రేపటి టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2023-09-14T00:10:38+05:30 IST
జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం నిర్వహించే టెట్ పరీక్ష నిర్వహణలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా కొనసాగేలా తీసుకోవాల్సిన చర్యలపై ఇదివరకే కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఈవో రాజులతో కలిసి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్-1, 2 పేపర్ల పరీక్షల కోసం జిల్లా నుంచి 9,740 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
- జిల్లా వ్యాప్తంగా 9,740 మంది అభ్యర్థులు
- 24 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
- సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల నిర్వహణ
- నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి నో ఎంట్రీ
కామారెడ్డి టౌన్, సెప్టెంబరు 13: జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం నిర్వహించే టెట్ పరీక్ష నిర్వహణలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా కొనసాగేలా తీసుకోవాల్సిన చర్యలపై ఇదివరకే కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఈవో రాజులతో కలిసి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్-1, 2 పేపర్ల పరీక్షల కోసం జిల్లా నుంచి 9,740 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో పేపర్-1 5,530 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా పేపర్-2 4,205 మంది అభ్యర్థులు ఉన్నారు. పేపర్ 1 పరీక్ష నిర్వహణ కోసం 24 కేంద్రాలు, పేపర్-2 కు 19 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలో 240 మంది కేటాయించగా ప్రతీ గదిలో 24 మంది అభ్యర్థులు రాసేలా ఏర్పాట్లు చేశారు. కాగా పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై కేంద్రాల నిర్వాహకులు ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలో నిర్వహించే టెట్ పరీక్షకు 9,740 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 30 శాతం వరకు మొదటిసారి హాజరవుతుండగా మిగితా వారు రెండు అంతకంటే ఎక్కువసార్లు హాజరైన వారు ఉన్నారు. గతంలో టెట్ పరీక్షలు రాసినప్పుడు వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో మరోసారి టెట్ పరీక్షకు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే టెట్ పరీక్ష నిర్వహణ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల నిఘా నీడలో కొనసాగనుంది. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గదుల్లో ఉండే సీసీ కెమెరాల నిఘా నీడలో ప్రశ్నపత్రాల కవర్ల సీల్ తీయడం నుంచి ప్రశ్నపత్రాల పంపిణీ పరీక్షల అనంతరం పేపర్ల కవర్‌లకు సీల్ వేసే ప్రక్రియ అంతా జరగనుంది.
ఆలస్యమైతే కేంద్రంలోకి అనుమతి నిరాకరణ
అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. ఒక నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ మడతపెట్టడం, ముడతలు పడేలా చేయడం, బార్‌కోడ్ జోలికి వెళ్లడం వంటివి చేయకూడదు. పరీక్ష హాల్ టికెట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడంలో అభ్యర్థులకు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట సెల్‌ఫోన్ ఇతర ఎలకా్ట్రనిక్ వస్తువులు తీసుకురావద్దని విద్యాశాఖాధికారులు స్పష్టం చేశారు.
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
టెట్ పరీక్షలో ఎలాంటి తప్పిదాలకు చోటు కల్పించకుండా విద్యాశాఖాధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. టెట్ పరీక్ష నిర్వహణలో 400మంది వరకు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 24 కేంద్రాల్లో 25 మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, 25 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, నాలుగు రూట్లలో ఐదుగురు రూట్ అఽధికారులు, ఐదుగురు అసిస్టెంట్ అధికారులు, 290 మంది ఇన్విజిలెటర్‌లు, హాల్ సూపరింటెండెంట్‌లు 50 మంది సేవలను వినియోగించుకోకున్నారు. వీరితో పాటు అత్యవసర పరిస్థితుల సేవలు చేసేందుకు రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. జిల్లాను నాలుగు రూట్లుగా విభజించారు. ఒక్కో రూట్‌లో విద్య, రెవెన్యూ, పోలీసుశాఖలకు చెందిన నలుగురు అధికారులతో బృందాలను నియమించారు. తమ రూట్‌లో ఉన్న పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష తీరుతెన్నులను పర్యవేక్షించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు.