నిరుద్యోగుల్లో ఆశలు
ABN , First Publish Date - 2023-08-25T00:04:16+05:30 IST
ఎన్నికల వేళ యువత ఓట్లు రాబటేందుకు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. గతంలో మాదిరిగానే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు.
- ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామంటూ ప్రభుత్వ ప్రకటన
- డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
- త్వరలోనే నోటిఫికేషన్ జారీకి సన్నాహకాలు
- అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి
- జిల్లాలో 850 ఖాళీ పోస్టులు
- జిల్లాలో డీఎస్సీ ద్వారా సుమారు 400లకు పైగా భర్తీ అయ్యే అవకాశం
కామారెడ్డి టౌన్, ఆగస్టు 24: ఎన్నికల వేళ యువత ఓట్లు రాబటేందుకు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. గతంలో మాదిరిగానే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. రెండు, మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీంతో డీఎస్సీ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తే జిల్లాలో 400లకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టెట్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరించారు. సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించి 17న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు విడుదల కాగానే డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో 850 పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు
ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి వివరాలను జిల్లాల వారీగా ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖాధికారులు వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 850 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 100 వరకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండగా వీటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 300ల వరకు ఖాళీగా ఉండగా ఇందులో 30 శాతం మాత్రమే డీఎస్సీ ద్వారా రిక్రూట్‌మెంట్ చేయనున్నారు. మిగతా 400ల పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీచేసే అవకాశాలు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా 7 వేలకు పైగా నిరుద్యోగులు
జిల్లావ్యాప్తంగా 7వేలకు పైగా నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా జిల్లా ఉపాఽధి కల్పన కార్యాలయంలో ఉపాధి నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో సుమారు 3 వేల మందికి పైగా నిరుద్యోగ యువతీ, యువకులు డీఎస్సీ కోసం నిరీక్షిస్తున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష గత ఏడాది కిందట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అయినప్పటికీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేకపోయింది. 2017లో టీఆర్‌టీ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేకపోయింది. గత టీఆర్‌టీలో ఎంపిక కాని అభ్యర్థులతో పాటు గత ఏడాది టెట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం గతంలో మాదిరిగానే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించడంతో టెట్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైన డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పోస్టులను భర్తీ చేయాలని టెట్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ సంబంధించి మార్గనిర్ధేశాలను ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంది.