New Secretariat : కొత్త సచివాలయంకు వెళ్లిన ఉద్యోగుల్లో గందరగోళం.. తొలిరోజు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..
ABN , First Publish Date - 2023-05-01T12:18:27+05:30 IST
తెలంగాణ కొత్త సచివాలయం (TS New Secretariat) ఉద్యోగులతో (Employees) కలకలలాడుతోంది. ఉద్యోగులంతా..
తెలంగాణ కొత్త సచివాలయం (TS New Secretariat) ఉద్యోగులతో (Employees) కలకలలాడుతోంది. ఉద్యోగులంతా డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం బాట పట్టారు. తొలిరోజు కావడంతో సచివాలయ ద్వారం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ్టి నుంచి కొత్త సచివాలయంలోనే ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఉద్యోగి ఐడీ కార్డ్ చూసి లోపలికి భద్రత సిబ్బంది అనుమతి ఇస్తున్నారు. అయితే తొలిరోజు కావడంతో ఉద్యోగులు కాస్త గందరగోళంగా ఉన్నారు. మరోవైపు.. ఏ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలో అర్థంకాక సచివాలయం చుట్టూ ఉద్యోగులు, పైలెట్ వాహనాలు తిరుగుతున్నాయి. మరికొందరు ఉద్యోగులు అరగంట నుంచి సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. సూచికలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. మంత్రులు హరీష్ రావు (Harish Rao), ప్రశాంత్ రెడ్డి (Prasanth Reddy), సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఇవాళ ఉదయాన్నే సచివాలయంకు చేరుకున్నారు. మరికొందరు మంత్రులు ఇప్పుడిప్పుడే సచివాలయానికి చేరుకుంటున్నారు. కాగా.. కొత్త సచివాలయంలో నేడు కేసీఆర్ తొలి సమీక్ష (CM KCR First Review) సమావేశం నిర్వహించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం సమీక్ష నిర్వంచబోతున్నారు. కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణ్ పూర్ కొడంగల్ వికారాబాద్‌కు వెళ్లే తాగునీటి కాలువలను కేసీఆర్ సమీక్షిస్తారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కార్యదర్శి స్మిత సబర్వాల్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక కార్యదర్శి, ఇరిగేషన్ ఈఎన్సీ, ఛీఫ్ ఇంజనీర్లతో పాటు పలువురు అధికారులు హాజరుకానున్నారు. కొత్త పరిపాలనా సౌధంలో తొలిసారి నిర్వహిస్తున్న సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో గత రెండు మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా వాటిల్లిన పంట నష్టంపై కూడా అధికారులతో సీఎం మాట్లాడనున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను అధికారులు, మంత్రులకు కేసీఆర్ వివరించనున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎంత పంట నష్టం వాటిల్లింది..? రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణం ఏం చేయాలి..? అనే విషయాలపై సమీక్షలో కేసీఆర్ చర్చించి అధికారులు కీలక సలహాలు, సూచనలు చేయనున్నారు. ముఖ్యంగా యాసంగి ధాన్యం, మక్కల కొనుగోలుకు సంబంధించిన వివరాలను అడిగి కేసీఆర్ తెలుసుకోనున్నారు. కాగా.. ఆదివారం నాడు సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆరు కీలక ఫైళ్లపై సీఎం సంతకం చేసిన సంగతి తెలిసిందే.