కామారెడ్డి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.195 కోట్లు మంజూరు

ABN , First Publish Date - 2023-09-08T00:22:15+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎతైన ప్రాంతం కామారెడ్డి నియోజకవర్గమని నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇటీవల సీఎం కేసీఆర్‌కు తాను విన్నవించడంతో స్పందించిన కేసీఆర్‌ వెంటనే నియోజకవర్గ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.195కోట్లు మంజూరు చేశారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు.

కామారెడ్డి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.195 కోట్లు మంజూరు

- మిషన్‌ భగీరథ ద్వారా గోదావరి జలాలకై 47 కి.మీల పైప్‌లైన్‌

- పనులు ప్రారంభించాలంటూ జీవో జారీ చేసిన ప్రభుత్వం

- కాంగ్రెస్‌ నిర్వాకం వల్ల కామారెడ్డి ప్రజలకు నీరు అందలేని పరిస్థితి

- షబ్బీర్‌అలీ కాంట్రాక్టర్‌ల కుమ్మక్కుతో నాసిరకం పనులు

- సీఎం కేసీఆర్‌ కామారెడ్డికి వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది

- ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌

కామారెడ్డి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎతైన ప్రాంతం కామారెడ్డి నియోజకవర్గమని నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇటీవల సీఎం కేసీఆర్‌కు తాను విన్నవించడంతో స్పందించిన కేసీఆర్‌ వెంటనే నియోజకవర్గ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.195కోట్లు మంజూరు చేశారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. నిధులు మంజూరు చేయడమే కాకుండా పనులు చేపట్టేందుకు జీవోను సైతం జారీ చేశారన్నారు. త్వరలోనే ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విప్‌ మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా గోదావరి జలాలను సరఫరా చేస్తున్నామన్నారు. అయితే గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వేసిన నాసిరకం పైపులైన్ల వల్ల లీకేజీలు కావడంతో నెలలో పన్నెండు రోజులు కూడా తాగునీరు సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి మల్లన్నగుట్ట వరకు గోదావరి జలాలతో కామారెడ్డి ప్రజలకు తాగునీరు అందించేందుకు నాసిరకం పనులు చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. కామారెడ్డికి గోదావరి జలాలు అందించిన ఘనత తమదేనని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ కాంట్రాక్టర్‌లతో కుమ్మక్కై పైప్‌లైన్‌ పనులు నాసిరకం చేపట్టారని ఆరోపించారు. అప్పుడు నాణ్యతలేని జీఆర్‌టీ పైప్‌లు వేశారని ఆ పైపులు నీటి ప్రవాహం ఒత్తిడి తట్టుకోలేక లీకేజీలు ఏర్పడుతుండడంతో తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఇదే విషయాన్ని తాను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించి పాత పైపులైన్‌ ప్లేస్‌లో కొత్తగా పైపులైన్‌ వేసేందుకు రూ.195 కోట్లు మంజూరు చేస్తూ జీవో 460 జారీ చేశారన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి రా వాటర్‌ను జలాల్‌పూర్‌ ద్వారా అర్గుల్‌ వరకు అక్కడి నుంచి ఇందల్‌వాయి మల్లన్నగుట్ట వరకు మొత్తం 47 కి.మీల మేర 900 ఎంఎం వెడల్పు గల ఎంఎస్‌ కంపెనీ పైపులను వేయడం జరుగుతుందన్నారు. ఈ పైపులైన్‌ పనులు పూర్తయితే కామారెడ్డి నియోజకవర్గంలోని మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలకు, ఎల్లారెడ్డిలోని సదాశివనగర్‌, గాంధారి, తాడ్వాయి మండలాల్లోని కొన్ని గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు. కామారెడ్డిలోనూ కొందరు ఓట్లు, రాజకీయం కోసమే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, తాను చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలతో పాటు మారుమూల గ్రామాలకు సైతం నాలుగు లైన్లు, రెండు లైన్ల రహదారులతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఇదే రోడ్లపైన సెంట్రల్‌ లైటింగ్‌ల కింద రోజు తిరుగుతున్నప్పటికీ అది కనిపించనట్టుగా అభివృద్ధి చేయలేదంటూ ఆరోపించడం సిగ్గు చేటన్నారు. నియోజకవర్గంలోని 99 గ్రామ పంచాయతీల్లో నూతన పంచాయతీ భవనాలను నిర్మించిన ఏకైక నియోజకవర్గం కామారెడ్డి అని అన్నారు. అదేవిధంగా ఓ స్వచ్ఛంద సంస్థ అయిన కృష్ణారెడ్డి మాచారెడ్డి మండలంలోని మర్రితండాను ఎంచుకుని అక్కడి మహిళలకు, యువతులకు స్వయం ఉపాధి కల్పించేందుకై రూ.1.70 కోట్లతో పాలశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాడని అన్నారు. కేసీఆర్‌ స్వగ్రామం బీబీపేటలోని కోనాపూర్‌ అయినందున వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తానే రెండు, మూడు సార్లు సీఎం కేసీఆర్‌ను కోరడం జరిగిందన్నారు. నా కోరిక మేరకు కేసీఆర్‌ కామారెడ్డి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డికి వస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని విప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజిబొద్ధీన్‌, మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌రావు, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, దోమకొండ జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-08T00:22:15+05:30 IST