మద్యం టెండర్లకు కిక్కే.. కిక్కు!

ABN , First Publish Date - 2023-08-19T23:50:32+05:30 IST

కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 2174 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వైన్స్‌షాపులకు ఇంతపెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారి అని ఎక్సైజ్‌శాఖ అఽధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల కారణంగానే వైన్స్‌లకు డిమాండ్‌ ఏర్పడిందని, రియల్‌ రంగం కుదేలుకావడం, ఆ వ్యాపారులంతా మద్యం వ్యాపారానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు నిజాంసాగర్‌ మండలంలోని బంజేపల్లి వైన్స్‌కు 88 వచ్చాయి.

మద్యం టెండర్లకు కిక్కే.. కిక్కు!

- జిల్లాలో మద్యం టెండర్లకు రూ.43.48 కోట్లు

- అత్యధికంగా బంజేపల్లి వైన్స్‌కు 88 దరఖాస్తులు

- మద్దెల చెరువు వైన్స్‌కు రెండే దరఖాస్తులు

- జిల్లా వ్యాప్తంగా 2174 దరఖాస్తులు

- రేపు రేణుక కల్యాణ మండపంలో లక్కీడ్రా

కామారెడ్డి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 2174 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వైన్స్‌షాపులకు ఇంతపెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారి అని ఎక్సైజ్‌శాఖ అఽధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల కారణంగానే వైన్స్‌లకు డిమాండ్‌ ఏర్పడిందని, రియల్‌ రంగం కుదేలుకావడం, ఆ వ్యాపారులంతా మద్యం వ్యాపారానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు నిజాంసాగర్‌ మండలంలోని బంజేపల్లి వైన్స్‌కు 88 వచ్చాయి. అతి తక్కువగా పిట్లం మండలంలోని మద్దెలచెరువు వైన్స్‌కు రెండు దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 49 వైన్స్‌లకు 2174 దరఖాస్తులు రాగా ఈ దరఖాస్తుల వల్లనే ప్రభుత్వానికి రూ.43.48 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది మొత్తం 984 దరఖాస్తులు రాగా రూ.19.68 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. గతంతో పోలిస్తే 1190 అదనంగా దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం 786 దరఖాస్తులు రావడం విశేషం.

స్టేషన్‌ల వారీగా దరఖాస్తులు ఇలా..

జిల్లాలోని మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 49 వైన్స్‌లకు గాను 2174 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువగా కామారెడ్డి ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో దరఖాస్తులు రావడం జరిగింది. కామారెడ్డి ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 744 దరఖాస్తులు రాగా దోమకొండలో 421, ఎల్లారెడ్డిలో 323, బాన్సువాడలో 343, బిచ్కుంద ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో 343 వచ్చాయి. శనివారం ఒకేరోజు ఈ ఐదు పోలీసుస్టేషన్‌ల పరిధిలో 786 దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి పరిధిలో 275, దోమకొండలో 148, ఎల్లారెడ్డిలో 119, బాన్సువాడలో 123, బిచ్కుందలో 121 దరఖాస్తులు వచ్చాయి.

అత్యధికంగా బంజేపల్లి వైన్స్‌కు 88 దరఖాస్తులు

జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మద్యం వ్యాపారులే కాకుండా రియల్‌ వ్యాపారులు, పలు వ్యాపారాల్లో ఉన్న వారు సైతం వైన్స్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంవత్సరంతో పాటు వచ్చే సంవత్సరంలోనూ అసెంబ్లీ, పార్లమెంట్‌, సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్‌ ఎన్నికలు ఉండడంతో వైన్స్‌లకు ఎక్కువగా డిమాండ్‌ వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా మద్యం సేల్స్‌ ఎక్కువగా ఉంటాయని లాభాలు రాబట్టవచ్చని వ్యాపారులు ఆలోచించడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లాలో 49 వైన్స్‌లు ఉండగా అత్యధికంగా నిజాంసాగర్‌ మండలంలోని బంజేపల్లి వైన్స్‌కు 88 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత తాడ్వాయిలోని షాపు నెంబర్‌ 23 వైన్స్‌కు 86, రాజంపేట వైన్స్‌కు 72, కామారెడ్డిలోని సిరిసిల్లా రోడ్డులో గల షాపు నెంబర్‌ 4కు 63, నాగిరెడ్డిపేటలోని వైన్స్‌కు 62, కామారెడ్డిలోని కొత్త బస్టాండ్‌ షాపు నెంబర్‌ 1కి, భిక్కనూర్‌లోని వైన్స్‌కు 58 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా పిట్లం మండలంలోని మద్దెలచెరువు వైన్స్‌కు 2 దరఖాస్తులు రాగా పెద్ద కొడప్‌గల్‌ వైన్స్‌కు 15 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. పది కంటే తక్కువగా దరఖాస్తులు వచ్చిన వైన్స్‌లకు మరోసారి టెండర్లు వేయనున్నారు. సోమవారం ఈ వైన్స్‌లకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రేణుకా కల్యాణ మండపంలో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సమక్షంలో లక్కీడ్రా తీయనున్నారు.

Updated Date - 2023-08-19T23:50:32+05:30 IST