జిల్లా వ్యాప్తంగా వాన

ABN , First Publish Date - 2023-09-04T01:19:14+05:30 IST

నెల రోజులుగా వర్షాలు లేక రైతన్నలు వర్షం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకూ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా వాన

జిల్లాలో 7.8 సెంటీమీటర్ల వర్షం

మరో మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 3: నెల రోజులుగా వర్షాలు లేక రైతన్నలు వర్షం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకూ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో పంట నష్టం జరగగా నెలరోజులుగా వర్షాలు లేక రైతులు కొంత ఇబ్బందులు పడ్డారు. వేసిన పంటలు చేతికి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాల కోసం రైతులు ఎదురు చూశారు. వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం సిరికొండ మండలం తూంపల్లిలో 5.78 సెంటీమీటర్ల వర్షం కురవగా చీమన్‌పల్లిలో 5.38 సెంటీమీటర్లు వర్షం కురిసింది. ఇందల్వాయి మండలం గన్నారంలో 5.23 సెంటీమీటర్ల వర్షం, సిరికొండలో 4.58 సెంటీమీటర్లు, ధర్పల్లిలో 4.55 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ముప్కాల్‌లో 3.85 సెం.మీ., కమ్మర్‌పల్లిలో 3.78 సెం.మీ., డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లిలో 3.10 సెం.మీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళా ఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో జిల్లాలో మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు సైతం వర్షాల వల్ల బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సాయంత్రం వరకు కొంత మేర విరామం ఇవ్వడంతో ప్రజలు తమ కార్యకలాపాలను నిర్వహించారు.

Updated Date - 2023-09-04T01:19:14+05:30 IST