గర్భంలోనే చావుకేక
ABN , First Publish Date - 2023-08-11T00:06:33+05:30 IST
వైద్యో నారాయణ హరి అంటూ.. సమాజంలో వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ కొందరు మాత్రం ఆ వృత్తికే మచ్చ తెస్తూ చట్టాలను సైతం అతిక్రమిస్తు కాసుల కోసం ఎంతటిపనికైనా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సాధారణ ప్రసవాలు చేయకుండా మహిళల భవిష్యత్తు ఆరోగ్య సమస్యలు ఏమైతే మాకేంటి అనే ధోరణి ప్రదర్శిస్తూ అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తు డబ్బులు దండుకుంటున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రస్తుతం మరో దందాకు తెరలేపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- జిల్లాలో ఇష్టారాజ్యంగా లింగ నిర్ధారణ
- స్కానింగ్‌లో ఆడ, మగ బిడ్డ అని తేల్చి చెబుతున్న పలు ఆసుపత్రుల వైద్యులు
- ఆడ బిడ్డ అని తేలగానే ఆపరేషన్‌లు చేస్తున్నట్లు ఆరోపణలు
- లీగల్ రిజిస్ట్రేషన్ లేకున్నా కాసులకు కక్కుర్తిపడి ఆపరేషన్లు
- గతంలో లింగ నిర్ధారణ చేస్తున్న ఓ ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు
- కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉండి మళ్లీ యదావిధిగా కార్యక్రమాలు
- నిఘా పెడితే దందా బయటపడే అవకాశం
కామారెడ్డి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): వైద్యో నారాయణ హరి అంటూ.. సమాజంలో వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తారు. కానీ కొందరు మాత్రం ఆ వృత్తికే మచ్చ తెస్తూ చట్టాలను సైతం అతిక్రమిస్తు కాసుల కోసం ఎంతటిపనికైనా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సాధారణ ప్రసవాలు చేయకుండా మహిళల భవిష్యత్తు ఆరోగ్య సమస్యలు ఏమైతే మాకేంటి అనే ధోరణి ప్రదర్శిస్తూ అవసరం లేకున్నా శస్త్రచికిత్సలు చేస్తు డబ్బులు దండుకుంటున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రస్తుతం మరో దందాకు తెరలేపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు లింగ నిర్ధారణ చేయకూడదనే నిబంధనలను తుంగలో తొక్కుతున్న పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, సంతాన సాఫల్య కేంద్రాలు అధిక మొత్తంలో డబ్బులు ముట్టజెప్పితే పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అనే విషయాలను వివరిస్తున్నారు. దీంతో తమకు పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అనే విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు అబార్షన్‌ల వైపు మొగ్గు చూపుతుండడంతో భ్రుణ హత్యలకు పాల్పడుతూ గర్భంలోనే చావుకేకను పుట్టిస్తున్నారు. తమ దగ్గరకి వచ్చిన వారికి నయానో భయానో నచ్చ చెపాల్సింది పోయి తమకు కాసులు వస్తే చాలు అనే ఽధోరణిలో ఆలోచన చేస్తు అబార్షన్ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎందరికో పలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు గర్భ శోకాన్ని మిగులుస్తున్నారు. గతంలో ఓ ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకొని ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు. దీంతో లింగ నిర్ధారణ చేస్తున్నవారు కొద్ది రోజులు స్తబ్దంగా ఉండి మళ్లీ యదావిధిగా కార్యక్రమాలు చేపడుతున్నారని మరోమారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిఘా పెడితే ఆసుపత్రుల నిర్వాహకులు చేస్తున్న దందా గుట్టురట్టవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ, అబార్షన్లు
గర్భంలోని శిశువు, తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా వివిధ కారణాలతో ఆడపిల్ల అయితే చాలు జిల్లాలో కొందరు అబార్షన్లు చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలు తమకు ఇష్టంలేకపోయినా కుటుంబీకులు, బంధువుల ఒత్తిడితో అబార్షన్లు చేయించుకుని గర్భ శోకాన్ని అనుభవిస్తున్నారు. ఈ అబార్షన్ల తతంగంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులే కీలకంగా మారుతున్నాయి. ఆయా ఆసుపత్రులకు గర్భిణులను తీసుకువచ్చే విషయంలో వివిధ క్లినిక్‌లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే స్టాఫ్ నర్సులు, ఆయా ఆసుపత్రులకు కమీషన్ల కోసం రోగులను, గర్భిణులను పంపించే పలువురు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కీలకంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముందుగానే ఓ రేటు మాట్లాడుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు కేసులు పంపుతున్నారు. దీంతో నిబంధనలు పాటించకుండా అబార్షన్లు విచ్చలవిడిగా చేస్తూ ఆడపిల్లలను తల్లికడుపులోనే చంపేస్తున్నారు. పలు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, కొందరు మిడిమిడి జ్ఞానంతో వైద్యులుగా చెలామణి అవుతూ ఏకంగా రేడియాలజిస్ట్‌లు లేకుండానే స్కానింగ్‌లు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా కడుపులో ఉన్నది ఆడో, మగో చెబుతూ అబార్జన్లు చేయిస్తు తమ జేబులను నింపుకుంటున్నారే తప్ప ఓ పసిప్రాణాన్ని భూమిమీదకు రాకముందే చంపేస్తున్నామనే విషయాన్ని మాత్రం గమనించడం లేదు.
వాస్తవానికి అబార్షన్ ఏ పరిస్థితుల్లో చేయవచ్చంటే..
గర్భంలో శిశువు బుద్ధి మాంద్యం, తక్కువ బరువు, వివిధ రకాల రుగ్మతలతో ఉన్నప్పుడు, తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అబార్షన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సుశిక్షితులైన స్త్రీవైద్య నిపుణులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. అబార్షన్ చేయడానికి సదరు ఆసుపత్రికి మెడికల్ టర్మినేషన్ యాక్ట్ ప్రకారం లీగల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. గర్భందాల్చి 12 వారాలు అయిన తర్వాత ఒక గైనకాలజిస్టుతో పరీక్షలు చేయించుకుని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే సదరు వైద్యురాలి అనుమతితో అబార్షన్ చేయవచ్చు. గర్భందాల్చి 12 నుంచి 20 వారాలు అయినప్పుడు ఇద్దరు గైనకాలజిస్టుల అనుమతితో అబార్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో గైనిక్ వైద్యుడు లేడు. సరైన అనుమతులు లేకున్నా యథేచ్ఛగా లింగ నిర్ధారణ చేసి అబార్షన్‌లు చేస్తుండడం గమనార్హం. పైగా ఆసుపత్రి ఎదుట లింగ నిర్ధారణ నేరం అంటూ బోర్డు ఏర్పాటు చేసి లోపల మాత్రం లింగ నిర్ధారణ చేయడంపై హాస్యాస్పదంగా ఉందని పలువురు విమర్శలు వ్యక్తపరిచారు.
మళ్లీ దందా మొదలు పెట్టిన వైనం
ఎక్కడైనా అబార్షన్ జరగడం, లింగ నిర్ధారణ, తల్లి, బిడ్డలో ఎవరు చనిపోయినా ఆరోగ్య శాఖ అధికారులు అక్కడకి చేరుకుని సంబంధిత ఆసుపత్రిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలి. నిబంధనల ప్రకారం గర్భిణులకు ఏదైనా అనారోగ్య సమస్యలున్నప్పుడు ఆరోగ్యశాఖ అనుమతితో అబార్షన్ చేస్తారు. ఇటువంటి నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఆరోగ్యశాఖకు ఉంటుంది. ఆసుపత్రిని సీజ్ చేయడంతో పాటు సంబంధిత నిర్వాహకులకు జైలు శిక్షపడే అవకాశం ఉందని ఆరోగ్యశాఖలోని పలువురు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నట్లు ఒక వైపు ప్రజలు.. మరోవైపు పలు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు బహిరంగంగానే కోడై కూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ తరుణంలో గత రెండు సంవత్సరాల కింద రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి మరీ కామారెడ్డిలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్న ఓ ఆసుపత్రిని సీజ్ చేశారు. దీంతో లింగ నిర్ధారణ దందా చేసేవారు కొద్ది రోజులు స్తబ్దుగా ఉన్నా మళ్లీ మూడు పువ్వులు ఆరు కాయలుగా దందా సాగిస్తున్నారన్నారు. డబ్బులకు కక్కుర్తిపడి కడుపులోనే బిడ్డను తుంచేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సదరు ఆసుపత్రి నిర్వాహకులు ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా ఆసుపత్రి పరిసరాల్లో ఎవరు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.