పోటెత్తిన వరద
ABN , First Publish Date - 2023-07-22T00:16:29+05:30 IST
జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్ట్‌లతో పాటు మంజీరా నది ఆయా మండలాల్లోని వాగులు, వంకల్లోనూ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మొన్నటి వరకు వట్టిపోయిన ప్రధాన ప్రాజెక్టులైన నిజాంసాగర్, పోచారం, కౌలాస్‌నాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి 38వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది.
- ప్రధాన ప్రాజెక్టులు, చెరువులకు భారీగా చేరుతున్న వరద
- నిండుతున్న నిజాంసాగర్ ప్రాజెక్ట్
- ప్రాజెక్ట్‌లోకి 28వేల క్యూసెక్కులకు పైగా వరద
- అలుగు దూకుతున్న పోచారం ప్రాజెక్ట్
- కళ్యాణి రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత.. నీటి విడుదల
- ఒక టీఎంసీకి చేరిన కౌలాస్ ప్రాజెక్ట్ నీటి మట్టం
- ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది
- వరద నీటిలో మునిగిపోతున్న వరి, సోయా, పత్తి, మొక్కజొన్న
- వరద ప్రవాహానికి పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
- జిల్లా వ్యాప్తంగా 48.5 మి.మీ వర్షపాతం నమోదు
కామారెడ్డి, జూలై 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్ట్‌లతో పాటు మంజీరా నది ఆయా మండలాల్లోని వాగులు, వంకల్లోనూ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మొన్నటి వరకు వట్టిపోయిన ప్రధాన ప్రాజెక్టులైన నిజాంసాగర్, పోచారం, కౌలాస్‌నాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి 38వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు నీటి మట్టం 10 టీఎంసీలకు చేరే అవకాశం ఉంది. పోచారం ప్రాజెక్ట్ పూర్తిగా నిండుకుని అలుగు దూకుతోంది. కౌలాస్‌నాలా ప్రాజెక్ట్ సైతం 1 టీఎంసీకి చేరింది. కల్యాణి రిజర్వాయర్‌కు సైతం భారీగా వరద వస్తుండడంతో గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 48.5 మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా భిక్కనూర్‌లో 76.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడం, వరదలు పోటెత్తుతుండడంతో పలు మండలాల్లోని గ్రామాల్లో వరి,సోయా, పత్తి, మొక్కజొన్న పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిండుకుంటున్న ప్రధాన ప్రాజెక్టులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వర ప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరద నీటితో నిండుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్‌ప్లో వస్తోంది. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి 38 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ 8 టీఎంసీల నీటి మట్టానికి చేరింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు. ప్రాజెక్ట్ 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1395.34 అడుగులలో నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లోకి ఎగువన ఉన్న మంజీరా నది నుంచే కాకుండా కళ్యాణి గేట్లు ఎత్తివేయడం, పోచారం ప్రాజెక్ట్ అలుగు దూకుతుండడంతో ఆ వరద అంతా నిజాంసాగర్‌లోకి వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే వచ్చే రెండు రోజుల్లో ప్రాజెక్ట్ 10 టీఎంసీలకు చేరే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. జుక్కల్‌లోని కౌలాస్ ప్రాజెక్ట్ సైతం నిండుతోంది. ఈ ప్రాజెక్ట్‌లోకి 800ల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ 1.023 టీఎంసీల నీటి మట్టానికి చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.237 టీఎంసీలు. ఈ ప్రాజెక్ట్ సైతం పూర్తిస్థాయిలో త్వరలోనే నిండే అవకాశం ఉంది. పోచారం ప్రాజెక్ట్‌లోకి 10వేలకు పైగా క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పై నుంచి ఉధృతంగా వరద ప్రవహిస్తూ అలుగు దూకుతోంది. కళ్యాణి రిజర్వాయర్‌కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలో ఇలా భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్ట్‌లు నిండడంతో జలకళను సంతరించుకుంటున్నాయి.
పోటెత్తిన వరద.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
జిల్లాలో నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్ట్‌లోకి వరద పోటెత్తింది. దీంతో పాటు వాగులు, వంకలు వరద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లింగంపేట పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో మంజీరా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైన నది వైపునకు వెళ ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పిట్లం, బిచ్కుంద, మద్నూర్, నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్ మండలాల పరిధిలో మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తోంది. పిట్లం మండలంలోని నల్లవాగు, కాకివాగు పొంగి పొర్లడంతో పిట్లం, నారాయణఖేడ్, సంగారెడ్డి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేట మండలం కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న సంగమేశ్వర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మద్నూర్ మండలం హసన్‌టాక్లి, లింబూర్, సిర్పూర్ మధ్య బ్రిడ్జిపై నుంచి లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుడడంతో ఇరుగ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
నీటమునిగిన వేలాది ఎకరాలు
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురువడంతో వాగులు, వంకల్లో, ప్రాజెక్ట్‌ల్లోకి భారీగా వరద పోటెత్తడంతో శివారు ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు వరద నీరు పంట పొలాల్లో చేరడంతో పంటలు నీట మునుగుతున్నాయి. బీర్కూర్ మండలంలో వందలాది ఎకరాల్లో వేసిన వరినాట్లు మునిగిపోయాయి. దీంతో వరినాట్లు వేసిన పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. బిచ్కుంద, పెద్దకొడప్‌గల్, పిట్లం, మద్నూర్, గాంఽధారి, సదాశివనగర్ మండలాల్లోనూ పలు గ్రామాల్లో సోయా, పత్తి, వరి పంట పొలాల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
భిక్కనూర్‌లో అత్యధికం
జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భిక్కనూర్, నాగిరెడ్డిపేట, నస్రూల్లాబాద్, బాన్సువాడ, బీబీపేట మండలాల్లో అత్యధికంగా వర్షం కురిసింది. అత్యధికంగా భిక్కనూర్‌లో 76.4 మి.మీ వర్షం కురువగా నాగిరెడ్డిపేట మండలంలో 71.6, నస్రూల్లాబాద్‌లో 69.5, లింగంపేటలో 69.1, బాన్సువాడలో 66.1 మి.మీ, నిజాంసాగర్‌లో 63.5 మి.మీ, ఎల్లారెడ్డిలో 68.9 మి.మీ, గాంధారిలో 62.3 మి.మీ, బీబీపేటలో 60.7 మి.మీ, దోమకొండలో 54.1 మి.మీ, మద్నూర్‌లో 50.6, పల్వంచలో 50.4 మి.మీ, మాచారెడ్డిలో 48.2 మి.మీ, రాజంపేటలో 47.8 మి.మీ, తాడ్వాయిలో 44.9 మి.మీ, పిట్లంలో 40.4 మి.మీ, బీర్కూర్‌లో 32.6 మి.మీ, డోంగ్లిలో 32.5 మి.మీ, జుక్కల్‌లో 17.4 మి.మీ, పెద్దకొడప్‌గల్‌లో 26.1 మి.మీ, బిచ్కుందలో 17.7 మి.మీ, బీర్కూర్‌లో 32.6 మి.మీ, సదాశివనగర్‌లో 24.8 మి.మీ, రామారెడ్డిలో 25.5 మి.మీ, కామారెడ్డిలో 42.4 మి.మీ వర్షపాతం నమోదైంది.