శిథిలావస్థలో జిల్లా కేంద్ర ఆసుపత్రి

ABN , First Publish Date - 2023-07-20T23:52:56+05:30 IST

ఎన్నో సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన జిల్లా కేంద్ర ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుందని పలుచోట్ల చిన్నపాటి వర్షం పడితే చాలు నీటిధారలు ఏకధాటిగా వస్తుంటాయని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఇరుకుగా ఉందంటే ఇందులోనే అనేక విభాగాలు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెలలో పూర్తిస్థాయిలో డీఎంఏ పరిధిలోకి వెళ్లనుండడంతో పై అంతస్తులో మరిన్ని బెడ్లను ఏర్పాటు చేసేందుకు మరికొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు.

శిథిలావస్థలో జిల్లా కేంద్ర ఆసుపత్రి
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కూలిన సీలింగ్‌ పీఓపీ

- ముసురుతో అనేక చోట్ల ఊరుతున్న నీటి ధారలు

- చిన్న పిల్లల వార్డులో బుధవారం అర్ధరాత్రి కూలిన సీలింగ్‌ పీఓపీ

- ఆ విభాగం వినియోగించకపోవడంతో తప్పిన ప్రమాదం

- అదేవార్డులో పక్కనే చికిత్స పొందుతున్న బాలింతలు

- ఎక్కడ కూలుతుందోనని బాలింతలను తరలించిన సిబ్బంది

- మెడికల్‌ కళాశాలకు అనుబంధ ఆసుపత్రి

- మరమ్మతులు చేయకముందే పై అంతస్తులో మరిన్ని బెడ్లకై రేకుల షెడ్లు

- రేకుల షెడ్ల నిర్మాణంలో సైతం నాణ్యత లోపం.. బలమైన గాలులు వస్తే కూలే అవకాశం

- శిథిలావస్థలో జిల్లాలోని పలు ఆసుపత్రుల భవనాలు

కామారెడ్డి టౌన్‌, జూలై 20: ఎన్నో సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన జిల్లా కేంద్ర ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుందని పలుచోట్ల చిన్నపాటి వర్షం పడితే చాలు నీటిధారలు ఏకధాటిగా వస్తుంటాయని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ఇరుకుగా ఉందంటే ఇందులోనే అనేక విభాగాలు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెలలో పూర్తిస్థాయిలో డీఎంఏ పరిధిలోకి వెళ్లనుండడంతో పై అంతస్తులో మరిన్ని బెడ్లను ఏర్పాటు చేసేందుకు మరికొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలోనే ఉన్న చాలా చోట్ల శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడుతూ వచ్చాయని వాటిని కనిపించనివ్వకుండా పీఓపీ లాంటి వాటితో కప్పి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారని పలువురు రోగుల బంధువులు పేర్కొంటున్నారు. ఈ దశలో బుధవారం అర్ధరాత్రి ముసురుతో సీలింగ్‌ పీఓపీ కూలడంతో మరోమారు భవన పరిస్థితిపై తీవ్ర చర్చనెలకొంటుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, రోగులు చికిత్స పొందుతుంటారని ఏ సమయంలోనైనా ఇలాంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలకు ముప్పు ఏర్పడితే ఎలాగనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అర్ధరాత్రి కూలిన సీలింగ్‌ పీఓపీ

గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు ఏర్పడుతుండడంతో జిల్లా కేంద్రంగా ఏర్పాటు అయిన తర్వాత 30 పడకల గదిని ఏర్పాటు చేశారు. ఇందులో ఓ వైపు ప్రసవం చెందిన బాలింతలకు చికిత్స అందించడంతో పాటు, మరోవైపు చిన్నపిల్లలకు చికిత్సలు అందించేందుకు విభాగం ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో పీఐసీయూ విభాగం ఏర్పాటు చేయడంతో ఆ విభాగాన్ని ఖాళీగానే ఉంచారు. గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా సీలింగ్‌ పీఓపీ ఊడిపోయి కింద పడిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ముసురుతో మరికొన్నిచోట్ల కూలుతుందేమోనని సిబ్బంది ఆసుపత్రి పై అధికారులకు తెలియజేయడంతో బాలింతలను ఆ విభాగం నుంచి తరలించాలని సూచించడంతో ఆసుపత్రిలోని ఆయా విభాగాలకు బాలింతలను తరలించారు.

నూతన భవనం నిర్మాణంపై అనుమానాలు

ఆసుపత్రిలోని పై అంతస్తులోనూ భవన నిర్మాణం చేపట్టడం దానిని సైతం రేకులతోనే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పీఓపీ కూలిన విభాగం సైతం రేకులతో నిర్మించి పీఓపీ వేశారని ఆ నిర్మాణాలు సైతం రేకులతో వేస్తున్నందున ముందుముందు ఇదే తరహాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతకొద్ది రోజుల కిందట సైతం ఈ ప్రాంతంలో నిర్మాణం చేపట్టే సమయంలో గోడ కూలిందని పనుల్లో నాణ్యత అంతంత మాత్రంగానే ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రేకులషెడ్డు గట్టి గాలులు వీస్తే కూలే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రజలకు సేవలు అందించడానికి నిర్మాణాలు చేపడుతున్నా నాణ్యతతో చేపట్టడంతో పాటు ముందుముందు ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇరుకుగా మారిన ఆసుపత్రిలోని మరిన్ని విభాగాలు

జిల్లా కేంద్ర ఆసుపత్రిగా మారిన తర్వాత అనేక విభాగాలు ఏర్పాటు చేయడంతో ఆసుపత్రి నిత్యం కిక్కిరిసిపోతోంది. ప్రస్తుతం మెడికల్‌ కళాశాల అనుబంధ ఆసుపత్రిగా మారింది. ఈ ఆసుపత్రిలోనే మరిన్ని బెడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరిన్ని పరికరాలు తీసుకువస్తున్నారు. ప్రజలకు సేవలు అందించే ఆలోచన బాగానే ఉన్నా శిథిల దశకు చేరిన ఆసుపత్రుల్లోనే మరిన్ని విభాగాలు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు, రోగుల బంధువులు పెదవి విరుస్తున్నారు. భవనం నిర్మించి ఏళ్లు గడుస్తుండగా ఈ నిర్మాణాలను మరోచోట ఏర్పాటు చేసుంటే బాగుండేదని వాదనలు వినిపిస్తున్నారు. ఆసుపత్రిలోని ఈఓపీ విభాగం నుంచి ఆసుపత్రిలోనికి వచ్చేచోట నిత్యం నీరుకారుతుందని, పై అంతస్తుల్లోంచి నీరు ఏకధాటిగా వస్తుండడంతో స్కానింగ్‌ సెంటర్‌ నుంచి అడ్మినిస్ట్రేషన్‌ విభాగం వైపు వెళ్లేదారిలో, ఐసీయూకు వెళ్లేదారిలో నీటిధారాలు పడుతునే ఉన్నాయని వాటితో పాటు మరికొన్నిచోట్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష నాయకులు పేర్కొంటున్నారు. గతంలో ఇదే ఆసుపత్రిలో ఎలుకలు సంచరించడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మేర దృష్టిసారిస్తుందో అర్థం చేసుకోవచ్చని విమర్శలు గుప్పిస్తున్నారు.

జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి

జిల్లాలోని పలు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గాంధారి మండలంలోని సీహెచ్‌సీ ఆసుపత్రి సైతం శిథిలావస్థకు చేరుకుంది. భవనంపై కప్పు నుంచి నీటిధారాలు, ఉరుస్తుండడంతో నీటిని బకెట్లలో పట్టి బయట పారబోస్తున్నారు. మరికొన్నిచోట్ల పెచ్చులు ఊడిపోవడంతో ఎక్కడ మీద పడుతుందోనని రోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పిట్లం ఆసుపత్రి సైతం శిథిలావస్థకు చేరుకుంది. ఆసుపత్రి పైకప్పు నుంచి పెచ్చులు ఊడి కింద పడిపోతున్నాయి. ఆ ఆసుపత్రిలోనే రోగులకు చికిత్సలు అందిస్తుండడంతో రోగులు ఎక్కడ పెచ్చులు ఊడి పడతాయోనని భయం భయంగా చికిత్స పొందేందుకు వస్తున్నారు. వీటితో పాటు పలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు సైతం ఉరుస్తుండడంతో పాటు పెచ్చులు ఊడిపోతున్నాయని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా ఆసుపత్రులను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-07-20T23:52:56+05:30 IST