరఖాస్తులు చేసుకున్న వారికి కౌన్సిలర్లు సోషల్ మీడియా ద్వారా సమాచారం సైతం ఇచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో డ్రానిర్వహణకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీన్ని శుక్రవారానికి వాయిదా వేయాలని సూచించడంతో ఆ మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ, మిర్యాలగూడలో శుక్రవారం సాయంత్రం 3గంటల నుంచి డ్రా నిర్వహించనున్నారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక : జయచంద్రారెడ్డి, నల్లగొండ ఆర్డీవో
డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ముందుగా అర్హుల జాబితా ఖరారు చేసి ప్రదర్శిస్తున్నాం. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించి పరిశీలిస్తున్నాం. అర్హులైన వారితో అందరి సమక్షంలో డ్రా నిర్వహిస్తున్నాం. డ్రాలో ఎంపికైన వారి జాబితాను ప్రదర్శిస్తాం. డ్రాలో ఎంపికైన వారు అనర్హులని ఎవరైన భావించి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారించి వారిని పక్కన పెడతాం. వారి స్థానంలో వందశాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఇంటిని కేటాయిస్తాం. ఇళ్ల కేటాయింపులో ఎక్కడా రాజకీయ జోక్యం, మధ్యవర్తుల ప్రమేయం లేదు.