వచ్చేస్తోంది.. వందేభారత్‌

ABN , First Publish Date - 2023-03-31T00:08:27+05:30 IST

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి తొందరగా చేరేందుకు రైల్వేశాఖ మార్గం సుగమం చేసింది. సుదూర ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వరకు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ వందేభారత్‌ రైలు ప్రారంభించనున్నారు.

వచ్చేస్తోంది.. వందేభారత్‌

ఇక నుంచి తొందరగా తిరుపతికి

సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరనున్న రైలు

నల్లగొండ, మిర్యాలగూడ టౌన్‌, మార్చి 30: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి తొందరగా చేరేందుకు రైల్వేశాఖ మార్గం సుగమం చేసింది. సుదూర ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వరకు నడిపేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 8న ప్రధాని నరేంద్రమోదీ వందేభారత్‌ రైలు ప్రారంభించనున్నారు. వందేభారత్‌ రైలును తొలుత ఖాజీపేట్‌-వరంగల్‌ రూట్లో తిరుపతి వరకు నడిపించాలని రైల్వేశాఖ ఉన్నతాధికారులు భావించారు. అయితే దూరభారం కారణంగా ఆ రైలును బీబీనగర్‌-నడికుడి మీదుగా నడిపించాలని పునరాలోచన చేశారు. అందుకు ఆధునీకరించిన రైల్వేలైన్‌ ఈ మార్గంలో ఉండటం, తిరుపతి రూట్లో ప్రయాణించే శ్రీవారి భక్తులు అధికంగా ఉండటంతో నల్లగొండ మీదుగా వందేభారత్‌ను నడిపేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు.

ఆధునికీకరించిన నేపథ్యంలో..

సెమీ హైస్పీడ్‌, ఎలక్ట్రిక్‌ మల్టిపుల్‌ యూనిట్లతో కూడిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటకు సుమారు 130 నుంచి 160 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. అలాంటి ట్రైన్‌ పరుగులు తీయాలంటే పట్టాలు పటిష్ఠంగా ఉండాల్సిందే. అయితే ఇటీవల బీబీనగర్‌-నడికుడి రైల్వేరూట్‌ను ఆధునీకరించారు. 130కిలోమీట్లర్ల వేగంతో రైలు ప్రయాణించే విధంగా సిద్ధంగా ఉన్న ఈ రూట్‌ను పరిశీలించిన ఉన్నతాధికారులు వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను నడిపేందుకు రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపడంతో వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను ఈ రూట్లో నడిపే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం నారాయణాద్రి రైలు సికింద్రాబాద్‌ నుంచి నిత్యం తిరుపతికి వెళ్తుండగా మొత్తం 12.30గంటల సమయం పడుతోంది. అదే వందేభారత్‌ రైలు అయితే 9గంటల కంటే తక్కువ సమయంలోనే తిరుపతికి చేరవచ్చు. అంటే మూడు నుంచి నాలుగు గంట మేర సమయం ఆదా అవుతుంది.

ఈ స్టేషన్ల మీదుగా..

బీబీనగర్‌-నడికుడి జంక్షన్ల నుంచి వందేభారత్‌ రైలు ప్రయాణించనుంది. ఈ మార్గంలో సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరిన రైలు నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో మాత్రమే ఆగనుంది. అందుకు రైల్వేశాఖ అధికారులు రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసినట్టు సమాచారం. ప్రధాని మోదీ ఏప్రిల్‌ 8న వందేభారత్‌ రైలును ప్రారంభించనుండగా, రైల్వే శాఖ ఉన్నతాధికారులు 4, 5వ తేదీల్లో ఈ రూట్‌ను పరిశీలించి ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్టు సమాచారం.

నల్లగొండ, మిర్యాలగూడలో ఆగని పలు రైళ్లు

సికింద్రాబాద్‌ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు ఇతర రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో నిలవకుండా వెళ్తుండడంతో ప్రయాణికులు నిరాశ చెందుతున్నారు. కరోనాకు ముందు ఆగిన రైళ్లు కొవిడ్‌ ఆంక్షల కారణంగా నల్లగొండ, మిర్యాలగూడ స్టేషన్లలో నిలవడం లేదు. కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేశాక కూడా రైళ్లు ఆగకుండా వెళ్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య నడిచే అమరావతి రైలు నల్లగొండలో ఆగడం లేదు. ఉదయం 7గంటలకు అమరావతి వైపు వెళ్తుండగా, రాత్రి 8.40కి సికింద్రాబాద్‌ వైపు అమవరావతి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తోంది. సికింద్రాబాద్‌ నుంచి చెన్నైకి, విశాఖకు వెళ్లే రైళ్లతో పాటు డెల్టా, రేపల్లె రైళ్లు సైతం నల్లగొండ స్టేషన్‌లో తిరుగు ప్రయాణంలో ఆగడం లేదు. మిర్యాలగూడ రైల్వే ప్రయాణికుల పరిస్థితీ అంతే ఉంది. పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి, రైల్వే జనరల్‌ మేనేజర్‌కు వినతిపత్రాలు అందజేసినా రైళ్లు ఆగడం లేదు. సికింద్రాబాద్‌ నుంచి మిర్యాలగూడ మీదుగా 11 రైళ్లు వెళ్తున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు నిలుస్తున్నా, గుంటూరు నుంచి మిర్యాలగూడ మీదుగా సికింద్రాబాద్‌ వైపు వెళ్లే రైళ్లు రాత్రి సమయంలో నిలపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - 2023-03-31T00:08:27+05:30 IST