ముసురుతో శిథిల భవనాలకు ముప్పే
ABN , First Publish Date - 2023-07-22T00:20:15+05:30 IST
ప్రతీ సంవత్సరం ముసురు పడితే చాలు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత భవనాల్లో ఉండే వారితో పాటు సమీప ఇళ్లల్లో నివాసం ఉండే వారికి దినదిన గండమే. వాన నీటిలో భవనాలు తడిసి గోడలు బలహీనమై కూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలుచోట్ల పాత పెంకుటిళ్లు కూలుతూ వస్తున్నాయి.
- ఏళ్లనాటి భవనాలు శిథిల దశకు
- ఎడతెరిపి లేని వర్షానికి పలుచోట్ల కూలుతున్న గోడలు
- కామారెడ్డి మున్సిపల్ పరిధిలో గతంలో 40కు పైగా శిథిల భవనాల గుర్తింపు
- మున్సిపల్ సిబ్బందితో మరికొన్ని చోట్ల గుర్తించేందుకు కసరత్తు
- సురక్షిత ప్రాంతాలకు తరలాలని సూచన
- తాత్కాలిక పునరావాస ఏర్పాట్లకు చర్యలు
కామారెడ్డి టౌన్, జూలై 21: ప్రతీ సంవత్సరం ముసురు పడితే చాలు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత భవనాల్లో ఉండే వారితో పాటు సమీప ఇళ్లల్లో నివాసం ఉండే వారికి దినదిన గండమే. వాన నీటిలో భవనాలు తడిసి గోడలు బలహీనమై కూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలుచోట్ల పాత పెంకుటిళ్లు కూలుతూ వస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలతో పాటు పాత పట్టణంలోని అనేక చోట్ల ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన పెంకుటిళ్లు, ఆర్‌సీసీ బిల్డింగ్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు గతంలోనే మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఆయా ఇళ్లకు ఇప్పటికే అనేక సార్లు నోటీసులు సైతం అధికారులు అందించారు. అయితే నోటీసులు అందించిన సమయంలోనే తాము కూల్చివేస్తామనో లేదంటే ఇక మీదట అందులో ఉండమని ఇంటి యజమానులు చెబుతూ వస్తున్నారు. తీరా వర్షాకాలం దాటిన తర్వాత తిరిగి అందులోనే నివాసం ఉంటున్నారు. ఇక మీదట ఇలాంటి వాటిలో ప్రజలు ఉండకుండా పూర్తిస్థాయిలో వారికి నోటీసులు అందించి తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
శిథిల భవనాలు గుర్తించేందుకు కసరత్తు
వర్షాలతో కూలే ప్రమాదం ఉన్న ఇళ్లను గుర్తించేందుకు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కసరత్తు ప్రారంభించారు. గతంలో గుర్తించిన 40కు పైగా ఇళ్లతో పాటు మరికొన్నిచోట్ల ఉన్న భవనాలను సైతం గుర్తించే పనిలో పడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్డుతో పాటు కసబ్‌గల్లి, గొల్లవాడ, హరిజనవాడ, పెద్ద బజార్‌లతో పాటు తదితర ప్రాంతాల్లో శిథిలమైన భవనాలు చాలా వరకు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆయా ఇంటి యజమానులకు నోటీసులు అందించేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా వ్యాపార సముదాయాలు ఉన్నచోట్ల ప్రత్యేక దృష్టి సారించి సెక్షన్ 182 మున్సిపల్ చట్టం 2019 ప్రకారం శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చివేసి చట్టరీత్యా చర్యలు చేపట్టనున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. శిథిల భవనాల్లో ప్రజలు ఎవరూ ఉండవద్దని ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ సారి కఠినంగా వ్యవహరించనున్నారు.
తాత్కాలిక పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున శిథిలమైన భవనాల్లో ఉన్న వారికి నోటీసులు అందించి వారిని మరో భవనాల్లో ఉండేవిధంగా సూచించడం, మరీ పేద పరిస్థితిలో ఉంటే తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. అందుకు గాను ప్రభుత్వ పాఠశాలలు, ఇతర కమ్యూనిటీ భవనం లాంటి వాటిని పరిశీలించి వారిని అందులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రజలు శిథిలదశలో ఉన్న ఇళ్లలో ఉండకుండా సురక్షిత స్థలాలకు చేరితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం ఉండకుండా ఉంటుందని కూలేదశలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉండడం వల్ల ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వారితో పాటు పక్కన నివాసం ఉండేవారికి సైతం పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని ఆయా ఇంటి యజమానులు సహకరించాలని కోరుతున్నారు.
శిథిల భవనాల గుర్తింపునకు చర్యలు చేపట్టాం
- గిరిధర్, టీపీవో, కామారెడ్డి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో శిథిల దశలో ఉన్న భవనాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది ద్వారా గతంలో గుర్తించిన శిథిల భవనాల యజమానులకు ఆ భవనాలను ఖాళీ చేయాలని సూచిస్తున్నాం. మున్సిపల్‌లోని అన్ని వార్డులలో శిథిలదశలో ఉన్న ఇళ్లను గుర్తించేందుకు మున్సిపల్‌లోని ఇతర విభాగాల సిబ్బందిని సైతం వినియోగించుకుని శిఽథిల భవనాలను గుర్తించి కూల్చివేస్తాం. పేద ప్రజలకు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసేందుకు పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలు శిథిలదశలో ఉన్న భవనాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.