గులాబీ శ్రేణుల్లో జోష్‌

ABN , First Publish Date - 2023-08-22T23:58:51+05:30 IST

సీఎం కేసీఆర్‌ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తారని స్వయంగా కేసీఆరే ప్రకటించిన విషయం తెలిసిందే. కామారెడ్డికి కేసీఆర్‌ రాకతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత జోష్‌ నెలకొంటుంది. కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ చేయనున్నందున ఆ పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్యనేతలు, సామాన్య కార్యకర్తలు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కామారెడ్డిలోనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ మరింత పటిష్టం కానుంది. అయితే ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను బలహీనపరచాలనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారనే వాదన ప్రతిపక్ష వర్గాల నుంచే కాకుండా అధికార పార్టీలోనూ చర్చ సాగుతోంది. కేసీఆర్‌ రాకతో పార్టీకి మరింత బలం చేకూరడమే కాకుండా వలసలు పెరిగే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

గులాబీ శ్రేణుల్లో జోష్‌

- కేసీఆర్‌ పోటీతో బీఆర్‌ఎస్‌లో కథనోత్సాహం

- కామారెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల్లో సంబరాలు

- పార్టీలోకి వలసలు మరింత పెరిగే అవకాశం

- కేసీఆర్‌ గెలుపుపై ఉమ్మడి జిల్లాల ప్రతినిధుల ఫోకస్‌

- కామారెడ్డిలో ప్రతిపక్షాల పోటీ లేకుండా చేసేందుకు వ్యూహాలు

- ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకే బరిలోకి కేసీఆర్‌

- కామారెడ్డిలోనే కాకుండా ఉమ్మడి జిల్లాలో పార్టీకి మరింత బలం

- కేసీఆర్‌ వస్తే కామారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందంటున్న సామాన్య ప్రజలు

కామారెడ్డి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తారని స్వయంగా కేసీఆరే ప్రకటించిన విషయం తెలిసిందే. కామారెడ్డికి కేసీఆర్‌ రాకతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత జోష్‌ నెలకొంటుంది. కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ చేయనున్నందున ఆ పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్యనేతలు, సామాన్య కార్యకర్తలు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కామారెడ్డిలోనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ మరింత పటిష్టం కానుంది. అయితే ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను బలహీనపరచాలనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారనే వాదన ప్రతిపక్ష వర్గాల నుంచే కాకుండా అధికార పార్టీలోనూ చర్చ సాగుతోంది. కేసీఆర్‌ రాకతో పార్టీకి మరింత బలం చేకూరడమే కాకుండా వలసలు పెరిగే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కామారెడ్డి నుంచి కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులు వ్యూహం రచిస్తున్నట్లు తెలిసింది. కామారెడ్డిలో కేసీఆర్‌కు ప్రతిపక్షాల నుంచి గట్టిపోటీ లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీపై నియోజకవర్గంలోని ప్రజలు స్వాగతిస్తున్నారు. కేసీఆర్‌ కామారెడ్డి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు.

ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకే కేసీఆర్‌ పోటీనా?

జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతూ వస్తోంది. ఇదే నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లోను మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. దీంతో కొందరు అసమ్మతి బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్‌, బీజేపీలోకి వలసలు వెళ్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనే కాకుండా నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 9 సీట్లలో రెండు, మూడు నియోజకవర్గాలు బీఆర్‌ఎస్‌కు గల్లంతయ్యే అవకాశం ఉందని సీఎం కేసీఆర్‌ సర్వేలో తేలింది. దీంతో కామారెడ్డి నుంచి కేసీఆర్‌ బరిలో ఉంటే ఉమ్మడి జిల్లాలో 9 సీట్లను క్లీన్‌ స్వీప్‌ చేయవచ్చని అదే సమయంలో ప్రతిపక్షాలను బలహీనపరచవచ్చని కేసీఆర్‌ వ్యూహంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లానే కాకుండా పక్క నియోజకవర్గాలైన ఆంధోల్‌, నారాయణఖేడ్‌, కోరుట్ల, జగిత్యాలలోను బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకొవచ్చనే కేసీఆర్‌ వ్యూహంగా తెలుస్తోంది. ఇలా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాలో బీఆర్‌ఎస్‌ బలోపేతం కానుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

కామారెడ్డిపై బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల ఫోకస్‌

కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందున ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు కామారెడ్డిపై దృష్టి సారించారు. ఓటమే ఎరుగని కేసీఆర్‌ను గతంలో గజ్వేల్‌ నియోజకవర్గంలో వచ్చిన మెజార్టీ కంటే కామారెడ్డి నియోజకవర్గంలో అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు కామారెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బలంగా ఉండడం ఆ పార్టీ ప్రత్యర్థి సీనియర్‌ నాయకుడు కావడం ప్రజల్లో సానుభూతి ఉండడం ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌కు కాస్త ప్రతికూల పరిస్థితులు ఉండడంతో కేసీఆర్‌కు కాంగ్రెస్‌ నుంచి పోటీ లేకుండా చేసేందుకు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ కామారెడ్డి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులను కేసీఆర్‌ గెలుపునకు సమాయత్తం చేస్తున్నారు. త్వరలోనే కామారెడ్డి నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం పెట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేసీఆర్‌ రాకపై కామారెడ్డి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజిబొద్ధీన్‌, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌ స్వాగతిస్తూ ప్రకటించారు. కేసీఆర్‌ గెలుపునకు సర్వశక్తులా పని చేస్తామని వారు చెబుతున్నారు.

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం...

కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ పోటీ చేయనున్నందున ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యనేతలు సామాన్య కార్యకర్తలు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నారు. కామారెడ్డి పట్టణ కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో వెలకమ్‌ టు కేసీఆర్‌ అంటూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు మంగళవారం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయా మండలాల్లోనూ టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకుని వెలకమ్‌ టు కేసీఆర్‌ అంటూ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోనే కాకుండా బాన్సువాడ, జుక్కల్‌, ఎల్లారెడ్డిలోనూ సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే కామారెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్ని వర్గాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కామారెడ్డిలో పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్ట్‌లు, అభివృద్ధి పనులు కేసీఆర్‌ పోటీతో వేగం పుంజుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు సైతం చెబుతున్నాయి. కేసీఆర్‌ పోటీతో జిల్లా ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో చూడాలి.

Updated Date - 2023-08-22T23:58:51+05:30 IST