బీఆర్‌ఎస్‌దీ పేగు బంధం
ABN , First Publish Date - 2023-08-17T01:27:50+05:30 IST
బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పేగుబంధంతో కూడిన పార్టీ అని, ప్రతిపక్షాలది ఓటుబంధంతో కూడిన పార్టీలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్ పట్ట ణంలో బుధవారం నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల కార్యకర్తల సమావేశం శక్కర్‌నగర్ మైదానంలో నిర్వహించారు.
ప్రతిపక్షాలది ఓటు బంధం
బోధన్‌లో సీనియారిటీ, సిన్సియారిటీకి మధ్య పోటీ
బోధన్ సభలో ఎమ్మెల్సీ కవిత
బోధన్‌రూరల్,ఆగస్టు 16: బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పేగుబంధంతో కూడిన పార్టీ అని, ప్రతిపక్షాలది ఓటుబంధంతో కూడిన పార్టీలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్ పట్ట ణంలో బుధవారం నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల కార్యకర్తల సమావేశం శక్కర్‌నగర్ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోధన్ పట్టణంలోని ఏఆర్ గార్డెన్ నుంచి సభ స్థలి వరకు పాదయాత్ర కొనసాగింది. భారీ బహిరంగసభలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి తన సీనియారిటీ తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బోధన్ ఎమ్మెల్యేగా షకీల్ రెండు పర్యాయాలు గెలిచి పేద ప్రజల మన్ననలు పొందారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ మాజీమంత్రి సీనియారిటికి, ఎమ్మెల్యే సిన్సి యారిటీకి మధ్య జరిగే పోరులో షకీల్‌ను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుల, మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయ పబ్బం గడిపాయన్నారు. కొందరు నాయకులు రాష్ట్ర రాజధానిలో తిష్ట వేసి మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర యాత్రతో ఓరిగిందేమీ లేదన్నారు. యువతను ఆదుకునేందుకు 1.35లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు జిల్లా కేంద్రాలలో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో 24గంటల విద్యుత్ ఇచ్చే కేసీఆర్ కావాలా? మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా? ఉద్యోగాల కేసీఆర్ కావాలా? నిరుద్యోగ కాంగ్రెస్ కావాలా? అని సభలో ప్రజలను ప్రశ్నించారు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి చేరువైందన్నారు. ఎమ్మెల్యే షకీల్ నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉన్నారని, ఈ రోజు నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశమే నిదర్శనంగా మారిందన్నారు. అనంతరం పట్టణ శివారులోని మినార్‌పల్లి ఎక్స్‌రోడ్డు వద్ద గల కమ్మ సంఘ భవనాన్ని సందర్శించారు. కుల సంఘ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. కమ్మ సంఘ భవన అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.రాంకిషన్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్, జడ్పీటీసీ లక్ష్మి గిర్ధావర్ గంగారెడ్డిలతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ మత రాజకీయ కుట్ర
బీఆర్‌ఎస్ ఓటమికి బీజేపీ మత రాజకీయ కుట్ర పన్నుతోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. 10ఏళ్ల పాలనలో వేల కోట్ల రూపాయలతో బోధన్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మళ్లీ అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన కోరారు.అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వారి మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
బీఆర్‌ఎస్‌లోకి ఎడపల్లి మాజీ ఎంపీపీ
ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీపీ గైని పోచయ్య ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పార్టీలో చేరికలు ఇప్పుడే మొదలయ్యాయని, ఎన్నికల వరకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కార్యకర్తలే ఉండే పరిస్థితి లేదని అన్నారు.
ఆకట్టుకున్న కళాకారుల ధూంధాం
నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల కార్యకర్తల సమావేశంలో కళాకారుల ధూంధాం ఆకట్టుకుంది. మధుప్రియ, అష్ట గంగాధర్ ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.