ఓటరు జాబితాకు కసరత్తు
ABN , First Publish Date - 2023-07-20T00:12:46+05:30 IST
జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు లేని ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధమయ్యేలా అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది.
- జిల్లాలో ఓటరు సవరణ ప్రక్రియ షురూ
- ఆగస్టు 26, 27, సెప్టెంబరు 3న ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు
- అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండేవారికి చాన్స్
- అక్టోబర్ 4న తుది జాబితా వెల్లడి
- ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో డబుల్ ఓట్లకు చెక్
- ప్రస్తుతం నాలుగు నియోజకవర్గాల్లో 8 లక్షలకు పైగా ఓట్లు
కామారెడ్డి, జూలై 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలల్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తప్పుడు లేని ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధమయ్యేలా అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే ఈసీఐఎల్, ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరును పరిశీలించారు. మరోవైపు అక్టోబరు 4 న తుది ఓటరు జాబితా విడుదల కోసం ఓటరు సవరణ జాబితా కసరత్తు మొదలుపెట్టారు.
జిల్లాలో 8,07,187 మంది ఓటర్లు
కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ప్రస్తుత ఏడాది రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించిన జాబితా ప్రకారం మొత్తం 8,07,187 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,91,299 మంది పురుషుల ఓట్లు, 4,15,839 మహిళల ఓట్లు, 49 థర్డ్ జండర్ ఓట్లు ఉన్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,27,867 ఉండగా ఇందులో 1,10,056 పురుషుల ఓట్లు, 1,17,783 మహిళల ఓట్లు, 28 ఽథర్డ్ జండర్ ఓట్లు ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తం 2,07,675 ఓట్లు ఉండగా ఇందులో 1,00,069 పురుషుల ఓట్లు, 1,07,603 మహిళల ఓట్లు, 3 థర్డ్ జండర్ ఓట్లు, జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం 1,89,157 ఓట్లు ఉండగా ఇందులో 97,630 మంది పురుషులవి, 95,512 మంది మహిళలవి, 11 థర్డ్ జండర్‌వి ఉన్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో 1,82,492 కోట్లు ఉండగా ఇందులో 87,544 మంది పురుషులు, 94941 మహిళల, 7 థర్డ్ జండర్ ఓట్లు ఉన్నాయి. ఈ నెల 24 వరకు పోలింగ్ కేంద్రాలను గుర్తించనున్నారు. వాటిలో సౌకర్యాలను పరిశీలిస్తారు. ఒక పోలింగ్ కేంద్రంలో సుమారు 1500 మంది ఓటర్లు ఉండే విధంగా చూస్తారు. అవసరమనుకుంటే కొత్త వాటిని ప్రతిపాదించనున్నారు. పాత కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకుంటే వాటికి సమీపంలోనే కొత్తవి గుర్తించాల్సి ఉంటుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం ఫొటో తీసి ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది.
డబుల్ ఓట్లకు చెక్
కేంద్ర ఎన్నికల సంఘం కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా డబుల్ ఓట్లకు చెక్ పెట్టింది. రాష్ట్రంలో కేవలం ఒక ప్రాంతంలో మాత్రం ఓటు హక్కు ఉండే విధంగా ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తిస్తున్నారు. పూర్తిస్థాయిలో శాసనసభ ఎన్నికల వరకు తప్పొప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేయనున్నారు. మరోవైపు ఓటరు జాబితాకు ఆధార్ అనుసంధానం చేశారు. జిల్లాలో 90 శాతం వరకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు స్పష్టంగా ఉండే ఫొటోలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచే అవకాశాలు ఉన్నాయి. ఓటరుల సౌలభ్యం కోసం పోలింగ్ శాతం పెరుగుదల కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు తదితర కారణాలతో పోలింగ్ కేంద్రాల పెంపుపై దృష్టి సారించారు. మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల తనిఖీకి సంబంధించి మొదటి లెవల్ పూర్తి చేశారు. అవసరమైన భద్రత చర్యలు చేపట్టారు.
ఓటరు నమోదుకు మరో అవకాశం
యువతి, యువకులు కొత్తగా ఓటరు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పించింది. ఓటరు జాబితా రెండో సవరణలో భాగంగా అక్టోబరు 1, 2023 వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కామారెడ్డిలో జిల్లా యంత్రాంగం ఓటరు నమోదు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఓటరు నమోదుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇతర అధికారులు సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు కోసం ప్రత్యేకించి ఆగస్టు 26, 27, సెప్టెంబరు 3న మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలతో పాటు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఓటరు నమోదు అభ్యంతరాల స్వీకరణ కోసం బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. ఓటరు జాబితాలో సవరణలు పూర్తిచేసి అక్టోబరు 4న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.
బదిలీలకు చర్యలు
కామారెడ్డి జిల్లాలో దీర్ఘకాలికంగా పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయడానికి ఇప్పటికే వివరాలు సేకరించారు. రెవెన్యూ, పోలీసు, ఎన్నికలకు సంబంధం ఉన్న శాఖల్లోని అధికారుల్లో మూడేళ్లుగా పని చేస్తున్న వారిని బదిలీ చేస్తున్నారు. దీంతో పాటు సొంత జిల్లాలో పని చేస్తున్న తహసీల్దార్లు, ఎస్‌ఐలను పని చేస్తున్న కాలంతో సంబంధం లేకుండానే బదిలీలు చేపడుతున్నారు. బదిలీలు తప్పనిసరిగా ఉన్న ఉద్యోగులు పైరవీలు సైతం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, అధికార పార్టీ పెద్దలు తమకు అనుకూలంగా ఉండే అధికారులను బదిలీపై రప్పించుకునే విధంగా చూస్తున్నారు. జిల్లాలో ఐదేళ్లుగా పని చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటికే పోలీసుశాఖలోని పలువురు ఎస్‌ఐలను ఇతర జిల్లాకు బదిలీ చేశారు. అదేవిధంగా అదనపు కలెక్టర్, డీఎస్పీలు, ఆర్డీవోలు, తహసీల్దార్లను సైతం బదిలీ చేశారు.