Share News

వణికిస్తున్న చలిపులి

ABN , First Publish Date - 2023-12-10T23:56:47+05:30 IST

ఉమ్మడి జిల్లాలో వారం రోజుల క్రితం వరకు ఉక్కపోత ఉండగా, ఆ తరువాత వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడిన మార్పులతో చలి పెరిగింది. శీతాకాలం ప్రారంభమైనా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతోపాటు ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు.

వణికిస్తున్న చలిపులి

ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

18డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రత

వాతావరణంలో మార్పులతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ఉమ్మడి జిల్లాలో వారం రోజుల క్రితం వరకు ఉక్కపోత ఉండగా, ఆ తరువాత వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడిన మార్పులతో చలి పెరిగింది. శీతాకాలం ప్రారంభమైనా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతోపాటు ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. అయితే మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో అక్కడక్కడ వర్షాలతోపాటు చిరు జల్లులు కురిశాయి. ఆ తరువాత కనిష్ఠ ఉష్ణోగ్రత పడిపోతూ చలి తీవ్రత పెరిగింది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు గజగజా వణుకుతున్నారు.

సాధారణంగా నవంబరు మొదటి వారం నుంచే చలితీవ్రత పెరుగుతుంది. కాగా, ఈ ఏడాది ప్రస్తుత నెల మొదటి వారంలో చలి ప్రారంభమైంది. ప్రస్తుతం గ్రామీ ణం, పట్టణం అనే తేడా లేకుండా రాత్రి నుంచే పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం ఎనిమిది గంటలైనా మంచు తెరలు వీడటం లేదు. వారం రోజులుగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. మధ్యాహ్నం సమయంలో ఎండ ఉంటు న్నా చలిగాలి కారణంగా వేడి ఉండటం లేదు. చలితోపాటు గాలులు వీస్తు ండటంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉబ్బసం, జలుబు, తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఎక్కువ గా ఇబ్బంది పడుతున్నారు. 15 రోజుల క్రితం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.7డిగ్రీల వరకు ఉండగా, వారం రోజుల్లో గణనీయంగా పడిపోయాయి.ఈ నెల 6న కనిష్ఠ ఉష్ణోగ్రత 19డిగ్రీలు ఉండగా, ఆదివారం 18 డిగ్రీలకు పడిపోయింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో జనం చలి గాలులకు తట్టుకోలేకపోతున్నారు. చలిగాలులు వీస్తాయని, రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో మున్ముందు మరింత చలిపెరిగే అవకాశం ఉంది. యాదగిరిగుట్టపై గాలుల కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ కాంప్లెక్స్‌ నుంచి ప్రధానాలయంలోకి వెళ్లే వరకు చలికి వణికిపోతున్నారు.

ఆరోగ్యంపై చలి ప్రభావం

వాతావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. చలి కారణంగా శరీరంలో తేమ శాతం తగ్గి చర్మ రక్షణ శక్తి సన్నగిల్లుతోంది. చల్లటి ప్రదేశంలో బయటకు వెళ్లినా సమ స్యే. కాస్త ఎండ తీక్షణలో తిరిగినా ఇబ్బందే. చలి కారణంగా ఎక్కువగా మహిళలు, వృద్ధులు, జాగింగ్‌ చేసేవారు, అస్తమా, నిమోనియా తదితర శ్వాసకోశ బాధితులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. వాతావరణ మార్పులతో చల్లటి గాలులకు శరీరం తెల్లగా పొడిబారినట్టు మారిపోతోంది. పెదవులు, అరికాళ్లు పగిలి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. శరీరంలో తేమ శాతం తగ్గి చర్మ రక్షణ శక్తి తగ్గడంతో దురదలు వస్తున్నాయి. ముఖం పొడిబారి పగుళ్లు చోటు చేసుకుంటున్నాయి. చేతులు, కాళ్లపై చర్మం పగిలిపోయి పొడిబారుతోంది. చలితో ఇంటి పనితోపాటు, ఉద్యోగానికి వెళ్లే మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చలి కారణంగా వెచ్చదనం కోసం ప్రజలు దుప్పట్లు, స్వెట్టర్లు కొనుగోలు చేస్తున్నారు.

అంతా జాగ్రత్తలు పాటించాలి : డాక్టర్‌ కె.రఘుపతిరెడ్డి, భువనగిరి

చర్మ వ్యాధులు, శ్వాస సమస్యలు, కీళ్ల నొప్పులు ఉన్న వారిపై చలి తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఈ సమస్యలు ఉన్నవారికి మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. చలి తీవ్రంగా ఉన్నప్పుడు వెలుపలికి రాకపోవడమే మంచిది. తప్పనిసరి అయితే స్వెట్టర్‌, మఫ్లర్‌, చేతులకు గ్లౌజులు ధరించడం తప్పనిసరి. గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. మార్నింగ్‌ వాకర్స్‌ చలి తగ్గాకే వాకింగ్‌ చేయాలి. ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్‌వో కొండల్‌రావు

కనగల్‌, డిసెంబరు10: గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో కొండల్‌రావు అన్నారు. మండల కేంద్రం లో పలువురు కీళ్లనొప్పులు, చలిజ్వరంతో రెండు వారాలుగా బాధపడుతు న్న నేపథ్యంలో గ్రామ రైతువేదిక వద్ద ఆదివారం ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైద్యశిబిరంలో పరీక్షలు చేయించుకున్న రోగులు వైద్యుల సలహాలు, సూచనల ను పాటించాలన్నారు. ప్రతీ ఒక్కరు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాగా, శిబిరంలో సుమారు 100మంది రోగులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి వరూధిని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునిత, డిప్యూటీ డీఎంహెచ్‌వో వేణుగోపాల్‌రెడ్డి, డీఎంవో దుర్గయ్య, వైద్య సిబ్బంది గీతారాణి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:59:59+05:30 IST