టూర్‌ కోసం మార్కెట్‌ బంద్‌

ABN , First Publish Date - 2023-09-07T01:10:12+05:30 IST

వ్యాపారుల టూర్‌ కోసం సూర్యాపేట మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. వారి యాత్రలు ము గిసి వచ్చే వరకు ఏకంగా తొమ్మిది రోజుల పాటు మార్కెట్‌ ను మూసేశారు.

టూర్‌ కోసం మార్కెట్‌ బంద్‌
సెలవు ప్రకటిస్తూ మార్కెట్‌ బోర్డుపై రాతలు

అడ్తి అసోసియేషన సభ్యుల కోసం మార్కెట్‌కు సెలవులు

తొమ్మిది రోజుల పాటు బంద్‌ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

మార్కెట్‌కు వచ్చి ఉసూరుమంటూ తిరిగి వెళ్లిన రైతులు

సూర్యాపేట సిటీ, సెప్టెంబరు 6 : వ్యాపారుల టూర్‌ కోసం సూర్యాపేట మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. వారి యాత్రలు ము గిసి వచ్చే వరకు ఏకంగా తొమ్మిది రోజుల పాటు మార్కెట్‌ ను మూసేశారు. ఈ విషయం మారుమూల రైతులకు సమాచారం చేరకుండా కార్యాలయ ఆవరణలోని బోర్డులో సిబ్బందితో సెలవులు ఇస్తున్నట్లు రాయించి చేతులు దులుపుకున్నారు. దీంతో విషయం తెలియక పంట తీసుకువచ్చి న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్‌ కార్యదర్శి ఫసియుద్దీన తీరుతో వేల రూపాయల రవాణా ఖర్చులను అనవసరంగా భరించాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో సుమారుగా 100కు పైగా కమీషనదారులు, 50మందికి పైగా ఖరీదుదారులు పంటలు కొనుగోలు చేస్తుంటారు. ప్రతీ ఏడాది వారి వ్యాపారాల్లో వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఒకదగ్గర వేసి వాటితో ఇతర రాష్ట్రాల్లోని సందర్శన ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. దానిలో భాగంగా ఈ నెల 6 నుంచి 14 వరకు 9 రోజుల పాటు యాత్రలు చేయడానికి వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ తొమ్మిది రోజులు సూర్యాపేట మార్కెట్‌కు సెలవులు ఇస్తే తాము బెంగళూరు, మైసూర్‌, కోయంబత్తూర్‌, ఊటి, కోడైకెనాల్‌, మధుర, అరుణాచలం ప్రాంతాలను సందర్శించడానికి అవకాశం ఉంటుందని మార్కెట్‌ కార్యదర్శి కోరారు. మార్కెట్‌ కార్యదర్శి మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మార్కెట్‌కు సెలవులు ఇచ్చేశాడు.

ఇబ్బందులు పడ్డ రైతులు

సూర్యాపేట మార్కెట్‌కు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఎలాంటి ముందస్తు సమాచారం అధికారులు వెల్లడించకపోవడంతో బుధవారం మార్కెట్‌కు పంటను తీసుకువచ్చిన రైతులు తీవ్రఇబ్బందులు సడ్డారు. వేల కిరాయిలను భరించుకుని 50 బస్తాల కందులు, 30 బస్తాల పెసలు తీసుకువచ్చామని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం బీరోలు గ్రామానికి చెందిన నలుగురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీగా మార్కెట్‌ నడుస్తుందని ఇక్కడకు వచ్చామని తీరా వచ్చాక సెలవులు ఇచ్చారని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారన్నారు.

మార్కెట్‌ ఇనచార్జి కార్యదర్శి తీరిలా

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు సెలువు ప్రకటించాల్సి వస్తే గతంలో కార్యదర్శులు ఖచ్చితంగా మీడియాకు ప్రకటన విడుదల చేసేవారు. కానీ ఎండీ ఫసియుద్దీన మార్కెట్‌కు ఇనచార్జి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పద్ధతిని పాటించడం లేదు. మార్కెట్‌ కార్యాల యం ముందున్న బోర్డుపై సెలవులు ఇస్తున్నట్లు సిబ్బంది చేత రాయించి, తన బాధ్యత ఇంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ మీడియాకు పత్రిక ప్రకటనలను విడుదల చేయడమే లేదు. ఇదే క్రమంలోనే మార్కెట్‌కు ఈ నెల 6 నుంచి 14 వరకు సెలవులు ఇస్తున్నట్లు మీడియాకు వెల్లడించలేదు. ఆయన తీరుతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీవీలు, పేపర్లు, సోషల్‌ మీడియా ద్వారా మార్కెట్‌కు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడిస్తే తమకు కిరాయిల భారం తగ్గేదని మోతె మండలం కూడలి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెట్‌కు సెలవుల విషయం నా దృష్టికి రాలేదు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ఈ నెల 6 నుంచి 14 వరకు సెలవులు ప్రకటించిన విషయం నా దృష్టికి రాలేదు. వ్యాపారస్తులు టూర్‌ ప్రోగ్రాం కోసం మార్కెట్‌కు సెలవులు ఇచ్చినట్లు తెలియదు.

- కేఎన శర్మ, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

వ్యాపారుల వినతితోనే సెలవులు

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తున్న అడ్తి అసోసియేషన సభ్యులు టూర్‌ ప్రోగ్రాం పెట్టుకుంటామని, మార్కెట్‌ కు సెలవులు ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. వారి కోరిక మేరకు ఈ నెల 6 నుంచి 14 వరకు మార్కెట్‌కు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాం. ఈ విషయాన్ని మార్కెట్‌లోని సూచికబోర్డులో సిబ్బంది చేత రాయించా.

- ఎండీ ఫసియూద్ధీన, మార్కెట్‌ కార్యదర్శి

Updated Date - 2023-09-07T01:10:12+05:30 IST