ప్రధాన పార్టీల్లో వర్గపోరు
ABN , First Publish Date - 2023-07-30T00:08:18+05:30 IST
ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలోని ప్రధాన పార్టీలను సమస్యలు వేధిస్తున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో స్వపక్షాన్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ముఖ్య నాయకులకు ఎదురవుతోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా జిల్లాలోని మూడు ప్రధాన పార్టీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
- జిల్లాలోని ప్రధాన పార్టీల్లో అంతర్గత కలహాలు
- ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా
- కారులో చెరో తీరుగా సీనియర్లు
- టికెట్ల కోసం రోజురోజుకూ పెరుగుతున్న ఆశావహులు
- కాంగ్రెస్‌లోనూ కుమ్ములాట.. ఎవరికి వారే కార్యక్రమాలు
- కమలంలోనూ కలహాల కాపురం
- అయోమయంలో ప్రధాన పార్టీల కార్యకర్తలు
కామారెడ్డి, జూలై 29(ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలోని ప్రధాన పార్టీలను సమస్యలు వేధిస్తున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో స్వపక్షాన్ని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ముఖ్య నాయకులకు ఎదురవుతోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా జిల్లాలోని మూడు ప్రధాన పార్టీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌లో చెరో తీరుగా సీనియర్ల వ్యవహారం కొనసాగుతుందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా కొందరు సీనియర్ నేతలు ఈ సారి మాకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా పేర్కొనే కాంగ్రెస్‌లోనూ కుమ్ములాట కొనసాగుతునే ఉంది. రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీలోనూ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, కలహాలు నెలకొంటుండడంతో బీజేపీని పరేషన్ చేస్తోంది. రానున్న ఎన్నికల్లో ఈ మూడు ప్రధాన పార్టీలకు చాలా ప్రతిష్ఠాత్మకం. ఇలాంటి సందర్భాల్లో స్వపక్షాన్నే సరిదిద్దుకునేందుకు సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
కారులో వర్గపోరు
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టికెట్లు ఇస్తామని గతంలో సీఎం కేసీఆర్ చెప్పినప్పటి నుంచి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కొందరు ఆశావహులు జీర్ణించుకోవడం లేదు. పాత వాళ్లపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా వాళ్లనే మళ్లీ ఎలా అభ్యర్థులుగా ప్రకటిస్తారని కార్యకర్తల వద్ద కొంతమంది చర్చించుకుంటున్నారు.
కామారెడ్డిలో..
కామారెడ్డి నియోజకవర్గంలో పైకి అంతా కలిసి ఉన్నట్లే కనిపిస్తున్నా అంతర్గతంగా ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు నియోజకవర్గంలో కొందరు సీనియర్‌లు అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సీనియర్ నేతలు ప్రభుత్వ విప్‌తో అంటీముట్టనట్టుగా ఉంటుండడం కలవర పెడుతోంది. ప్రజల్లో అంతగా పట్టులేని కొందరు నాయకులకు విప్ ప్రాఽధాన్యత ఇస్తున్నారని సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నేతగా ఉన్న నిట్టువేణు గోపాల్‌రావు ఇప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకవర్గాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ విప్‌తో దూరంగానే ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అధిష్ఠానం టికెట్ ఇస్తే పోటీ చేస్తానని తన వర్గీయులతో చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజిబొద్ధీన్, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు సైతం టికెట్‌లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విప్‌తో ఈ ముగ్గురు నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నా బయటపడడం లేదనే ప్రచారం సాగుతోంది.
ఎల్లారెడ్డిలో..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఈ సారి తనకే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సురేందర్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సురేందర్‌కు పోటీగా ఆ పార్టీ నుంచి టికెట్‌లు ఆశిస్తున్న ఆశావహులు పెద్దగా లేరు. కానీ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంపత్‌గౌడ్ బీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలంటూ పలుమార్లు అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. సంపత్‌గౌడ్ కాకుండా మరో ఇద్దరు సీనియర్ నేతలు సైతం టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే ప్రస్తుతం సురేందర్‌కు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవితల అండదండలు ఉండడం, వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వీరిని ఆహ్వానిస్తున్నారు.
జుక్కల్‌లో..
జుక్కల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హనుమంత్‌షిండేకు సైతం ఇంటిపోరు తప్పడం లేదు. నాలుగు పర్యాయాలుగా నియోజకవర్గం నుంచి గెలుపొందిన షిండేకు సొంత పార్టీలోని కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కొందరు సెకండ్ క్యాడర్ నాయకులు టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ముగ్గురు పార్టీ సీనియర్ నేతలు ఈసారి జుక్కల్ నియోజకవర్గం నుంచి తమకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్ఠానాన్ని వేడుకుంటున్నారు. అయితే ఈసారి సైతం తమ నేతకే టికెట్ దక్కుతుందని షిండే వర్గీయులు చెప్పుకొస్తున్నారు.
బాన్సువాడలో..
బాన్సువాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, ఆ పార్టీలో టికెట్ ఆశించే నాయకులు లేరు.
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కుమ్ములాట
కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీకి పోటీగా ఆ పార్టీలో ఎవరూ లేరు. వచ్చే ఎన్నికల్లో షబ్బీర్‌అలీకే టికెట్ ఖాయం కానుంది. దీంతో షబ్బీర్‌అలీ నియోజకవర్గాన్ని చుట్టేస్తూ పలు ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాత్రం గత కొన్నేళ్లుగా ఇద్దరు నేతల మధ్య కుమ్ములాట కొనసాగుతునే ఉంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి,మదన్‌మోహన్‌రావులు టికెట్‌లు ఆశిస్తున్నారు. వీరు ఇరువురు ఎవరికి వారే వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో ఈ ఇరువురి నేతల వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగిన సంఘటనలు సైతం ఉన్నాయి. ఈ ఇరువురి నేతలు ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి సైతం ఫిర్యాదు చేసుకున్నారు. తమ నేతకే టికెట్ వస్తుందని సుభాష్‌రెడ్డి వర్గీయులు చెబుతుండగా లేదు తమ నేతకే పార్టీ టికెట్ ఖాయమని మదన్‌మోహన్ వర్గీయులు చెబుతున్నారు. ఈ ఇరువర్గాల మధ్య పార్టీ అధిష్ఠానం సమన్వయం చేయలేకపోతోంది. కాంగ్రెస్ టీజేఎస్ ఒక్కటే బరిలో ఉంటే సుభాష్‌రెడ్డి, మదన్‌మోహన్‌లకు కాకుండా తనకే టికెట్ వస్తుందని టీజేఎస్ నాయకులు నిజ్జన రమేష్ సైతం ప్రచారం చేసుకుంటున్నారు. చివరికి వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో చూడాలి. జుక్కల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ నుంచి ముగ్గురు నేతలైన మాజీ ఎమ్మెల్యే గంగారం, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుపు గంగాధర్, మరో నేత లక్ష్మీకాంత్‌రావులు టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు నియోజకవర్గంలో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కాసుల బాలరాజుకు పార్టీ నుంచి అంతపోటీ లేదు. వచ్చే ఎన్నికల్లో కాసుల బాలరాజుకే టికెట్ వస్తుందనే భావనతో ఆయన నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్తున్నారు.
కమలంలోనూ వేరు కుంపట్లు
జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే జనాధరణ పెంచుకుంటున్న బీజేపీకి ఇంటిపోరు తప్పడం లేదు. జిల్లాలో ప్రజాసంగ్రమ యాత్రతో పెరిగిన క్రేజీని కార్నర్ మీటింగ్‌లతో మరింత పెంచుకునే ప్రయత్నం జరుగుతోంది. కానీ సొంత పార్టీలోనే నేతల మధ్య వే రు కుంపట్లు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పరేషన్ చేస్తోంది. కామారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీనేత కాటిపల్లి వెంకటరమణరెడ్డి పార్టీ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి కూడా టికెట్ తనకే దక్కుతుందని పోటీలో తానే ఉంటానని నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నారు. అయితే ఇతనికి వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేతలు పని చేస్తున్నారు. వెంకటరమణరెడ్డికి ఈ వర్గం నేతలు సహకరించడం లేదనే చర్చ సాగుతోంది. మరో ఇద్దరు సీనియర్ నేతలు ఈ సారీ తమకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ ముగ్గురు సీనియర్ నేతలు రవీందర్‌రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, పైళ్ల క్రిష్ణారెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. వీరు ముగ్గురు సైతం ఎవరికి వారే కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి కొన్ని రోజులుగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వీరిలో ఎవరికి టికెట్ వస్తుందో చూడాలి. జుక్కల్ నియోజకవర్గంలో ఆ పార్టీ అధ్యక్షురాలు అరుణతారకు పెద్దగా అసమ్మతి లేదు. ఈ సారి ఆమెనే బరిలో ఉంటారనే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మల్యాద్రిరెడ్డి పోటీలో ఉండనున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన నియోజకవర్గం మొత్తం తిరుగుతూ పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు.