కాంగ్రెస్‌లో టికెట్ల టెన్షన్‌

ABN , First Publish Date - 2023-09-06T00:10:15+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కీలక దశకు చేరుకోవడంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో దరఖాస్తుదారుల్లో తీవ్ర టెన్షన్‌ నెలకొంటుంది. ప్రస్తుతం జరగనున్న స్ర్కీనింగ్‌ కమిటీ సభ్యుల పరిశీలనలో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరనుంది. ఎంపిక చేసిన దరఖాస్తుదారుల పేర్లను స్ర్కీనింగ్‌ కమిటీ ఏఐసీసీకి సీల్డ్‌ కవర్‌లో పంపనుంది. స్ర్కీనింగ్‌ కమిటీ రూపొందించే జాబితాలో తమ పేరు ఉందోలేదోననే ఉత్కంఠ దరఖాస్తుదారుల్లో నెలకొంటుంది.

కాంగ్రెస్‌లో టికెట్ల టెన్షన్‌

- స్ర్కీనింగ్‌ కమిటీ చేతుల్లోకి జాబితా

- లిస్టులో పేరుందో లేదోనని ఆశావహుల్లో ఉత్కంఠ

- టికెట్ల కోసం గాడ్‌ఫాదర్‌ల చుట్టు ప్రదక్షిణలు

- ఇప్పటికే కామారెడ్డి టికెట్‌ షబ్బీర్‌అలీకి ఖాయం

- ఎల్లారెడ్డి, జుక్కల్‌లో ఇద్దరిద్దరు నేతల మధ్యే పోటీ

- నేడో, రేపో ఖరారు కానున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల లిస్టు

కామారెడ్డి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కీలక దశకు చేరుకోవడంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో దరఖాస్తుదారుల్లో తీవ్ర టెన్షన్‌ నెలకొంటుంది. ప్రస్తుతం జరగనున్న స్ర్కీనింగ్‌ కమిటీ సభ్యుల పరిశీలనలో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరనుంది. ఎంపిక చేసిన దరఖాస్తుదారుల పేర్లను స్ర్కీనింగ్‌ కమిటీ ఏఐసీసీకి సీల్డ్‌ కవర్‌లో పంపనుంది. స్ర్కీనింగ్‌ కమిటీ రూపొందించే జాబితాలో తమ పేరు ఉందోలేదోననే ఉత్కంఠ దరఖాస్తుదారుల్లో నెలకొంటుంది. ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించి షార్ట్‌లిస్ట్‌ను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ స్ర్కీనింగ్‌ కమిటీకి అందజేసింది. అయితే నియోజకవర్గాల్లో పోటీ లేకుండా సింగిల్‌ దరఖాస్తులు వచ్చిన వివాదం లేనివాటిని మొదటి జాబితా కింద అభ్యర్థులను రూపొందించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మొదటి జాబితాలో కామారెడ్డి నియోజకవర్గానికి ఆ పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీకి దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది.

స్ర్కీనింగ్‌ కమిటీకి సిఫారస్‌

కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులపై ఇప్పటికే వడపోత ప్రారంభమైంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొత్తం 30 మందికి పైగా టికెట్ల కోసం ఆశావహులు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఇద్దరు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నలుగురు, బాన్సువాడ నియోజకవర్గంలో 16 మంది, జుక్కల్‌ నియోజకవర్గంలో 8 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నియోజకవర్గాలన్నీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ కాన్‌స్టేన్సీ పరిధిలోకి వస్తాయి. పార్లమెంట్‌ పరిధిలో రెండు స్థానాలు బీసీలకు ఇవ్వాలన్నా అధిష్ఠానం ప్రతిపాదన నేపథ్యంలో బాన్సువాడలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జుక్కల్‌లో ఎస్సీ రిజర్వ్‌ కాగా ఎల్లారెడ్డి, కామారెడ్డిలో జనరల్‌కు కేటాయించనున్నట్లు తెలిసింది. ఇప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు రెండు నుంచి నాలుగు పేర్లను స్ర్కీనింగ్‌ కమిటీకి సిఫారస్‌ చేశారు.

ఎల్లారెడ్డి, జుక్కల్‌లో ఇద్దరు.. ఇద్దరు నేతల మధ్య పోటీ

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌లో టికెట్ల అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లోనే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నుంచి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నలుగురు ఆశావహులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వీటిలో ఇద్దరు నేతల మఽధ్యే ప్రధాన పోటి ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావుల పేర్లను స్ర్కీనింగ్‌ కమిటీకి సిఫారస్‌ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వీరిద్దరిపై ఆ పార్టీ అధిష్ఠానం మరోసారి రహస్య సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరిలో ఎవరికి టికెట్‌ ఇవ్వాలనే దానిపై అధిష్ఠానం నిర్ణయించింది. వీరు ఇరువురిలో ఎవరికి టికెట్‌ దక్కకున్నా ఎల్లారెడ్డి నుంచి రెబల్‌గా పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. అఽధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో ఎవరిని బుజ్జగిస్తుందో చూడాలి. జుక్కల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి 8 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా ముగ్గురు నేతల మధ్య టికెట్‌కై పోటీ ఉన్నట్లు పలువురు సీనియర్‌ నేతలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గడుగు గంగారాం, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌, లక్ష్మీకాంత్‌రావుల మధ్యే పోటి ఉంది. వీరిలోనూ ఇద్దరి పేర్లనే స్ర్కీనింగ్‌ కమిటీకి పీసీసీ సిఫారస్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక బాన్సువాడ నియోజకవర్గం దాదాపు బీసీకి ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాసుల బాలరాజుకే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చసాగుతుంది.

టికెట్‌ కోసం ప్రయత్నాలు

పీసీసీ అభ్యర్థుల ఎంపిక వడపోత మంగళవారం నిర్వహించి స్ర్కీనింగ్‌ కమిటీ సమావేశం నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమకు టికెట్‌లు ఇప్పించాలని గాడ్‌ ఫాదర్‌ల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. టికెట్ల కేటాయింపు తుది దశఽకు చేరుకున్న సమయంలో సర్వశక్తులు ఓడుతున్నారు. సర్వేల ఆధారంగానే టికెట్‌ కేటాయింపులు ఉంటాయని అధిష్ఠానం స్పష్టం చేస్తున్న తమ వంతు ప్రయత్నాలు ఆశావహులు చేస్తునే ఉన్నారు. ఆశవాహులు మాత్రం తమ అనుచరుల ముందు తమకే టికెట్‌ ఖాయమని దీమా వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా చాలా మంది నాయకులు రాష్ట్ర రాజధానిలోనే మకాం వేశారు. గాంధీ భవన్‌లో అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంటుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆచితూచి ప్రయత్నిస్తోంది. గెలిచే అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. స్ర్కీనింగ్‌ కమిటీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి నేడో, రేపో ఏఐసీసీకి నివేదించనున్నారు.

Updated Date - 2023-09-06T00:10:15+05:30 IST