విచారణ దశలోనే ‘రూ.లక్ష సహాయం’

ABN , First Publish Date - 2023-07-15T00:01:48+05:30 IST

వెనుకబడిన తరగతుల కుల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తుల విచారణ కొనసాగుతునే ఉంది. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి ఆర్థిక స్థితిగతులపై అధికారులు ఆరా తీస్తున్నారు.

విచారణ దశలోనే ‘రూ.లక్ష సహాయం’

- జిల్లాలో ఇంకా సిద్ధం కాని లబ్ధిదారుల జాబితా

- నేడు లబ్ధిదారులకు రూ.లక్ష సహాయం అందించడం డౌటే..

- ఒకవైపు దళారుల బేరసారాలు, మరోవైపు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు

- విచారణ దశలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ

- ప్రభుత్వానికి నివేదించని జిల్లా యంత్రాంగం

- బీసీ కుల వృత్తుదారుల సహాయానికి జిల్లాలో 17 వేలకు పైగా దరఖాస్తులు

కామారెడ్డి, జూలై 14(ఆంధ్రజ్యోతి): వెనుకబడిన తరగతుల కుల వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తుల విచారణ కొనసాగుతునే ఉంది. దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి ఆర్థిక స్థితిగతులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ సహాయానికి దరఖాస్తు చేసుకున్న అనుచరులకు ఇప్పించుకునేందుకు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో సందట్లో సడేమియా అనే చందంగా ప్రభుత్వం మంజూరు చేసే ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులను లక్ష్యంగా చేసుకుని కొందరు దళారులు రంగప్రవేశం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సహాయం మీకే మంజూరయ్యేలా చూస్తామంటూ దరఖాస్తుదారులను మభ్యపెట్టి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు చెందిన కుల వృత్తిదారులకు ప్రకటించిన రూ.లక్ష సహాయం కోసం జిల్లాలో మొత్తం 17వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణాల కోసం బీసీలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. బీసీలో కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

17 వేలపైగా దరఖాస్తులు

బీసీ కులస్తులకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 15 ఉప కులాల అభ్యర్థులు ఆర్థిక సహాయానికి అర్హులుగా గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా బీసీలోని 15 ఉప కుల సంఘాలే కాకుండా ఇతర కులాల వారు సైతం దరఖాస్తులు చేసుకున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 17,282 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో చాకలి కులస్తులు 4,098 మంది, కుమ్మరి 2,945, మంగళి 2,141, వండ్రంగిలు 1,769, ఒడ్డెర 1,680, కటికెలు 380, ఉప్పర 329, మ్యాదరి 465, వాల్మీకి బోయ 47, మేర 513, పూసల 94తో పాటు మరో మూడు కులస్తుల నుంచి సుమారు 2,500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరే కాకుండా ఈ పథకానికి అర్హులుగా లేని కులస్తులు సైతం మరో మూడు వేల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు బీసీ సంక్షేమశాఖధికారులు చెబుతున్నారు.

నేడు ఆర్థిక సహాయం అందడం డౌటే..

గత నెల 6 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో భారీగానే దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులపై మండలాల పరిధిలో ఎంపీడీవోలు, మున్సిపల్‌ పరిధిలో కమిషనర్ల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ ఇంకా కొనసాగుతునే ఉంది. నేటి నుంచి లబ్ధిదారులకు లక్ష ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ విచారణ దశలోనే ఉంది. ఇప్పటికీ సంబంధిత శాఖ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసిన జాబితాను ప్రభుత్వానికి నివేదించలేదు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారుల జాబితా వస్తే కాని ఆయా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో శనివారం లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందడం డౌటేనని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

అర్హులకు అందేనా?

ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అవసరాన్ని లక్ష్యంగా చేసుకుని దళారులు తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాము చెప్పినంత ముట్టజెబితే రూ.లక్ష మీకే మంజూరయ్యేలా చూస్తామంటూ దరఖాస్తుదారులను నమ్మబలుకుతున్నారు. ఆర్థిక సహాయం మంజూరు చేయించినందుకు దళారులు దరఖాస్తుదారుల నుంచి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ముందుగా ఇస్తేనే ఆర్థిక సహాయం మంజూరు అవుతుందని లేకపోతే తామేమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. మరికొందరు దళారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం సహాయం జమ అయిన తర్వాతనే ఇస్తామంటూ దరఖాస్తుదారులు మధ్యవర్తులకు స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ముఖ్యనేతలు తమ అనుచరులను, సన్నిహితులను ఎంపిక చేయాలంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. అధికారులు దళారుల సిఫారస్‌లకు, ప్రజాప్రతినిధులు ముఖ్యనేతలకు ప్రాఽధాన్యత ఇస్తారా లేక సామాన్య అర్హులకే మంజూరు చేస్తారనేది స్పష్టత కరువై దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సహాయం ఎంపికలో ఎలాంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా అర్హులైన వారికే మంజూరయ్యేలా జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

Updated Date - 2023-07-15T00:01:48+05:30 IST