వడగండ్ల బీభత్సం

ABN , First Publish Date - 2023-04-26T00:26:06+05:30 IST

జిల్లాలో అకాల, వడగండ్ల వర్షాలు, ఈదురుగాలులు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు అన్నదాతల్లో, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

వడగండ్ల బీభత్సం
లింగంపేటలో తడిసిన ధాన్యం

- అన్నదాతలను ఆగం చేస్తున్న అకాల, వడగండ్ల వర్షాలు

- జిల్లాలో అకాల, వడగండ్ల వర్షానికి తడిసిన ధాన్యం

- దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, లింగంపేటలో ఈదురు గాలులకు నేలవాలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

- కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్‌, రాజంపేట మండలాల్లో జోరుగా వడగండ్ల వాన

- కొనుగోలు కేంద్రాల్లో 7 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం వర్షం పాలు

- మరికొన్నిచోట్ల వర్షం తాకిడికి కొట్టుకుపోయిన ధాన్యం

- తడిసిన ధాన్యాన్ని ఎవరుకొంటారని రైతుల ఆవేదన

ఎల్లారెడ్డిలో 14 మేకల మృతి, 10 మేకల గల్లంతు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25: జిల్లాలో అకాల, వడగండ్ల వర్షాలు, ఈదురుగాలులు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు అన్నదాతల్లో, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అకాల, వడగండ్ల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట సరిగా చేతికివచ్చిన సమయంలో ధాన్యం నీటిపాలు కావడంతో రైతుల్లో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. ఈదురుగాలులకు అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతన్నలు నష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. సరిగా పంటలు కోతకు రావడం, ధాన్యం చేతికి అందడంతో కొనుగోలు కేంద్రాలకు తరలించగా ఆ ధాన్యాన్ని వర్షం ముంచేత్తుతోంది. అకాల, వడగండ్ల వర్షాల కారణంగా మార్కెట్‌ యార్డుల్లోని, కొనుగోలు కేంద్రాల్లోని రైతన్నల ధాన్యం రాశులు నీటి పాలవుతుండడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

వరద తాకిడికి కొట్టుకుపోయిన ధాన్యం

కామారెడ్ది, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం వేల క్వింటాళ్లలో తడిసిముద్దయ్యింది. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైతులు ఆర బోశారు. అకాల వర్షాలు కురువడంతో వరద నీటికి మునిగిపోవడమే కాకుండా కొట్టుకుపోయింది. బాన్సువాడ, లింగంపేట, సదాశివనగర్‌, ఎల్లారెడ్డి మండలాల్లో అకాల వర్షాలకు మార్కెట్‌ యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షంపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కామారెడ్డి, రాజంపేట, బిచ్కుంద, నిజాంసాగర్‌, ఎల్లారెడ్డిల్లో పెద్ద ఎత్తున వడగండ్ల వర్షం పడింది. మరోవైపు బాన్సువాడ, ఎల్లారెడ్డిలో ఈదురుగాలులు నానా బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు బాన్సువాడలోని ప్రధాన రహదారిపై, ఎల్లారెడ్డిలోని వెలుట్ల, వెల్లుట్లపేటలో భారీ వృక్షాలు కూలిపోయి రహదారులకు అడ్డంగా పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. ఇలా అకాల వర్షాలు, ఈదురు గాలులు రైతన్నలకు తీవ్ర నష్టాన్నే తెచ్చిపెట్టాయి.

7 వేల క్వింటాళక్లు పైగా తడిసిన ధాన్యం

జిల్లాలో గత 10 రోజులుగా ప్రభుత్వం తరపున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 120 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలకు రైతులు పెద్దఎత్తున ధాన్యాన్ని తరలిస్తున్నారు. మంగళవారం కురిసిన అకాల, వడగండ్ల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం భారీగా తడిసిపోయింది. కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట, లింగంపేట, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి రైతుల ధాన్యం తడిసిముద్దయింది. ఎల్లారెడ్డి, దోమకొండ, రాజంపేటలో పెద్ద ఎత్తున వడగండ్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సాయంత్రం భారీగా కురువడంతో ఆయా ప్రాంతాల్లో ధాన్యం ఆరబెట్టిన రైతులు ఇబ్బందులకు గురయ్యారు. కేంద్రాల్లో కుప్పలు, కుప్పలుగా ధాన్యం రాశులను రైతులుపోసి ఆర బెట్టారు. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి ఈ ధాన్యం తడవడమే కాకుండా కుప్పల మధ్య వర్షపునీరు నిలిచిపోయింది. దీంతో ధాన్యం కుప్పలను ఎత్తి వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అకాల వర్షానికి సుమారు 7వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం తడిసినట్లు అధికారులు చెబుతున్నారు.

ధాన్యం ఆర బెట్టేందుకు రైతుల తిప్పలు

గత నెల రోజుల నుంచి జిల్లాలో యాసంగి పంటకు సంబంధించి కోతలు ప్రారంభమయ్యాయి. వరితో పాటు మొక్కజొన్న, జొన్న, శనగ తదితర పంటలను నూర్పిడి చేసి మార్కెట్‌కు రైతులు తరలిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో చేతికి వచ్చిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. గత 10 రోజులుగా కొనుగోలు కేంద్రాలకు భారీగా వరి ధాన్యంను రైతులు తరలిస్తున్నారు. తేమశాతం లేకుండా రైతులు కేంద్రాల్లో, పొలాల్లో, ప్రధాన రహదారులపైన కుప్పలుగా పోసి ఆర బెడుతున్నారు. ఇంతలోనే అకాల వర్షాలు కురుస్తుండడంతో ఆ పంట కాస్తా తడిసిముద్దవుతోంది. పదేపదే ధాన్యాన్ని ఆర బెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు.

అకాల వర్షాలతో కుదేలవుతున్న అన్నదాతలు

జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు. సరిగా పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని సుమారు 20వేల క్వింటాళ్ల వరకు 3 రోజుల్లో ధాన్యం తడిసిపోగా వందల ఎకరాల్లో వరి పంట, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. సరిగా చేతికివచ్చే సమయంలోనే అకాల వర్షాలు రైతుల పంటలను దెబ్బతిస్తుండడంతో మార్కెట్‌లో ఆ పంట ఉత్పత్తులను వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. కొనుగోలు చేసిన తక్కువ ధరకే తీసుకుంటుడడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లారెడ్డిలో 14 మేకల మృతి

ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామానికి చెందిన ఒట్లెం రాజయ్యకు చెందిన 14 మేకలు వడగండ్ల వర్షానికి మృతి చెందగా మరో 10 మేకలు వరద ఉధృతికి గల్లంతయ్యాయి. మంగళవారం ఉదయం రాజయ్య మేకలను పట్టణ శివారులో గల అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కురిసిన వడగండ్ల వర్షానికి 14 మేకలు మృతి చెందాయి. మరో 10 మేకలు నల్లపోచమ్మ ప్రాంతంలో గల ఒర్రెలో వరద ఉధృతికి కొట్టుకుపోయాయని రాజయ్య తెలిపాడు. మొత్తం 40 మేకలకు 14 మేకలు మృతి చెందగా 10 మేకలు గల్లంతవ్వడంతో పాటు చీకటి పడడంతో మిగిలిన మేకలు సైతం కనిపించకుండా పోయాయని తెలిపాడు.

Updated Date - 2023-04-26T00:26:06+05:30 IST