Telangana Results: ఫేట్ మార్చిన పేరు.. బీఆర్‌ఎస్ పేరు మార్పు వ్యూహం దారుణంగా బెడిసికొట్టిందా?
ABN , First Publish Date - 2023-12-03T22:09:02+05:30 IST
పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు షాకిచ్చారు. ప్రజారంజక పాలన అందించామని గొప్పలు చెప్పుకుంటున్న గులాబీ నేతలను ఖంగు తినిపించారు.
పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ (KCR) హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు షాకిచ్చారు (Telangana Elections). ప్రజారంజక పాలన అందించామని గొప్పలు చెప్పుకుంటున్న గులాబీ నేతలను ఖంగు తినిపించారు. కేసీఆర్ ఓటమికి చాలా కారణాలు వినబడుతున్నాయి. అయితే వాటిల్లో పార్టీ పేరు మార్పు అంశం ప్రముఖంగా వినిపిస్తోంది (Telangana Results).
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పుట్టింది తెలంగాణ సాధించడం కోసమే. ఈ మాట కేసీఆర్, ఆ పార్టీ నేతలు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలు కూడా గాఢంగా విశ్వసించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అయినా, ఉద్యమాన్ని ముందుండి నడిపించింది టీఆర్‌ఎస్ అని ప్రజలు బలంగా నమ్మి, తొలిసారి అధికారాన్ని కట్టబెట్టారు. ఆశయాల సాధన, అభివృద్ధి నినాదంతో 2018లో మరోసారి టీఆర్‌ఎస్ గెలిచింది. అయితే రెండోసారి గెలిచిన తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం అంటూ మరో కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు.
Telangana Results: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు వ్యూహం ఇదే.. తెలంగాణ ఓటర్లను ఆకట్టుకున్న కాంగ్రెస్ హామీలు..
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి (BRS)గా మార్చారు. అయితే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నిలకడ ప్రదర్శించలేదు. రెండు, మూడు రాష్ట్రాల్లో పర్యటించి మమ అనిపించారు. అయితే పేరు మార్చడం వల్ల మాత్రం నష్టం వాటిల్లింది. పేరులో లోకల్ ఫ్లేవర్ మిస్ కావడం చాలా పెద్ద నష్టాన్ని తెచ్చి పెట్టింది. తను మాత్రమే నిజమైన తెలంగాణ వాదినని కేసీఆర్ చెప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది.