కుష్టుపై సమరం
ABN , First Publish Date - 2023-08-21T01:25:42+05:30 IST
కుష్టు అనే చర్మ సంబంధిత వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించక పోవడం వల్ల వ్యాధి తీవ్రంగా మారి అంగవైకల్యం వచ్చి మానసికంగా కుంగి పోతున్నారు. అంతేకాకుండా ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కావడంతో సమాజంలో ఈ వ్యాధి సోకిన వారిని ఎవరు హక్కున చేర్చుకోకపోవడం వల్ల విగత జీవులుగా మారి మరణానికి దగ్గరవుతున్నారు. కుష్టు సోకిందంటే చుట్టు పక్కల వారు దూరం పెడుతారనే భయంతో కొందరికి లక్షణాలు కనిపిస్తున్నా వ్యాధి ముదిరేంత వరకు బయటకు రావడం లేదు.
- జిల్లాలో వ్యాధి నివారణకు ఇంటింటి సర్వే
- ప్రివెన్షన్ ఈజ్ బెట్టర్ దెన్ క్యూర్ పేరుతో కార్యక్రమం
- ఈనెల 31 వరకు కొనసాగనున్న సర్వే
- ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్న ఆరోగ్యశాఖ సిబ్బంది
కామారెడ్డి టౌన్, ఆగస్టు 20: కుష్టు అనే చర్మ సంబంధిత వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించక పోవడం వల్ల వ్యాధి తీవ్రంగా మారి అంగవైకల్యం వచ్చి మానసికంగా కుంగి పోతున్నారు. అంతేకాకుండా ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కావడంతో సమాజంలో ఈ వ్యాధి సోకిన వారిని ఎవరు హక్కున చేర్చుకోకపోవడం వల్ల విగత జీవులుగా మారి మరణానికి దగ్గరవుతున్నారు. కుష్టు సోకిందంటే చుట్టు పక్కల వారు దూరం పెడుతారనే భయంతో కొందరికి లక్షణాలు కనిపిస్తున్నా వ్యాధి ముదిరేంత వరకు బయటకు రావడం లేదు. రోగులలో ఉన్న భయానకమైన పరిస్థితులను తీర్చడానికి వారి పట్ల ప్రజలు, దగ్గరి వారు సైతం చూపిస్తున్న చిన్న చూపును దూరం చేసి వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించడంతో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రివెన్షన్ ఈజ్ బెట్టర్ దెన్ క్యూర్ కార్యక్రమం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సర్వేలు నిర్వహిస్తున్నారు.
లెప్రసీ(కుష్టు)వ్యాధి ఎలా సంక్రమిస్తుంది
కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లెప్రి అనే క్రిమి ద్వారా సంక్రమిస్తోంది. ఈ వ్యాధిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. అపరిశుభ్ర ప్రాంతాల్లో నివసించే వారికి ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చిన్న, పెద్ద, మగ, ఆడ తేడా లేకుండా అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తోంది. లాలాజలం ద్వారా రోగితో సన్నిహితంగ ఉన్నా సోకుతోంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలకు, వృద్ధులకు త్వరగా సోకే ప్రమాదముంటుంది.
వ్యాధి లక్షణాలు.. చికిత్స విధానం
ఈ వ్యాధి భారిన పడిన వ్యక్తికి శరీరంపై తెల్లని, ఎర్రని మచ్చలు ఉండడం, చేతులు, కాళ్లు తిమ్మిర్లు రావడం, దీర్ఘ కాలం పుండ్లు మానకపోవడం, శరీర అవయవాలు రోజురోజుకూ కుచించుకుపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వారిని వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ అయితే చికిత్సను ప్రారంభిస్తారు. వ్యాధి తీవ్రతను బట్టి 1 నుంచి 5 మచ్చలు ఉంటే ఆరు నెలలు లేదంటే ఆరు కంటే ఎక్కువ మచ్చలు ఉండి నరాలు ఉబ్బి ఉంటే ఎన్‌డీటీ(బహుళ ఔషధ చికిత్స విధానంలో) 12 నెలల్లో ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. చికిత్సతో పాటు రోగులకు కావలసిన అన్ని మందులను అందిస్తారు. చికిత్సను పొంది మందులు వాడితే వ్యాధి తగ్గుముఖం పట్టి అందరి లాగే సాధారణ జీవనం కొనసాగించవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. ప్రారంభంలోనే గుర్తించి, చికిత్స అందిస్తే అంగ వైకల్యానికి దారి తీయదు. ఒకవేళ అంగవైకల్యం కలిగిన శస్త్ర చికిత్స ద్వారా సరి చేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన వారికి తగిన విధంగా చికిత్సను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి, గాంధారి, పిట్లం, బాన్సువాడ, రామారెడ్డి ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉంటు వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు.
అవగాహనే సరైన మందు..
అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కుష్టు వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకొని వ్యాధిని దరి చేరకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలను జిల్లా లోని అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో నిర్వహించడానికి జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిద్ధమైంది. బాధితులు సమాజానికి దూరమవుతామనే భయంతో బయటకు చెప్పుకోలేక తీరా వ్యాధి తీవ్రమవుతుండగా, ఇతరులకు ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులకు, సమీపంలో నివసించే వారికి ఈ వ్యాధి సోకడానికి కారకులు అవుతున్నారని వైద్య ఆరోగ్యశాఖధికారులు పేర్కొంటున్నారు. వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఆశల ద్వారా ఇంటింటికీ తిరిగి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సర్వే నిర్వహించడంతో పాటు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరిస్తున్నారు.
కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలి
- లక్ష్మణ్‌సింగ్, డీఎంహెచ్‌వో, కామారెడ్డి
జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నాం. ఏదైన అనుమానం ఉంటే లెప్రసీ వైద్యులు చికిత్స ప్రారంభించి మందులు అందిస్తారు. వ్యాధిని బట్టి ఆరు నెలల నుంచి ఏడాది వరకు చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఈనెల 31 వరకు సర్వే కొనసాగుతున్నందున ప్రజలు సహకరించాలి.