పట్టణాల్లో అమృత్
ABN , First Publish Date - 2023-07-18T23:45:02+05:30 IST
మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే 30 ఏళ్లలో పెరగనున్న జనాభాను అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా తాగునీటి ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు రూపొందించింది.
- మున్సిపాలిటీల్లో రాబోయే 30 ఏళ్లలో జనాభాకు సరిపడా తాగు నీరిచ్చేలా ప్రణాళిక
- రూ.212 కోట్లతో మిషన్ భగీరథ-అర్బన్ 2.0
- కామారెడ్డికి రూ.92 కోట్లు, ఎల్లారెడ్డి, బాన్సువాడలకు చెరో రూ.60 కోట్లతో ప్రతిపాదనలు
- ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే..
కామారెడ్డి, జూలై 18: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే 30 ఏళ్లలో పెరగనున్న జనాభాను అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా తాగునీటి ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కేంద్రప్రభుత్వ సహకారంతో మిషన్ భగీరథ-అర్బన్ 2.0(అమృత్) పథకం ద్వారా తాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్‌లు, కొత్త పైప్‌లైన్ల ఏర్పాటు నీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నారు.
తీరనున్న తాగునీటి సమస్య
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో వేసవి కాలం వచ్చిందంటే తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. కొత్త రెండు మున్సిపాలిటీలు ఏర్పడడం, కామారెడ్డి మున్సిపాలిటీలో సమీప గ్రామాలు విలీనం చేయడం, పట్టణాల్లో ఏటేటా పెరుగుతున్న జనాభా, భవన నిర్మాణాలతో తాగునీటి సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న ట్యాంకుల కెపాసిటీ సరిపోకపోడం, కాలనీల్లో అంతర్గత పైప్‌లైన్‌లు లేకపోవడం వల్ల ఇబ్బందులు, సమస్యలు వస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం 2.0 అమలు చేయాలని నిర్ణయించింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు మొత్తం 212 కోట్లతో మిషన్ భగీరథ అర్బన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో కామారెడ్డికి రూ.92 కోట్లు, ఎల్లారెడ్డి, బాన్సువాడలకు చేరో రూ.60 కోట్లతో ప్రతిపాదనలు చేయనున్నారు.
ఆన్‌లైన్ విధానంలో నీటి సరఫరా, పర్యవేక్షణ
గతంలో మాదిరిగా కాకుండా కొత్త టెక్నాలజీ ద్వారా తాగునీటిని సరఫరా చేయనున్నారు. జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల్లో స్కాడా పేరుతో కంప్యూటర్లను ఏర్పాటు చేయనున్నారు. పట్టణాల్లోని ప్రధాన ట్యాంకుల ద్వారా ఎప్పుడు ఎంత తాగునీటిని విడుదల చేస్తున్నారో పూర్తిసమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. దీంటో నీటి సరఫరాలో ఏర్పడే అంతరాయాన్ని కూడా సులభంగా తెలుసుకోవడం వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో తాగునీటి పథకాలు పూర్తిచేసిన వెంటనే మున్సిపాలిటీలకు అప్పగించే వారు. దీంతో క్షేత్రస్థాయిలో పైప్‌లైన్ల లీకేజీ, పైపులు పగిలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొత్త విధానంలో ప్రాజెక్ట్‌ల పనులు పూర్తయిన తర్వాత ప్రజారోగ్యశాఖ పర్యవేక్షణలో సంబంధిత కాంట్రాక్ట్ సంస్థదే ఐదేళ్ల పాటు నిర్వహణ చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో తాగునీటి సరఫరాలో లోపాలు జరిగితే సరిదిద్దడం, మరమ్మత్తు చేయడం వంటివి కాంట్రాక్ట్ సంస్థనే చూసుకునేలా నిబంధనలు రూపొందించారు.