హోలీ.. రంగోళీ!
ABN , First Publish Date - 2023-03-08T00:20:13+05:30 IST
జిల్లాలోని అన్ని మండలాల్లో మంగళవారం హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
- కామారెడ్డిలో ఘనంగా హోలీ
- హోలీ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్, టీఎన్‌జీవోస్
- యువతి, యువకులు చిందులేసి రంగోళి వేడుకలను జరుపుకున్న వైనం
కామారెడ్డి/కామారెడ్డి టౌన్, మార్చి 7: జిల్లాలోని అన్ని మండలాల్లో మంగళవారం హోలీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆయా వార్డులో చిన్నా పెద్ద తేడా లేకుండా డీజే సౌండ్‌లతో, బ్యాండు మేళాలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందోత్సాహాల మధ్య హోలీ జరుపుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయా ప్రధాన కూడళ్లలో గులాలు, ఇతర రంగులతో కూడిన నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందోత్సహాల మధ్య హోలీ పండుగను జరుపుకున్నారు. కొడి గుడ్లు పగులగొట్టి రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ రంగోళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. సోమవారం రాత్రి పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద కామదాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ జితేష్ వి.పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్‌దోత్రే, కలెక్టరేట్ ఉద్యోగులు, టీఎన్‌జీవోస్ నాయకులు హోలీ ఆడారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ రంగులు కలిసి ఉన్నట్లుగానే ఉద్యోగులు కలిసి ఉండాలని అన్నారు. ఉద్యోగులు విధులు నిర్వర్తించే సమయంలో ఒత్తిడికి గురి కాకుండా తోటి ఉద్యోగులతో స్నేహభావంతో మెలిగి తమ విధులను నిర్వహించాలన్నారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో హోలీ వేడుకలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజారాం, టీఎన్ జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రఽధాన కార్యదర్శి సాయిలు, ప్రతినిధులు దయానంద్, సతీష్ యాదవ్, దేవరాజు, నీలం లింగం తదితరులు పాల్గొన్నారు.