ముందస్తుగా బీజేపీ నేతల అరెస్టు
ABN , First Publish Date - 2023-09-01T00:10:29+05:30 IST
చలో గజ్వేల్‌కు పిలుపునిచ్చిన బీజేపీ నేతలను కామారెడ్డి పోలీసులు గురువారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటరమణారెడ్డితో పాటు మరో నలుగురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని బాన్సువాడ డివిజన్ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. దీంతో కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
- వెంకటరమణరెడ్డిని అదుపులోకి తీసుకుని బాన్సువాడ డివిజన్ పరిధికి తరలించిన పోలీసులు
- గజ్వేల్‌లో అరాచకాలు చేశారు కాబట్టే అరెస్టులు
- బీజేపీ నేత వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి)/కామారెడ్డి టౌన్: చలో గజ్వేల్‌కు పిలుపునిచ్చిన బీజేపీ నేతలను కామారెడ్డి పోలీసులు గురువారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటరమణారెడ్డితో పాటు మరో నలుగురు ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని బాన్సువాడ డివిజన్ పోలీసుస్టేషన్‌లకు తరలించారు. దీంతో కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో బీజేపీ గత పక్షం రోజులుగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌పై ఉద్యమాన్ని ఉధృతం చేసింది. 9 ఏళ్లుగా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ చేయని అభివృద్ధి కామారెడ్డికి వచ్చి ఏం చేస్తారంటూ బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటరమణారెడ్డి చలో గజ్వేల్‌కు పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో కేసీఆర్ చేసిన అరాచకాలపై కామారెడ్డి ప్రజలకు వివరించేందుకు శుక్రవారం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. సుమారు 100 వాహనాలు కామారెడ్డి ప్రజలను, బీజేపీ శ్రేణులను గజ్వేల్‌కు తీసుకెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ పిలుపు మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా కామారెడ్డిలోని బీజేపీ ముఖ్యనేత వెంకటరమణారెడ్డితో పాటు మరో నలుగురు నేతలను అరెస్టు చేసి బాన్సువాడ సబ్ డివిజన్‌కు తరలించారు. దీంతో పాటు బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడమే కాకుండా పలువురిని గృహ నిర్బంధం చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ఆయన అనుచరులు అరాచకాలు చేశారు కాబట్టే బీజేపీ నేతలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. గజ్వేల్‌లోని మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌తో తన ఫాంహౌస్ పంట పొలాలకు సాగునీరు అందించేందుకు 15 గ్రామాల ప్రజలను నిరాశ్రయులను చేసి అనాథలుగా చేశారని ఆరోపించారు. తనను కేసీఆర్ పోలీసుల చేత నిర్బంధించినప్పటికీ నేడు కాకపోతే మరో రోజైన కామారెడ్డి ప్రజలను గజ్వేల్‌కు తీసుకెళ్లి చూపిస్తానన్నారు. నన్ను ఆపినప్పటికీ శుక్రవారం బీజేపీ శ్రేణులు, కామారెడ్డి ప్రజలు స్వచ్ఛంధంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారని వెంకటరమణరెడ్డి అన్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ చేసినట్లు అరాచకాలు కామారెడ్డిలో సాగనివ్వమని ఆయన హెచ్చరించారు.