ప్రజాస్వామ్య పాలన కోసం మరోసారి పోరాటం చేద్దాం

ABN , First Publish Date - 2023-09-15T00:18:25+05:30 IST

ప్రజాస్వామిక పాలన కోసం మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్‌లో ఉద్యమకారులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అనేక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్‌అలీలు హాజరయ్యారు.

ప్రజాస్వామ్య పాలన కోసం మరోసారి పోరాటం చేద్దాం

- ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనుకుంటే ప్రజాస్వామ్య పాలన దూరమైంది

- తెలంగాణలో ఆర్థికంగా బలపడిన ఆంధ్ర కాంట్రాక్టర్లు

- ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న ఇక్కడి యువకులు

- నియంతపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది

- ఉద్యమగడ్డ కామారెడ్డి నుంచే ఈ పోరాటం మొదలు పెడదాం

- ప్రొఫెసర్‌ కోదండరాం

- తెలంగాణ ఉద్యమకారులు రోడ్డు మీద ఉంటే ద్రోహులు మంత్రివర్గంలో ఉన్నారు

- మంత్రులు ఏ పని చేయాలన్నా కేసీఆర్‌ దిశా నిర్ధేశంతోనే చేయాలి

- కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ

కామారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 14: ప్రజాస్వామిక పాలన కోసం మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్‌లో ఉద్యమకారులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అనేక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్‌అలీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనుకుంటే బంగారు తెలంగాణ పేరుతో ప్రజాస్వామ్య పాలన దూరం చేశారని అన్నారు. ప్రత్యేక తెలంగాణలోనూ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆర్థికంగా బలపడితే ఇక్కడి యువకులు ఉపాధి దొరకక, నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దీక్షలు, రాస్తారోకోలు, రైలురోకోలతో పాటు అనేక మంది యువకులు బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చిందని కానీ కేసీఆర్‌ మాత్రం నేను చావునోట్లో తలకాయ పెట్టి పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ప్రతీసారి నేను.. నేను అనే పదం అంటున్నాడే తప్ప మనం అనే పదం ఆయన నోట్లోంచి రావడం లేదని అన్నారు. కామారెడ్డిలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే సైతం రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనడానికి కారణం కరీం అనే యువకుడు బలిదానం చేయడమేనని అన్నారు. ఏ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం చేసామో ఆ తెలంగాణ ఈ పది సంవత్సరాల్లో కనిపించలేదని మరోమారు పోరాటం చేసి నియంత పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆ అవకాశం మరోసారి కామారెడ్డి ప్రజలకే దక్కిందని అన్నారు. గడీల, ఫాంహౌజ్‌ పాలనను తరమికొట్టేందుకు ఉద్యమాల గడ్డ కామారెడ్డి నుంచే పోరాటం మొదలు పెట్టేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని తెలిపారు. తెలంగాణలో ఉద్యమ సమయంలో తీసుకున్న ప్రతీ నిర్ణయానికి కామారెడ్డి నుంచే పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ప్రజలకు చేస్తున్న అనేక రకాల ద్రోహులకు వివరించాల్సిన బాధ్యత ఉద్యమకారులపై, మేధావులపై ఉందని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియా గాంఽధీకి తెలంగాణ ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా ఉన్న అప్పటి ప్రధాన మంత్రి మనోహ్మన్‌సింగ్‌, రాహుల్‌గాంధీలకు తెలంగాణ ఏర్పాటు విషయంలో అంతగా సానుకూల స్పందన లేకపోవడంతో ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులం జేఏసీ నాయకులతో కలిసి వెళ్లి తెలంగాణ ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించి తెలంగాణ ఏర్పాటు చేసే దిశగా కృషి చేశామని అన్నారు. అట్లాంటి తెలంగాణలో ప్రస్తుతం గడీల పాలన నడుస్తుందని ఉద్యమంలో అనేక రకాల పోరాటాలు చేసిన నాయకులు, ఉద్యమకారులు ఇప్పుడు రోడ్డు మీద ఉంటే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్యమ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో మంత్రులకు అనేక రకాలైన స్వేచ్ఛ ఇచ్చి వాళ్లు చెప్పిన నిర్ణయాలు వినేవారని ప్రస్తుతం మంత్రులు ఏ పని చేయాలన్నా కేసీఆర్‌ దిశా నిర్ధేశంతోనే చేయాల్సి వస్తుందని అన్నారు. అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌కు బడ్జెట్‌ ప్రవేశపెట్టగా అందులో ఉన్న ఏ అంశంపై ఆయనకు తెలియదని కేవలం కేసీఆర్‌ ఇచ్చిన వివరాలను తాను చదవాల్సి వస్తుందని తన వద్ద వాపోయారని తెలిపారు. అధికార పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు తప్ప ప్రతిపక్షాలకు చెందిన నాయకులకు, ఎమ్మెల్యేలకు సైతం సచివాలయంలోకి వెళ్లేందుకు ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. 1969 నుంచే కామారెడ్డి ఉద్యమాలకు పెట్టింది పేరని అప్పట్లోనే అడ్లూర్‌కు చెందిన ఓ వ్యక్తి తెలంగాణ పోరాటం చేసి ప్రాణాలు వదిలారని అన్నారు. అలాంటి గడ్డమీద మాయలు చేసే కేసీఆర్‌ వస్తున్నాడని ఇక్కడి ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవకాశం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ నాయకులు జగన్నాథం, సిద్ధిరాములు, నరసింహారెడ్డి, టీజేఎస్‌ నాయకులు నిజ్జన రమేష్‌, లక్ష్మణ్‌యాదవ్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు, నాయకులు గణేష్‌నాయక్‌, సందీప్‌, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-15T00:18:25+05:30 IST