కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2023-01-15T00:40:29+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి జూన్ 30 వరకు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.
సూర్యాపేట కలెక్టరేట్, జనవరి 14: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి జూన్ 30 వరకు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై శనివారం జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కంటివెలుగు కరపత్రాలను అందజేసి, కార్యక్రమ ప్రాముఖ్యాన్ని తెలపాలని సూచించారు. జిల్లాలో ప్రతీ రోజు 50 వైద్య బృందాలు కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తాయన్నారు. అందుకు కావల్సిన సామగ్రిని ఇప్పటికే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. 18 ఏళ్లకు పైబడిన వారందరూ శిబిరాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ కోటా చలం అన్నారు. ఈ నెల 18న జిల్లాలో 50 కంటి వెలుగు శిబిరాలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ హర్షవర్థన్, డాక్టర్ నిరంజన్, కంటి వెలుగు ప్రత్యేకాధికారులు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ నాజియా పాల్గొన్నారు.