గృహలక్ష్మి యోగం ఎందరికో?
ABN , First Publish Date - 2023-08-16T23:48:47+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి జిల్లాలో భారీగానే దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డిలోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. కానీ నియోజకవర్గానికి ఇచ్చేది మూడు వేల ఇళ్లు మాత్రమే ఈ లెక్కన జిల్లాలో 10వేల 500ల మందికి గృహయోగం కలుగనుంది.
- గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల వెల్లువ
- జిల్లా వ్యాప్తంగా 20,481 దరఖాస్తులు
- అత్యధికంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 9,946
- ఒక్కో నియోజకవర్గానికి 3వేల ఇళ్లు
- జిల్లాలో 10,500 మందికి గృహ యోగం
- ఇప్పటికే ముగిసిన దరఖాస్తుల గడువు
- ఈనెల 20 నుంచి పరిశీలన
కామారెడ్డి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి జిల్లాలో భారీగానే దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డిలోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. కానీ నియోజకవర్గానికి ఇచ్చేది మూడు వేల ఇళ్లు మాత్రమే ఈ లెక్కన జిల్లాలో 10వేల 500ల మందికి గృహయోగం కలుగనుంది. మిగిలిన వారికి సొంతింటి యోగం లేనట్టే. రానున్న రోజుల్లో విడతల వారీగా ఇవ్వనున్నట్లు ప్రజాప్రతినిధులు చెబుతున్నా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అదేవిధంగా గృహలక్ష్మి దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఇటీవల ప్రకటించినా అధికారులు మాత్రం ఈ నెల 10వ తేదీకి మాత్రమే దరఖాస్తుల గడువును ముగించారు. నిర్ణీత గడువు వరకు జిల్లా వ్యాప్తంగా 20,481 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిందని వాటి పరిశీలన చేపట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గడువు పొడగింపుపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ
గృహలక్ష్మి పథకం దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం చేపడుతామని ఓ వైపు ప్రజాప్రతినిధులు చెబుతున్నా అధికారికంగా మాత్రం ఉత్తర్వులు వెలువడలేదు. గృహలక్ష్మి దరఖాస్తులకు ప్రభుత్వం మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. ఈనెల 7వ తేదీన దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించగా మరుసటి రోజు 8 నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 10 వరకు గృహలక్ష్మి పథకంపై మండలాలు, మున్సిపాలిటీల వారీగా దరఖాస్తులు స్వీకరించారు. గ్రామాల్లో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ పరిధిలో మున్సిపాలిటీల్లో దరఖాస్తులను సమర్పించారు. మూడు రోజులే గడువు ఉండడంతో చివరి రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరి దరఖాస్తులను సమర్పించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల వ్యవధిలో 20వేల 481 దరఖాస్తులు వచ్చాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 9,946 దరఖాస్తులు రాగా కామారెడ్డి నియోజకవర్గంలో 8,108, జుక్కల్ నియోజకవర్గంలో 2,100, బాన్సువాడ నియోజకవర్గంలో 326 దరఖాస్తులు వచ్చాయి.
ఈనెల 20 నుంచి పరిశీలన
గృహలక్ష్మికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసినందున పరిశీలన చేపట్టనున్నారు. ఈనెల 20 నుంచి దరఖాస్తులను పరిశీలించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం అమలుకు కలెక్టర్, కమిషనర్‌లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఈ ఇద్దరి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు దరఖాస్తుల వడపోతను చేపడుతాయి. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులకు సొంత స్థలం ఉన్నది లేనిది అది మహిళ పేరు మీద ఉన్నారా లేదా నిర్ధారిస్తారు. దరఖాస్తుదారులకు ఆర్‌సీసీ భవనం ఉందా లేదా అనేది విచారణ చేపట్టనున్నారు. దరఖాస్తుదారుల్లో స్థలం ఉండి నిల్వ నీడ లేనివారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చివరకు జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదంతో ఎంపికైన లబ్ధిదారుల సహాయం ఈనెల చివరిలో పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. మొదటి విడతగా రూ.1లక్ష ఆర్థిక సహాయం అందజేయడం ప్రారంభిస్తారు. మిగతా 2 లక్షలను లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే క్రమంలో దశలవారీగా విడుదల చేయనున్నారు. అయితే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించడం అధికారులకు తలకు మించిన భారం అయ్యేట్లు ఉంది. అన్ని దరఖాస్తుల నుంచి లబ్ధిదారులను ఎలా గుర్తించాలో తెలియని పరిస్థితి నెలకొంటుందని అధికార బృందాలు చెబుతున్నాయి. అనేక మంది తమకు ఇంటి స్థలం ఉంది కదా అని దరఖాస్తులు చేసుకున్నా పరిశీలనలో చాలా వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నాయంటూ అధికారులు చెబుతున్నారు.
ఇందిరమ్మ పథకం లాగే
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తరహాలోనే ఈ గృహకల్ప రూపకల్పన ఉంది. ఆ ప్రభుత్వంలో లబ్ధిదారులకు రూ.40 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఈ పథకం కింద ఆ మొత్తాన్ని రూ.3లక్షలకు పెంచారు. ఇందిరమ్మ పథకం కింద కూడా మూడు విడతలుగా సహాయం అందించారు. గృహలక్ష్మి పథకంలోనూ అదేవిధంగా అనుసరిస్తున్నారు. ఈ పథకం కింద దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని మంత్రులు చెబుతున్నా తిరిగి దరఖాస్తులను ఎవరు తీసుకునేది మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
ఇవీ మార్గదర్శకాలు
గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేయడంతో పాటు పలు నిబంధనలను రూపొందించింది. గృహలక్ష్మి పథకం కింద 100 శాతం రాయితీతో ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సహాయం అందజేయనుంది. నియోజకవర్గానికి 3వేల మంది చొప్పున సాయం అందిస్తారు. మహిళ పేరు మీదే ఆర్థిక సహాయం అందిస్తారు. లబ్ధిదారైన మహిళ పేరిట బ్యాంక్ ఖాతా తెరవాలి. ఇందులో జన్‌ధన్ ఖాతాను వినియోగించుకోవద్దు. ఇంటి బేస్మిట్ లెవల్, రూప్‌లేవల్, ప్లాట్ ఇలా మూడు దశల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఇప్పటికే ఆర్‌సీసీ ఉన్నవారు జీవో 59 కింద లబ్ధిపొందినవారు ఈ పథకానికి అనర్హులు. ఈ పథకం కింద ఎస్‌సీలకు 20 శాతం, ఎస్‌టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50శాతం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. దివ్యాంగులకు 5శాతం ప్రత్యేక రిజర్వేషన్‌లు ప్రకటించారు.