చేరికలే లక్ష్యం....!

ABN , First Publish Date - 2023-09-04T01:20:35+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పార్టీలో ఉన్న నాయకులు మరో పార్టీలోకి చేరగానే ఆ పార్టీ నుంచి ఇంకో నాయకుడిని తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే కామారెడ్డి నియోజకవర్గంలో చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆయా కుల సంఘాల ప్రతినిధులతోను ఆయా పార్టీల ముఖ్యనేతలు టచ్‌లో ఉంటున్నారు. ఇలా ప్రధాన పార్టీలు చేరికలే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

చేరికలే లక్ష్యం....!

- అసంతృప్తులపై ప్రధాన పార్టీల నజర్‌

- తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు

- బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో జోరందుకున్న వలసలు

- బీజే పీ బలం పెంచుకునే ప్రయత్నం

- యువతపై బీజేపీ ఫోకస్‌

కామారెడ్డి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పార్టీలో ఉన్న నాయకులు మరో పార్టీలోకి చేరగానే ఆ పార్టీ నుంచి ఇంకో నాయకుడిని తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే కామారెడ్డి నియోజకవర్గంలో చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆయా కుల సంఘాల ప్రతినిధులతోను ఆయా పార్టీల ముఖ్యనేతలు టచ్‌లో ఉంటున్నారు. ఇలా ప్రధాన పార్టీలు చేరికలే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

బీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్న నాయకులు

కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తుండడంతో కామారెడ్డి జిల్లాలోనే కాకుండా నిజామాబాద్‌ జిల్లాలోనూ అధికార బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంటుంది. ఇదే క్రమంలో ప్రతిపక్షాల్లోని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మండల, గ్రామస్థాయిలో పట్టు ఉన్న నాయకులు, ప్రతిపక్ష పార్టీల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులను తమ వైపు ఆకర్షించి గులాబీ కండువాలు కప్పుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డికి చెందిన బీజేపీ నాయకుడు ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. బీబీపేట, దోమకొండ, భిక్కనూర్‌, రాజంపేట మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు సైతం బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మండల, గ్రామస్థాయిలో పలుకుబడి ఉన్న ప్రతిపక్ష నేతలపై బీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. ఆ నేతలే లక్ష్యంగా చేసుకుని జోరుగా చేరికలు కొనసాగిస్తోంది.

కాంగ్రెస్‌లోనూ కొనసాగుతున్న చేరికలు

కాంగ్రెస్‌ పార్టీలోనూ బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగలిగే వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నారు. అనివార్య కారణాల వల్ల గతంలో పార్టీని వీడిన వారిని తిరిగి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ మంత్రి షబ్బీర్‌అలీ విస్తృతంగా పర్యటిస్తు బీఆర్‌ఎస్‌ అసంతృప్తితో ఉన్న నాయకులను, కార్యకర్తలను కాంగ్రెస్‌లో చేరాలని కోరుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను షబ్బీర్‌అలీ కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు సర్పంచ్‌లు కాంగ్రెస్‌ నేత మదన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన గ్రామస్థాయి కార్యకర్తలు హస్తం గుటికి చేరారు. బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌లోకి పలువురు చేరుతున్నారు.

బీజే పీ బలం పెంచుకునే ప్రయత్నం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ నేతలు సైతం వలసలపై దృష్టి సారించారు. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలం పెంచుకునేందుకు ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలను చేర్చుకుంటున్నారు. ప్రధానంగా బీజేపీ యూత్‌పై దృష్టి సారించింది. కామారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు పట్టణానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వెంకటరమణారెడ్డి సమక్షంలో యువకులతో పాటు మహిళలు బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార జుక్కల్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఆమె విస్తృతంగా పర్యటిస్తూ చేరికలపై దృష్టి సారించారు. ఇటీవల జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద మండలాలకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఆయా చోట్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో ఉన్న అసంతృప్తులను బీజేపీలో చేర్చుకుంటున్నారు.

Updated Date - 2023-09-04T01:20:35+05:30 IST