విజృంభిస్తున్న విష జ్వరాలు
ABN , First Publish Date - 2023-09-15T23:54:38+05:30 IST
జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలతో రోజురోజుకూ జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం వల్లనో లేదా క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్లనో దోమకాటు, వైరల్ ఫీవర్, విష జ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
- భయపెడుతున్న మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్‌లు
- చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు మంచాన పడుతున్న వైనం
- రోజురోజుకూ పెరుగుతున్న వైరల్ ఫీవర్, దోమకాటు బాధితులు
- ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న జనం
- దోమల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టెనా?
కామారెడ్డి టౌన్, సెప్టెంబరు 15: జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలతో రోజురోజుకూ జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం వల్లనో లేదా క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్లనో దోమకాటు, వైరల్ ఫీవర్, విష జ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాలు పడుతున్నాయన్న సంబరం కంటే జ్వరాలు సోకుతున్నాయనే ఆందోళనే ప్రజల్లో ఎక్కువగా కనబడుతోంది. జలుబు, దగ్గు, తీవ్ర జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద జనం క్యూకడుతున్నారు. ప్రగతి కార్యక్రమాలు చేపట్టి చాలా చోట్ల నీటి నిల్వలు, దోమల ఆవాస కేంద్రాలు లేకుండా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కనపడడం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్దమొత్తంలో మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ భారిన పడి చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మరికొందరు తీవ్ర జ్వరం, కప్పంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడడంతో ఆయా ఆసుపత్రులలో ఇన్‌పేషంట్‌లుగా చేరి రోజుల తరబడి చికిత్సలు పొందుతున్నారు.
విజృంభిస్తున్న వైరల్, దోమకాటు వ్యాధులు
ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాల్లో పేరుకపోయిన చెత్తను, పిచ్చిమొక్కలు, నీటి నిల్వలపై దృష్టి సారించకపోవడంతో జిల్లాలో దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వర్షాలకు పలు చోట్ల రహదారులు కోతకు గురై గుంతలు ఏర్పడి నీరు నిల్వడంతో దోమలు వృద్ధి చెంది పగలు రాత్రి అనే తేడా లేకుండా కుడుతూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ జ్వరాలన్నింటిలోనూ ఎక్కువగా మలేరియా, డెంగ్యూ కేసులు ఉండడం అందులోనూ చిన్నారులే ఎక్కువగా ఈ వ్యాధి భారిన పడడంతో తల్లిదండ్రుల్ల్లో భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక వైరల్ జ్వరాలు సైతం చిన్న, పెద్ద అని తేడా లేకుండా సోకుతుండడంతో ఇంట్లో ఉన్న నలుగురైదుగురు మంచాన పడి ఆసుపత్రులలో చేరి చికిత్సలు తీసుకొంటున్నారు.
రోగులతో ఆసుపత్రులు కిటకిట
జిల్లాలో విష జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రజలు పరుగులు పెడుతుండడంతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ విషజ్వరాలు అత్యధికంగా వెనుకబడిన ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, తండాలు, మురికి వాడల్లో సోకుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పేద మధ్య తరగతి ప్రజలే ఉండడంతో ఆర్థిక స్థోమత లేక వైద్యం కోసం స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రులకు తరలుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగుల తాకిడి పెరిగిపోతుండడంతో బెడ్లను సర్దుబాటు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైద్య సిబ్బంది పేర్కొనడం గమనార్హం. ప్రైవేట్ ఆసుపత్రులలో సైతం రోగుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆయా ఆసుపత్రుల వైద్యులు పేర్కొంటున్నారు.
దోమల నివారణపై కార్యాచరణ ప్రకటించేనా?
ప్రస్తుతం జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం పదిలోపే కేసులు నమోదవుతున్నాయని చెబుతున్నప్పటికీ అనధికారికంగా అనేక ఆసుపత్రులలో 50కిపైగానే దోమకాటు బాధితులు చికిత్సలు పొందుతున్నారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో దోమల నివారణకు అంతంత మాత్రంగానే చర్యలు తీసుకుంటుండడంతో దోమల సంతతి పెరిగిపోయి దోమకాటు బాధితులు ఎక్కువవుతున్నారు. మున్సిపాలిటీల్లో కేవలం ఒకరిద్దరిని మాత్రమే దోమల నివారణ మందులు కొట్టేందుకు ఉపయోగిస్తుండడం, ఇక గ్రామాల్లో నైతే వారానికి ఒక్కసారి మాత్రమే మందుల పిచికారీ చేపడుతున్నారని దోమల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాలని అప్పుడే దోమకాటు బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉందనే వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.