యాదగిరి ఆలయ పునర్నిర్మాణం చరిత్రలో సువర్ణాధ్యాయం

ABN , First Publish Date - 2023-08-03T00:07:09+05:30 IST

యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్‌ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్నారని బీసీ కమిషన చైర్మన డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు.

యాదగిరి ఆలయ పునర్నిర్మాణం చరిత్రలో సువర్ణాధ్యాయం
రాష్ట్ర బీసీ కమిషన చైర్మన కృష్ణమోహనరావుకు స్వామివారి ప్రసాదాలను అందజేస్తున్న రాజనబాబు

బీసీ కమిషన చైర్మన వకుళాభరణం కృష్ణమోహనరావు

యాదగిరిగుట్ట, ఆగస్టు 2: యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్‌ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్నారని బీసీ కమిషన చైర్మన డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. లక్ష్మీనరసింహస్వామి దివ్యదర్శనం తన పూర్వజన్మ సుకృతమన్నారు. బుధవారం కుటుంబసమేతంగా యాదగిరిక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన ఆయనకు అర్చకబృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికింది. ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకున్న ఆయన ముఖమండపంలోని ఉత్సవమూర్తుల వద్ద సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దేవస్థాన అధికారులు స్వామివారి అభిషేకం లడ్డూప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనఇలవేల్పు దైవం యాదగిరీశుడని, స్వామి సన్నిధికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రభుత్వం ఆలయాన్ని నిర్మించే బృహత్కార్యం చేపట్టడం ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ఆలయాల పునరుద్ధరణను సీఎం కేసీఆర్‌ చేపడుతున్నారన్నారు. యాదగిరిక్షేత్రాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక, పర్యాటక శిల్పకళాధామంగా తీర్చిదిద్దారన్నారు. జూలైలో అమెరికాలో జరిగిన తానా మహాసభల్లో పాల్గొన్నానని, మహాత్మా జ్యోతిరావు పూలే పురస్కారంతో అక్కడి నిర్వాహకులు తనను సత్కరించారని చెప్పారు. తానా మహా సభలనుంచి ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు బంధువులు, మిత్ర బృందంతో వచ్చినట్లు తెలిపారు. అంతకుముందు ఆయనకు వీఐపీ అతిథిగృహం ఎదుట భువనగిరి ఆర్డీవో అమరేందర్‌, జిల్లా బీసీ సం క్షేమ అధికారి యాదయ్య పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

యాదగిరిక్షేత్రంలో వైభవంగా నిత్యతిరుకల్యాణపర్వాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో నిత్యతిరుకల్యాణపర్వాలు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో వైభవంగా కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు బిందెతీర్థంతో నిత్యారాధనలు ప్రారంభించారు. స్వయంభువులను, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, అర్చించారు. అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనుడికి తొలిపూజలతో కల్యాణతంతు కొనసాగింది. సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన అనుబంధ శివాలయంలో పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి నిత్యపూజలు, యాగశాలలో రుద్రహవనం శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.11,43,913 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-08-03T00:07:09+05:30 IST