జ్వరం భయం
ABN , First Publish Date - 2023-07-13T23:28:50+05:30 IST
వైరల్ జ్వరాలతో రోజురోజుకూ జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం వల్లనో లేదా క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్లనో దోమలు పెరిగిపోయి మలేరియా, డెంగ్యు వంటి జ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
- జిల్లాలో జ్వరాలతో జనం విలవిల
- భయపెడుతున్న డెంగ్యు, మలేరియా
- రోజురోజుకూ పెరుగుతున్న దోమకాటు బాధితులు
- ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న జనం
- జిల్లాలో వ్యాధి నిర్ధారణకు పరికరాలు కరువు
కామారెడ్డి, జూలై 13(ఆంధ్రజ్యోతి):
వైరల్ జ్వరాలతో రోజురోజుకూ జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం వల్లనో లేదా క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్లనో దోమలు పెరిగిపోయి మలేరియా, డెంగ్యు వంటి జ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాలు పడుతున్నాయన్న సంబరం కంటే జ్వరాలు సోకుతున్నాయనే ఆందోళనే ఎక్కువగా కనబడుతోంది. ప్రస్తుతం పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రంగానే పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో దోమలు, ఈగల సంతతి పెరిగిపోయి వ్యాధులు మొదలవుతున్నాయి. ఈ వ్యాధుల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద జనం క్యూకడుతున్నారు. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో నీటి నిల్వలు, దోమల ఆవాస కేంద్రాలు లేకుండా చేసిన పలు ప్రైవేట్ ఆసుపత్రులలో మలేరియా, డెంగ్యూ భారిన పడి చికిత్స పొందుతున్నారని సమాచారం. సీజనల్ వ్యాధుల పుణ్యమా అని ప్రజల అమాయకత్వాన్ని అసరాగా చేసుకొని ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయి.
జిల్లాలో విజృంభిస్తున్న దోమకాటు వ్యాధులు
ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాల్లో పేరుకపోయిన చెత్తను, పిచ్చి మొక్కలు, నీటి నిల్వలపై దృష్టి సారించకపోవడంతో జిల్లాలో దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. వర్షాలకు పలు చోట్ల రహదారులు కోతకు గురై గుంతలు ఏర్పడి నీరు నిలవడంతో దోమలు వృద్ధి చెంది పగలు రాత్రి అనే తేడా లేకుండా కుడుతు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 5లోపే డెంగ్యు కేసులు నమోదు అయ్యాయి. కానీ అనధికారికంగా ఈ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ జ్వరాలన్నింటిలోనూ ఎక్కువగా మలేరియా, డెంగ్యు వ్యాధుల వల్ల భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ చిన్న జ్వరం వచ్చిన డెంగ్యు కేసులే అనుకుంటున్న జనం అప్పుచేసి మరి చికిత్సను పొందుతున్నారు. డెంగ్యు భయం జనంలో ఉండడంతో ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ప్లేట్‌లెట్స్ తగ్గాయంటూ ప్రజల నుంచి డబ్బులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏలిసా పరీక్ష ద్వారా డెంగ్యు నిర్ధారణ పరికరాలను ఏర్పాటు చేయడంలో, ప్రైవేట్ దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.
ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమెప్పుడంటే..
సాధారణంగా డెంగ్యు జ్వరం వచ్చిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోతుంది. కేవలం 20 శాతం మందిలో మాత్రమే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాల్సి వస్తోంది. ఆస్పత్రిలో చేరిన వారిలో 50 శాతం వరకు డెంగ్యు లక్షణాల ఆధారంగా చికిత్స అందించడం జరుగుతుంది. అవి ఫ్లూయిడ్స్ వంటి వాటితోనే నయమవుతోంది. ఇక మిగిలిన 30 శాతం మాత్రం శరీరంపై మచ్చలాంటి లక్షణాలు, మరో 20 శాతం శరీరం నుంచి అంతర్గతంగా రక్తస్రావం జరుగుతోంది. ఇలా రక్తస్రావం అవుతున్న జ్వర పీడితులకు మాత్రమే ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి వస్తోంది. జ్వరం వచ్చి తగ్గిపోయాక నాలుగు రోజుల తర్వాత రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ప్లేట్‌లెట్స్ సంఖ్య లక్షల్లో ఉన్నది కాస్తా తర్వాత రోజుకు 30 వేలకు పడిపోవచ్చు. ఇలాంటి అనూహ్యమైన పరిస్థితుల్లో తప్ప మామూలుగా అయితే 10వేలకు పడిపోయిన తిరిగి ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. అంతకంటే తక్కువగా తగ్గితేనే అవసరమవుతాయని నిపుణులైన వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్లేట్‌లెట్స్ తగ్గడం అనేది చిన్నచిన్న వైరల్ ఫీవర్‌కు సైతం తగ్గుతాయని అంటున్నారు.
జిల్లాలో డెంగ్యు వ్యాధి నిర్ధారణకు పరికరాలు కరువు
అసలు సాధారణ జ్వరాలు, వైరల్ ఫీవర్‌లు ఏవో డెంగ్యు వ్యాధి ఏదో నిర్ధారించే పరికరాలు జిల్లాలో కరువయ్యాయి. హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డెంగ్యు వ్యాధి లక్షణాలు, డెంగ్యును ఏ రకంగా నిర్ధారణ చేస్తారనేది వివరించడంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విఫలమవుతుండడంతో ప్రజలు చిన్న పాటి జ్వరానికి సైతం డెంగ్యుగా భావించి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ భయాన్ని అందిపుచ్చుకొని ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న మాయకు అప్పులు చేసి చికిత్సలు చేయించుకుంటున్నారు. జ్వరం రాగానే డాక్టర్ల దగ్గరకు పరుగెడుతున్న జనానికి వివిధ పరీక్షలు చేయిస్తున్న డాక్టర్లు ప్లేట్‌లెట్స్ తగ్గాయని చెప్పి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్సలు అందిస్తూ వేలకు వేలు డబ్బులు ఖర్చులు చేయిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఇప్పటి వరకూ డెంగ్యు నిర్ధారణకు సంబంధించిన పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
డెంగ్యు నిర్ధారణ పరికరాలు ఏర్పాటు చేయాలి
- భాగ్య, దేవునిపల్లి
జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిందని డెంగ్యుగా అనుమానం ఉందంటూ పేర్కొని చికిత్సను అందిస్తున్నారు. చికిత్స అనంతరం వేలలోనే డబ్బులు తీసుకుంటుండడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యు నిర్ధారణ పరికరాలను ఏర్పాటు చేస్తే ఆర్థిక భారం తప్పనుంది.
దోమల బెడద ఎక్కువైంది
- నర్సింలు, ఇస్రోజివాడి
ప్రస్తుతం వానలు పడడంతో ఎక్కడికక్కడ నీటి నిల్వలు ఉంటున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పారిశుధ్య పనులు ఉన్న ఒకరిద్దరు రెగ్యులర్ సిబ్బందితోనే క్లీన్ చేయిస్తుండడంతో దోమలు, ఈగల బెడద ఎక్కువవుతుంది. అధికారులు నీటి నిల్వలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి.